breaking news
attracts
-
లోన్‌యాప్స్ లోగుట్టు: తొందర పడ్డారో.. ఇక అంతే సంగతులు
అప్పులు ఇచ్చేటపుడు చాలా మర్యాదగా మాట్లాడతారు. ఇచ్చిన తర్వాత బాకీల వసూలు సమయంలో బండబూతులు తిడుతున్నారు. బంధుమిత్రుల్లో పరువు తీసేలా అప్పులు తీసుకున్న వారి ఫోటోలను అసభ్యంగా మార్చి వైరల్ చేస్తున్నారు. ఈ అవమానాలు భరించలేక అమాయక ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయిన వాళ్లకి విషాదాన్ని మిగులుస్తున్నారు. ఇంతటి దారుణ మారణ కాండలకు తెగబడుతోన్న యాప్ లో వెనక చైనా మూలాలు ఉన్నాయని అంటున్నారు. ఇటువంటి యాప్ లపై ఉక్కుపాదం మోపకపోతే పరిస్థితి మరింతగా విషమించే ప్రమాదం ఉంది. లోన్‌యాప్స్.. లోగుట్టు వాటి కథా కమామిష్షు ఏంటో చూద్దాం!! అవసరానికి అప్పులు ఇస్తాం.. పేపర్స్.. ప్రాసెస్ ఏమీ అవసరంలేదు ..గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్‌లో తరచుగా వినిపించే మాటలివి. ఆప్యాయంగా మాటలు కలిపి అప్పులు అంటకడుతోన్న యాప్‌లో ఆ తర్వాత బాకీల వసూలులో రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. లోన్ రికవరీ ఏజెంట్లను పంపి రక రకాలుగా అవమానిస్తున్నారు. వేధిస్తున్నారు. కాల్చుకు తినేస్తున్నారు. బంధుమిత్రుల్లో పరువు తీసేలా వ్యవహరిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఎంతో మంది అప్పులు తీసుకున్న వాళ్లు ఆత్మహత్యలతో తమ జీవితాలకు సెలవు ప్రకటిస్తున్నారు. అయిన వాళ్లకి గుండెల నిండా విషాదాన్ని మిగిల్చి పోతున్నారు. అప్పుల వసూళ్ల ముసుగులో లోన్ యాప్ సిబ్బంది చేస్తోన్న దుర్మార్గాలకు అడ్డుకట్ట లేకపోతోంది. చాలా మంది ఈ వేధింపులను తమలో తామే దిగమింగు కుంటున్నారు. ఎవరికైనా చెబితే పరువు పోతుందేమోనని మౌనంగా నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇక భరించలేని స్థితికి రాగానే ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. పాపం ప్రత్యూష కృష్ణాజిల్లా మచిలీ పట్నం శారదానగర్ కు చెందిన జూనపూడి ప్రత్యూష డబ్బు అవసరమై ఇండియన్ బుల్స్ అనే లోన్ యాప్‌లో అప్పు కోసం ప్రయత్నించింది. లోన్ ఇవ్వాలంటే ముందుగా పదివేల రూపాయలు డిపాజిట్ చేయాలని షరతు విధించారు. ఆ పదివేల కోసం రూపెక్స్ అనే మరో లోన్ యాప్ ను ఆశ్రయించింది ప్రత్యూష. ఆ డబ్బును ఇండియన్ బుల్స్ కు చెల్లించింది. అయితే ఆ తర్వాత నుంచి ఈ యాప్ ఏజెంట్లు ప్రత్యూషను వేధించడం మొదలు పెట్టారు. ఈ బాధలు భరించలేక తన తల్లి నుండి 90వేలు తీసుకుని రెండు యాప్ లకూ చెల్లించింది. అయినా ఇంకా బాకీ ఉందంటూ ఫోన్లలో వేధించడంతో ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటువంటి ఘటనలు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. అసలు నిబంధనలేం చెబుతున్నాయి? సామాన్య, మధ్యతరగతి వర్గాలే టార్గెట్ గా లోన్ యాప్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇలా అప్పులు ఇవ్వాలంటే ఈ యాప్ లకు NBFC లైసెన్స్ తప్పని సరిగా ఉండాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఈ లైసెన్సులు మంజూరు చేస్తుంది. ఈ లైసెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే లోన్ యాప్ లు గూగుల్ ప్లే స్టోర్ లో అప్ లోడ్ అవుతాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎవరికైనా అప్పులు ఇస్తే అది తీర్చడానికి కనీసం 60 రోజుల గడువు ఇవ్వాలి. ఆ నిబంధన పాటించే యాప్ లే గూగుల్ ప్లే స్టోర్ లో రిజిస్టర్ అవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడా లోన్ యాప్ కంపెనీలు చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకుంటున్నాయి. పైకి ఒకరకమైన షరతులను పేర్కొంటూ డబ్బులు వసూలు చేసేటప్పుడు మరో పద్ధతి ఫాలో అవుతున్నాయి. లోన్లు ఇచ్చే సంస్థలెన్ని.? ఆర్బీఐ డేటా ప్రకారం.. ఫిబ్రవరి 29, 2020 నాటికి 10వేల వరకు NBFC లైసెన్స్ లు ఉన్నాయి. వారిలో 803 మాత్రమే 100 కోట్ల విలువ కలిగిన సంస్థలు ఉన్నాయి. 60 రోజుల కంటే తక్కువ కాల పరిమితి లోన్లు ఇచ్చే యాప్స్‌కు గూగుల్ ప్లే స్టోర్ అనుమతి ఇవ్వదు.పుడు మరో రకమైన నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఇలా దేశంలో పదివేలకు పైగా లోన్ యాప్స్ ఉన్నాయి. వీటిలో మెజారిటీ యాప్ ల మూలాలు చైనాలో ఉన్నాయి. గతంలో లోన్ యాప్‌లతో మన నిబంధనలను చట్టాలను అడ్డగోలుగా ఉల్లంఘించిన చైనా కంపెనీలను అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీలు మూసివేసినా.. చైనా కంపెనీలు కొత్త కంపెనీలతో మళ్లీ ఆ దందా సాగిస్తున్నారు. లోన్ వెనక లోగుట్టు ఏంటీ? మామూలుగా బ్యాంకుల్లో పర్సనల్ లోన్ లు కావాలంటే బోలెడు డాక్యుమెంట్లు సమర్పించాలి. అదే లోన్ యాప్‌లో అయితే ఎలాంటి డాక్యుమెంట్లూ అవసరం ఉండదు. కేవలం ఆధార్ నంబర్ ఇస్తే చాలు. ఒక్కసారి ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే మన ఫోనులోని సమస్త సమాచారం యాప్ నిర్వాహకులకు వెళ్లిపోతుంది. ఇక ఆ సమాచారాన్ని పట్టుకుని వారు ఇష్టారాజ్యంగా వేధింపులకు తెగబడుతున్నారు. వేధింపుల పర్వం అప్పులు తీసుకున్న వాళ్లు అనుకున్న సమయానికి బాకీ తీర్చకపోతే వారి ఫోటోలను న్యూడ్ గా మార్చేసి బంధుమిత్రుల ఫోన్లకు పంపుతున్నారు. ఫోన్లు చేసి మీకు సిగ్గులేదా? తీసుకున్న అప్పు తీర్చరా? అంటూ బూతులు తిడుతున్నారు. పరువు తీసేలా మెసేజీలు పెడుతున్నారు. ఇవి తట్టుకోలేకనే సున్నిత మనస్కులైన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తీసుకున్న అప్పుమీద లోన్ యాప్ నిర్వాహకులు వడ్డీలు, చక్రవడ్డీలు ఆపై భూచక్ర వడ్డీలూ వేసేసి పాపం పెంచినట్లు వడ్డీలు పెంచేసుకు పోతున్నారు. తీసుకున్న అప్పులకు వందల రెట్లు వడ్డీ కట్టినా ఇంకా అసలు అలానే ఉంటోంది. అదే ప్రజల ప్రాణాలు తీస్తోంది. ఫోటో, ఆధార్ కార్డ్, కాంటాక్ట్ నెంబర్లే ష్యూరిటీగా మూడు వేల నుంచి 2 లక్షల వరకు రుణాలను అందిస్తున్నాయి ఈ యాప్స్. ఈ అప్పును పది నుంచి 15 రోజుల్లోనే తీర్చేయాలి. అప్పు సరైన సమయంలో చెల్లిస్తే సరి.. లేదంటే అప్పటి నుంచి మొదలవుతాయి వేధింపులు. తల్లిదండ్రులు, బంధువులు, ఫ్రెండ్స్‌కు ఫోన్లు చేస్తామంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ.. యువతీ, యువకుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఇంకా కొంత మందికైతే లోన్ కట్టడం చేతకాని నువ్వు బతకడం ఎందుకంటూ వాయిస్ మేసెజ్‌లు కూడా వస్తున్నాయి. అందుకే అసలు ఇటువంటి యాప్ లను గూగుల్ ప్లే స్టోర్ లో లేకుండా చేయాలన్న డిమాండ్లూ వినపడుతున్నాయి. లోన్ యాప్ ల దుర్మార్గాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. ఎన్.బి.ఎఫ్.సి. లైసెన్సులు పొందిన లోన్ యాప్ లకు అనుబంధంగా పనిచేసే యాప్ లపై ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది. ఇప్పటికే చైనాకు 4వేల 430కోట్ల రూపాయల మేరకు నిధులను తరలించిన లోన్ యాప్ లను గుర్తించిన ఈడీ ఆ యాప్ లకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. ఈ అక్రమ దందాలకు పాల్పడుతోన్న వారికోసం వేట మొదలు పెట్టింది. అప్పులు లేకుండా ఎవరూ బతుకులు వెళ్లదీయలేరు. అయితే అప్పులు తీసుకునే ముందు చాలా అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. అప్పులు మనల్ని నిండా ముంచేసేలా ఉంటే మన అవసరాలను వాయిదా వేసుకున్నా ఫరవాలేదు కానీ తొందరపడి అప్పులు తీసుకుని ఊబిలో కూరుకు పోరాదు. అన్నింటినీ మించి అప్పులు ఇస్తానన్నాడు కదా అని మన సమస్త సమాచారాన్ని లోన్ యాప్ లకు తాకట్టు పెట్టేయడంలోనే అతి పెద్ద ముప్పు ఉంది. -
ఏపీలో గోవా తరహా బీచ్‌లు, కేరళ బ్యాక్ వాటర్ అందాల.. ఎక్కడో తెలుసా?
సాక్షి, అమరావతి: మంచు సోయగాల సొగసులో.. పైరగాలుల చలిలో.. పచ్చని దుప్పటిలో.. హాయిగా ఒదిగి.. గోదావరి గలగలల మధ్య.. పిల్లకాలువల సవ్వడిలో మునిగి.. దివిని మించిన దీవిలా ప్రకృతి ఒడిలో దిండి సేదతీరుతోంది. గోవా తరహా బీచ్‌లు.. కేరళలో కనిపించే బ్యాక్‌వాటర్స్ అందాలు.. హౌస్ బోట్ల పరుగుల సమాహారంతో కోనసీమ సిగలో సరికొత్త అందాలను సంతరించుకుని .. పర్యాటకులను ‘దిండి’ యాత్రకు ఆహ్వానిస్తోంది. అటు గోదావరి.. ఇటు సముద్రం ఒకవైపు బంగాళాఖాతం.. మరోవైపు గోదావరి.. ఈ రెండింటి సంగమం అన్నాచెల్లెళ్ల గట్టును బోటు ప్రమాణంలో వీక్షించవచ్చు. సముద్రం ఒడ్డును కొలువైన లక్ష్మీనరసింహస్వామి, సమీపంలోని అయినవిల్లి, ముక్తేశ్వరం ఆలయాలను దర్శించవచ్చు. శతాబ్దాలుగా భద్రపరచబడిన తమిళ సంస్కృతిని చాటే పేరూరు వారసత్వం గ్రామం, లైట్‌హౌస్ ఇతర సందర్శనీయ స్థలాలు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి 80 కిలో మీటర్లు, రాజోలు నుంచి 8 కిలోమీటర్లు, పాలకొల్లు రైల్వే స్టేషన్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో దిండి ఉంది. అక్టోబర్ నుంచి మార్చి వరకు పర్యటనకు అనుకూలం. దిండిలో రెండు రిసార్టులు దిండిలో పర్యాటక శాఖకు చెందిన హరిత కోకోనట్ కంట్రీ రిసార్ట్‌లో 32 ఏసీ గదులతో పాటు రెస్టారెంట్, కాన్ఫరెన్స్ హాల్, స్విమ్మింగ్ పూల్ ఉంది. సాధారణ రోజుల్లో రోజుకు 50శాతం ఆక్యుపెన్సీతోనూ, వీకెండ్లో వంద శాతం గదులు నిండిపోతున్నాయి. అంతేకాకుండా దిండిలో వాటర్ స్పోర్ట్స్ ఆస్వాదించేందుకు 200 నుంచి 500 మందికి పైగా పర్యాటకులు వస్తున్నారు. దిండి కోనసీమ గాడ్ సిటీ కేరళ తరహా అందాలకు దిండి పెట్టింది పేరు. ఇక్కడ పర్యాటక శాఖ రిసార్టు అత్యాధుని సౌకర్యాలతో బస కల్పిస్తోంది. హౌస్ బోట్ల ప్రయాణం కోసం పర్యాటకులు పోటీపడుతుంటారు. వీటిని కుటుంబ సమేతంగా గడపడానికి అనువుగా తీర్చిదిద్దాం. – సత్యనారాయణ, ఎండీ, ఏపీటీడీపీ ప్రత్యేక ఆకర్షణగా హౌస్ బోట్లు.. తూర్పుగోదావరి జిల్లాలోని దిండిలోని దట్టమైన మడ అడవులు మధ్య బ్యాక్ వాటర్స్‌లో బోటు ప్రయాణం పర్యాటకులను కట్టిపడేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర పర్యాటక శాఖ కేరళ తరహా హౌస్బోట్లను ప్రవేశపెట్టింది. వీటిలో అటాచ్డ్ బాత్రూమ్, ఏసీ, సిటౌట్, డైనింగ్ ఏరియా... ఇలా నక్షత్రాల హోటల్‌ను మరిపించే సౌకర్యాలతో రెండు హౌస్ బోట్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. ఈ బోట్లు దాదాపు 40 కిలో మీటర్ల మేర గోదావరిలో ప్రయాణిస్తాయి. దిండిలో బయలు దేరి రాజోలు లంక ఐలాండ్Š, నరసాపురం రేవు నుంచి తిరిగి గమ్యస్థానానికి చేరుకుంటాయి. మరోవైపు రెండు పాంటూన్ బోట్లు, ఒక లగ్జరీ బోటు, స్పీడ్ బోటు సౌకర్యం కూడా ఉంది. చదవండి: ఒంగోలు జాతి కోడె దూడ ధర రూ.2 లక్షలు -
రియాల్టీలో ఈక్విటీ జోష్ : వేల కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా సమయంలోనూ దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) జోరు తగ్గట్లేదు. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో (జనవరి–జూన్) రియలీ్టలోకి 2.7 బిలియన్ డాలర్లు (రూ.14,300 కోట్ల) పీఈ పెట్టుబడులు వచ్చాయి. వాణిజ్య ఆస్తులకు డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి ప్రధాన కారణమని ప్రాపర్టీ కన్సల్టెంట్ సావిల్స్ ఇండియా తెలిపింది. గతేడాది జనవరి–జూన్‌లో 870 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్.. ఏడాది మొత్తంలో 6.6 బిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది. కోవిడ్ నేపథ్యంలో మందగమనం ఉన్నప్పటికీ పెట్టుబడిదారులలో విశ్వాసం చెక్కుచెదరలేదని పీఈ పెట్టుబడుల వెల్లువకు ఇదే నిదర్శనమని తెలిపింది. త్రైమాసికం వారీగా చూస్తే ఈ ఏడాది ఏప్రిల్-జూన్ (క్యూ2) క్వాటర్లో పీఈ పెట్టుబడులు 54 శాతం క్షీణించి 865 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వర్క్ ఫ్రం హోమ్, రిమోట్ వర్కింగ్ విధానాలు అమలులో ఉన్నప్పటికీ ఈ ఏడాది క్యూ2లో వాణిజ్య కార్యాలయ లావాదేవీలు జోరుగానే సాగాయని.. పెట్టుబడులలో వీటి 40 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఈ తర్వాత 33 శాతం పెట్టుబడుల వాటాతో రిటైల్ విభాగం ఉంది. కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ (సీపీపీఐబీ), జీఐసీ వంటి విదేశీ పెట్టుబడిదారులు కోల్‌కతా, ముంబై, పుణే నగరాలలో రిటైల్ విభాగంలో 21 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు రిపోర్ట్ వెల్లడించింది. కోవిడ్ నేపథ్యంలోనూ వాణిజ్య ఆఫీస్ విభాగంలో విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగుతున్నాయని.. ఈ రంగంలో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని ఇది సూచిస్తుందని సావిల్స్ ఇండియా ఎండీ దివాకర్ రానా తెలిపారు. సమీప భవిష్యత్తులోను ఇలాంటి లావాదేవీలే జరుగుతాయని అంచనా వేశారు. -
టాప్ 8లో తెలంగాణ: 9 నెలల్లో 6,466 కోట్ల ఎఫ్‌డీఐలు
సాక్షి, న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఆకర్షణలో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020–21లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య 9 నెలల కాలానికి మొత్తం రూ. 6,466 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయి. ఇవి దేశంలోని మొత్తం ఎఫ్‌డీఐల రాకలో 2 శాతం. అక్టోబర్ 2019 నుంచి డిసెంబర్ 2020 వరకు మొత్తంగా రూ.11,331.61 కోట్లు వచ్చాయి. ఇది మొత్తం ఎఫ్‌డీఐల్లో 2.4 శాతంగా ఉంది. అక్టోబర్ 2019 నుంచి డిసెంబర్ 2020 వరకు దేశవ్యాప్తంగా మొత్తం రూ.5,54,613.65 కోట్ల మేర ఎఫ్‌డీఐలు దేశంలోకి వచ్చాయి. ఇందులో 31.92 శాతంతో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. ఏకంగా రూ.1,77,052 కోట్ల మేర ఆ రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లభించాయి. రూ.1,53,351 కోట్లతో మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. మొత్తం ఎఫ్‌డీఐలలో మహారాష్ట్ర వాటా 27.65 శాతంగా ఉంది. అలాగే రూ.78,159 కోట్లు ఆకర్షించి కర్ణాటక మూడో స్థానంలో, రూ. 59,830 కోట్లతో ఢిల్లీ నాలుగో స్థానంలో, రూ.19,733 కోట్లతో తమిళనాడు ఐదో స్థానంలో నిలిచాయి. రూ.1,975.74 కోట్ల ఎఫ్‌డీఐలతో ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో నిలిచింది. సర్వీస్ సెక్టార్లోనే అత్యధికం.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సేవా రంగంలోనే అత్యధికంగా వస్తున్నాయి. ఫైనాన్షియల్, బ్యాంకింగ్, నాన్–ఫైనాన్షియల్, ఔట్సోర్సింగ్, పరిశోధన-అభివృద్ధి, కొరియర్, టెక్నాలజీ, టెస్టింగ్ అండ్ అనాలిసిస్ తదితర సేవలు అందించే ఈ రంగానికి 16 శాతం ఎఫ్‌డీఐలు రాగా ఆ తరువాత కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ పరిశ్రమలోకి 13 శాతం పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ పరిశ్రమలోకి ఏకంగా రూ.1,81,470 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ రెండు రంగాల తరువాత వరుసగా టెలి కమ్యూనికేషన్లు (7 శాతం), ట్రేడింగ్ (6 శాతం), భవన నిర్మాణ రంగం (5 శాతం), ఆటో పరిశ్రమ (5 శాతం), మౌలికవసతుల నిర్మాణ రంగం (5 శాతం), రసాయనాలు (4 శాతం), ఫార్మా (3 శాతం), హోటల్, టూరిజం (3 శాతం) రంగాలు నిలిచాయి. -
ప్రజలను ఆకర్షిస్తున్న కాంగ్రెస్ 'షోలే' పోస్టర్
-
అభిమానుల్లో నిరాశ పోగొట్టిన సమంత..
అమె అందంలో ఛేంజ్ వచ్చేసిందంటూ నిరాశ పడ్డ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది సమంత. జూన్ నెలలో వెలువడ్డ ఓ సినీ మ్యాగజిన్ పై కనిపించిన పోస్టర్.. అభిమానులను కట్టిపడేసింది. అందానికి మరోపేరు సమంత అనేట్లుగా... నిండైన వస్త్రధారణ, బంగారు వన్నెలొలికించే సంప్రదాయ పట్టుచీరతో అందర్నీ ఆకట్టుకుంది. సమంతలో ఛార్మ్ తగ్గిందేమో అన్న అనుమానాలకు చెక్ పెట్టేసింది. ఆరేళ్ళుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అనిపించుకుంటూ... తన అద్భుతమైన నటనతో ఎందరో హీరోయిన్లను దాటేసి నెంబర్ వన్ స్థానంలోకి వచ్చేసింది సమంత. అందంలో మిగిలిన వారితో పోలిస్తే కాస్త వెనుకబడ్డా.. నటనతో పోటీపడి వారందరికీ దీటుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆకట్టుకునే లుక్స్ తో అద్భుతమైన నటనతో ఈగ, బృందావనం వంటి సినిమాల్లో ఆమె రూపం సైతం అందర్నీ కట్టి పడేసింది. అయితే ఆ తర్వాత ఆమెలో వచ్చిన ఛేంజ్ ను, తగ్గిన ఛార్మ్ ను చూసి అభిమానులు దిగాలు పడిపోయారు. అప్పట్లో ఆమెకు స్కిన్ ఎలర్జీ వచ్చిందని, అదే ఆమె అందాన్ని దెబ్బతీసిందని వార్తలు వచ్చాయి. అయితే చక్కనమ్మ చిక్కినా అందమే... సన్నబట్ట నలిగినా అందమే అన్న సామెతకు సంమత సరిగ్గా సరిపోతుందని ఇటీవల వెలువడిన 'గలాటా సినిమా' మ్యాగజిన్ నిరూపించింది. ఆ పుస్తకం కవర్ పేజీ మీద కనిపించిన పోస్టర్ చూస్తే ఆమె అందం తరిగేదికాదని అర్థమౌతుంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 24 సినిమాలో సమంతలో ఏదో లోపం ఉందంటూ అభిమానులు నిరాశ పడ్డారు. కానీ ఫేస్ లో కాస్త గ్లో తగ్గినా తన నటనతో ఆఫీలింగ్ నుంచి వారిని బయట పడేయగలిగింది అయితే ఇప్పుడు తాజాగా వెలువడిన గలాటా సినిమా మ్యాగజిన్ లో అటువంటి అనుమానాలకు పూర్తిగా చెక్ పెట్టేసింది ఆ చెన్నై సుందరి. సౌత్ ఇండియన్ మూవీ మ్యాగజిన్ కవర్ పేజ్ పై బంగారు బొమ్మలాంటి రూపంలో ప్రత్యక్షమైన సమంత.. తనలో అందం ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. మ్యాగజిన్ పోస్టర్ పై గోల్డెన్ డామినేటెడ్ జరీ బోర్డర్ సంప్రదాయ పట్టుచీరకు తోడు.. నిండైన డిజైనర్ బ్లౌజ్.. ఆమె అందాన్ని మరింత ఇనుమడింజేసింది. అంతేకాదు 'గలాటా సినిమా' జూన్ 2016 మ్యాగజిన్ కోసం తీసిన ప్రత్యేక ఫోటో షూట్ కు సంబంధించిన చిత్రాల్లోనూ ఆమె అందం కళ్ళు తిప్పుకోకుండా చేస్తోంది. సంమంత నిజంగా గ్లామరస్ బ్యూటీ క్వీన్ అని మరోమారు రుజువు చేస్తోంది. -
ఆకట్టుకుంటున్న ఆర్మీ ఆయుధ ప్రదర్శన
-
టూరిస్టులకు ప్రత్యేకాకర్షణ..!
దేశ భక్తిని చాటే అతి పెద్ద త్రివర్ణ పతాకం.. ఇప్పుడా రాష్ట్రంలో టూరిస్టులకు ప్రత్యేకార్షణగా మారింది. డల్హౌసీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన జాతీయ పతాకం ఇంఫాల్ ప్రజలను ఆకట్టుకుంటోంది. గత సంవత్సరం అక్టోబర్ 19న పాఠశాల 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ మువ్వన్నెల జెండా ఆకాశ హర్మ్యాలను దాటి... రెపరెపలాడుతూ సందర్శకుల గుండెల్లో దేశ భక్తిని నింపుతోంది. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అప్పట్లో వైస్ అడ్మిరల్ అనురాగ్ జి తపియాల్, ఏవీఎస్ ఎమ్ అండ్ బార్, డైరెక్టర్ జనరల్, భారత కోస్ట్ గార్డ్ లు ఈ జెండాను ఆవిష్కరించారు. ఇప్పటికే డల్హౌసీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మిగ్-21 యుద్ధ విమానం కూడ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఆర్మీ కమాండర్, పశ్చిమ కమాండ్, లెఫ్టినెంట్ జనరల్ కేజే సింగ్ ఆధ్వర్యంలో జూన్ 3న టి-55 రష్యన్ యుద్ధ ట్యాంక్ ను ఈ పాఠశాల ప్రాంగణంలో స్థాపించారు. ప్రస్తుతం క్రీడా దిగ్గజం మిగ్-21 యుద్ధ విమానం, సర్ఫేస్ టు ఎయిర్ పిఛోరా క్షిపణులు, టి-55 యుద్ధ ట్యాంక్ తో పాటు... పాఠశాలకే ప్రత్యేకాకర్షణగా నిలిచిన అతిపెద్ద జాతీయ పతాకం.. వీక్షకులకు అద్భుతాన్ని తలపిస్తోంది. ఈ ప్రాంగణంలో మిగిలిన ట్రోఫీల నుంచి ఓ నౌకను కూడా ఏర్పాటుచేస్తే.... ఇదో నావికా ప్రాతినిధ్య కేంద్రంగా రూపొందే అవకాశం ఉందని.. పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్, డాక్టర్ జీఎస్ థిల్లాన్ అన్నారు. దేశానికి సైనికులు గర్వకారణమని, వారికి సంబంధించిన వస్తువులను ప్రదర్శించడం వల్ల రక్షణ సేవలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహనతో కలగడంతోపాటు, వారిపై మంచి ప్రభావం ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.