టాప్‌ 8లో తెలంగాణ: 9 నెలల్లో 6,466 కోట్ల ఎఫ్‌డీఐలు

Telangana Stands 8Th Place In Attraction Of FDI - Sakshi

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో 8వ స్థానంలో రాష్ట్రం

దేశవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో అధికంగా పెట్టుబడులు

డీపీఐఐటీ విడుదల చేసిన తాజా గణాంకాల్లో వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఆకర్షణలో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020–21లో ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్య 9 నెలల కాలానికి మొత్తం రూ. 6,466 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయి. ఇవి దేశంలోని మొత్తం ఎఫ్‌డీఐల రాకలో 2 శాతం. అక్టోబర్‌ 2019 నుంచి డిసెంబర్‌ 2020 వరకు మొత్తంగా రూ.11,331.61 కోట్లు వచ్చాయి. ఇది మొత్తం ఎఫ్‌డీఐల్లో 2.4 శాతంగా ఉంది. అక్టోబర్‌ 2019 నుంచి డిసెంబర్‌ 2020 వరకు దేశవ్యాప్తంగా మొత్తం రూ.5,54,613.65 కోట్ల మేర ఎఫ్‌డీఐలు దేశంలోకి వచ్చాయి. ఇందులో 31.92 శాతంతో గుజరాత్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఏకంగా రూ.1,77,052 కోట్ల మేర ఆ రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లభించాయి. రూ.1,53,351 కోట్లతో మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. మొత్తం ఎఫ్‌డీఐలలో మహారాష్ట్ర వాటా 27.65 శాతంగా ఉంది. అలాగే రూ.78,159 కోట్లు ఆకర్షించి కర్ణాటక మూడో స్థానంలో, రూ. 59,830 కోట్లతో ఢిల్లీ నాలుగో స్థానంలో, రూ.19,733 కోట్లతో తమిళనాడు ఐదో స్థానంలో నిలిచాయి. రూ.1,975.74 కోట్ల ఎఫ్‌డీఐలతో ఆంధ్రప్రదేశ్‌ 12వ స్థానంలో నిలిచింది.

సర్వీస్‌ సెక్టార్‌లోనే అత్యధికం..
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సేవా రంగంలోనే అత్యధికంగా వస్తున్నాయి. ఫైనాన్షియల్, బ్యాంకింగ్, నాన్‌–ఫైనాన్షియల్, ఔట్‌సోర్సింగ్, పరిశోధన-అభివృద్ధి, కొరియర్, టెక్నాలజీ, టెస్టింగ్‌ అండ్‌ అనాలిసిస్‌ తదితర సేవలు అందించే ఈ రంగానికి 16 శాతం ఎఫ్‌డీఐలు రాగా ఆ తరువాత కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ పరిశ్రమలోకి 13 శాతం పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ పరిశ్రమలోకి ఏకంగా రూ.1,81,470 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ రెండు రంగాల తరువాత వరుసగా టెలి కమ్యూనికేషన్లు (7 శాతం), ట్రేడింగ్‌ (6 శాతం), భవన నిర్మాణ రంగం (5 శాతం), ఆటో పరిశ్రమ (5 శాతం), మౌలికవసతుల నిర్మాణ రంగం (5 శాతం), రసాయనాలు (4 శాతం), ఫార్మా (3 శాతం), హోటల్, టూరిజం (3 శాతం) రంగాలు నిలిచాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top