ఆరేళ్లు.. రూ.55,743 కోట్లు

Telangana State Paid Interest Of Debts is 55743 Crores - Sakshi

అప్పులపై రాష్ట్రం చెల్లించిన వడ్డీ ఇది

తొలి ఏడాది రూ.5 వేల కోట్ల నుంచి గత ఏడాది రూ.13 వేల కోట్లకు పైగా పెరిగిన వడ్డీలు.. సగటున ఏటా రూ. 9 వేల కోట్లు..

రోజుకు వడ్డీల కింద కడుతోంది రూ.25 కోట్ల పైమాటే 

ఈ ఏడాది రూ. 33 వేల కోట్ల రుణ సమీకరణకు బడ్జెట్‌ ప్రతిపాదనలు 

కరోనా దెబ్బకు మరో రూ. 12 వేల కోట్లకు పైగా రుణాలు అనివార్యం 

ఇప్పుడు జీఎస్టీ పరిహారం రూ. 8 వేల కోట్లను రుణంగా తీసుకోమంటున్న కేంద్రం 

అదే జరిగితే వడ్డీ చెల్లింపులకే ఏటా రూ. 15 వేల కోట్లు అవసరం

సాక్షి, హైదరాబాద్‌: అప్పులు తేవడం.. వాటికి వడ్డీలు, అసలు దఫాల వారీగా చెల్లించడం వ్యక్తులకే కాదు.. ప్రభుత్వానికి తప్పనిసరి. పాలకుల ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు నిరాటంకంగా కొనసాగేందుకు ఏటా ఎంత అప్పులు చేయాలి. వాటికి వడ్డీల కింద ఎంత చెల్లించాలన్నది బడ్జెట్‌లోనే ప్రతి పాదించి చట్టసభల అనుమతి తీసుకోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా పాటిస్తున్నదే. ఇప్పుడీ వడ్డీలు.. చెల్లింపుల గురించి ఎందుకు అంటే?.. రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేసే విషయంలో కట్టుదాటకుండా కట్టడి చేయాల్సిన కేంద్రమే ఇప్పుడు అందుకు సహకారం అందిస్తామంటోంది.

కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర సర్కారు తాను ఇవ్వాల్సిన పరిహారాన్ని ఇవ్వకుండా అప్పులు ఇప్పిస్తాం.. వడ్డీలు కట్టుకోండని ప్రతిపాదిస్తోంది. ఇప్పటికే అప్పులకు వడ్డీల కింద ఏటా రూ. 13 వేల కోట్లు కడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం చెబుతున్నట్టు అప్పులు తెచ్చుకుంటే వాటి వడ్డీలే తడిచి మోపెడవు తాయని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది రాష్ట్ర అభివృద్ధి పయనానికి విఘాతం కలిగిస్తుందని పేర్కొంటున్నాయి. రాష్ట్ర బడ్జెట్‌లో వడ్డీలకే 7–8 శాతం నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నాయి. 

రెట్టింపు కన్నా ఎక్కువే: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఆరేళ్లలో ప్రభుత్వం రూ. 55,743 కోట్లు వడ్డీల కింద చెల్లించిందని కాగ్‌ లెక్కలు చెబుతున్నాయి. గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు, ఈ ఆరేళ్లలో కలిపి చెల్లించాల్సిన వడ్డీలు రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయి. రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాది (2014–15) వడ్డీల కింద రూ.5,195 కోట్లు చెల్లించగా, అది ఏటా పెరుగుతూ గత ఆర్థిక సంవత్సరం (2019–20)లో రూ.13,642 కోట్లకు చేరింది. ఇక, ఈ ఏడాది (2020–21)లో తొలి 3 నెలల్లో కలిపి రూ.3,490 కోట్లు చెల్లించింది. ఇవన్నీ కలిపితే రూ.59,234.30 కోట్లు ఇప్పటివరకు ప్రభుత్వం చెల్లించినట్టు కాగ్‌ లెక్కలు వెల్లడిస్తున్నాయి. అంటే ఏటా సగటున రూ.9,290 కోట్ల చొప్పున రోజుకు రూ.25 కోట్లకు పైగా వడ్డీ కింద చెల్లించాల్సి వస్తోం దన్న మాట. ఇక, 2020–21లో మరో 33,197 కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించింది.

కరోనా వైరస్‌ రూపంలో వచ్చి పడిన ఆర్థిక అగచాట్ల నేపథ్యంలో మూడు నెలల్లోనే రూ.17,670 కోట్లు అప్పు తెచ్చి నడిపించింది. బడ్జెట్‌ లెక్కల ప్రకారమే.. ఇంకో రూ.16 వేల కోట్ల వరకు రుణాలు తీసుకోవాల్సి ఉండగా, కరోనా గండిని పూడ్చుకునేందుకు ఆర్థిక పరిమితులకు లోబడే మరో రూ.12 వేల కోట్లు అప్పులు తేవాలి. ఇప్పుడు కేంద్రం తాను ఇవ్వాల్సిన రూ.8 వేల కోట్లు కూడా అప్పు తీసుకోవాలని రాష్ట్రానికి ప్రతిపాదిస్తుండటం గమనార్హం. ఇదే జరిగితే ఏటా రూ.15 వేల కోట్లు వడ్డీలు చెల్లించడానికే సరిపోతాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top