Dindi Backwaters: ఏపీలో గోవా తరహా బీచ్‌లు, కేరళ బ్యాక్‌ వాటర్‌ అందాల.. ఎక్కడో తెలుసా?

Tourists Attracts Dindi Konaseema New Backwater Destination - Sakshi

గోదావరిలో ప్రత్యేక ఆకర్షణగా హౌస్‌బోట్లు

దట్టమైన మడ అడవుల మధ్య వాటర్‌ స్పోర్ట్స్‌ 

అత్యాధునిక రిసార్టులు

రాజమండ్రి విమానాశ్రయం నుంచి 80 కిలోమీటర్లు

సాక్షి, అమరావతి: మంచు సోయగాల సొగసులో.. పైరగాలుల చలిలో.. పచ్చని దుప్పటిలో.. హాయిగా ఒదిగి.. గోదావరి గలగలల మధ్య.. పిల్లకాలువల సవ్వడిలో మునిగి.. దివిని మించిన దీవిలా ప్రకృతి ఒడిలో దిండి సేదతీరుతోంది. గోవా తరహా  బీచ్‌లు.. కేరళలో కనిపించే బ్యాక్‌వాటర్స్‌ అందాలు.. హౌస్‌ బోట్ల పరుగుల సమాహారంతో కోనసీమ సిగలో సరికొత్త అందాలను సంతరించుకుని .. పర్యాటకులను ‘దిండి’ యాత్రకు ఆహ్వానిస్తోంది.

అటు గోదావరి.. ఇటు సముద్రం
ఒకవైపు బంగాళాఖాతం.. మరోవైపు గోదావరి.. ఈ రెండింటి సంగమం అన్నాచెల్లెళ్ల  గట్టును బోటు ప్రమాణంలో వీక్షించవచ్చు. సముద్రం ఒడ్డును కొలువైన లక్ష్మీనరసింహస్వామి, సమీపంలోని అయినవిల్లి, ముక్తేశ్వరం ఆలయాలను దర్శించవచ్చు. శతాబ్దాలుగా భద్రపరచబడిన తమిళ సంస్కృతిని చాటే పేరూరు వారసత్వం గ్రామం, లైట్‌హౌస్‌ ఇతర సందర్శనీయ స్థలాలు.  రాజమండ్రి విమానాశ్రయం నుంచి 80 కిలో మీటర్లు, రాజోలు నుంచి 8 కిలోమీటర్లు, పాలకొల్లు రైల్వే స్టేషన్‌ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో దిండి ఉంది. అక్టోబర్‌ నుంచి మార్చి వరకు పర్యటనకు అనుకూలం.

దిండిలో రెండు రిసార్టులు
దిండిలో పర్యాటక శాఖకు చెందిన హరిత కోకోనట్‌ కంట్రీ రిసార్ట్‌లో 32 ఏసీ గదులతో పాటు రెస్టారెంట్, కాన్ఫరెన్స్‌ హాల్, స్విమ్మింగ్‌ పూల్‌ ఉంది. సాధారణ రోజుల్లో  రోజుకు 50శాతం ఆక్యుపెన్సీతోనూ, వీకెండ్‌లో వంద శాతం గదులు నిండిపోతున్నాయి. అంతేకాకుండా దిండిలో వాటర్‌ స్పోర్ట్స్‌ ఆస్వాదించేందుకు 200 నుంచి 500 మందికి పైగా పర్యాటకులు వస్తున్నారు. 

దిండి కోనసీమ గాడ్‌ సిటీ
కేరళ తరహా అందాలకు దిండి పెట్టింది పేరు. ఇక్కడ పర్యాటక శాఖ రిసార్టు అత్యాధుని సౌకర్యాలతో బస కల్పిస్తోంది. హౌస్‌ బోట్ల ప్రయాణం కోసం పర్యాటకులు పోటీపడుతుంటారు. వీటిని కుటుంబ సమేతంగా గడపడానికి అనువుగా తీర్చిదిద్దాం.  
– సత్యనారాయణ, ఎండీ, ఏపీటీడీపీ 

ప్రత్యేక ఆకర్షణగా హౌస్‌ బోట్లు..
తూర్పుగోదావరి జిల్లాలోని దిండిలోని దట్టమైన మడ అడవులు మధ్య బ్యాక్‌ వాటర్స్‌లో బోటు ప్రయాణం పర్యాటకులను కట్టిపడేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర పర్యాటక శాఖ కేరళ తరహా హౌస్‌బోట్లను ప్రవేశపెట్టింది. వీటిలో అటాచ్డ్‌ బాత్‌రూమ్, ఏసీ, సిటౌట్, డైనింగ్‌ ఏరియా... ఇలా నక్షత్రాల హోటల్‌ను మరిపించే సౌకర్యాలతో రెండు హౌస్‌ బోట్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. ఈ బోట్లు దాదాపు 40 కిలో మీటర్ల మేర గోదావరిలో ప్రయాణిస్తాయి. దిండిలో బయలు దేరి రాజోలు లంక ఐలాండ్‌Š, నరసాపురం రేవు నుంచి తిరిగి గమ్యస్థానానికి చేరుకుంటాయి. మరోవైపు రెండు పాంటూన్‌ బోట్లు, ఒక లగ్జరీ బోటు, స్పీడ్‌ బోటు సౌకర్యం కూడా ఉంది.

చదవండి: ఒంగోలు జాతి కోడె దూడ ధర రూ.2 లక్షలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top