రెవెన్యూ కాదు.. ‘భూ పరిపాలన’ శాఖ!

Telangana Revenue Department Name Going To Change As BhooParipaalana Department - Sakshi

కొత్తపేరుపై త్వరలో కేసీఆర్‌ తుది నిర్ణయం

పరిశీలనలోని మరో పేరు భూ నిర్వహణ శాఖ

ఇప్పటికే పేరు మార్పుపై రెవెన్యూ సంఘాలతో సీఎం చర్చ

డిజిటల్‌ సర్వే తొలుత పైలట్‌గా చేపట్టే అవకాశం... గ్రామం యూనిట్‌గా చేసిన తర్వాతే ముందుకు

మరఠ్వాడా సర్వేను ముట్టుకోవడం అంత ఈజీ కాదంటున్న రెవెన్యూ వర్గాలు

జీపీఎస్‌ ద్వారానా... డ్రోన్‌ సర్వేనా అన్న దానిపై చర్చ

సాక్షి, హైదరాబాద్‌: రెవెన్యూ శాఖ స్వరూపంలో మార్పు వచ్చినందున.. విధులు, బాధ్యతలు మారనున్నందున ఆ శాఖ పేరును మారుస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. భూరికార్డుల ప్రక్షాళన నుంచి తహశీల్దార్లకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతల అప్పగింత వరకు రెవెన్యూ శాఖలో పూర్తిస్థాయి సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్న విషయం తెలిసిందే. రెవెన్యూకు కొత్తపేరు పెడతామని కేసీఆర్‌ స్వయంగా చెప్పిన నేపథ్యంలో ఈ శాఖ పేరును ‘భూపరిపాలన శాఖ’ గా మారుస్తారనే చర్చ జరుగుతోం ది. ఈ మేరకు గతంలోనే తమతో సీఎం కేసీఆర్‌ చర్చించారని, ఆ సందర్భంలోనే రెవెన్యూ శాఖ పేరు మార్పును ఆయన ధ్రువీకరించారని రెవెన్యూ ఉద్యోగ సంఘాలంటున్నాయి. రెవెన్యూ ఉన్నతాధికారుల వద్ద రెండు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. భూపరిపాలన లేదంటే భూనిర్వహణ శాఖగా మార్చే ప్రతిపాదనలను రెవెన్యూ శాఖ పరిశీలిస్తోందని, దీనిపై త్వరలోనే సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. 

పైలట్‌ ప్రాజెక్టుగా ఓ గ్రామంలో సర్వే
ధరణి పోర్టల్‌పై సమీక్ష సందర్భంగా సీఎం ప్రకటించిన విధంగా త్వరలోనే రాష్ట్రంలోని వ్యవసాయ భూముల డిజిటల్‌ సర్వే ప్రారంభించేందుకు కూడా రెవెన్యూ వర్గాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే భూముల సర్వే పూర్తిచేసిన రాష్ట్రాల పరిస్థితిని అధ్యయనం చేసిన రెవెన్యూ వర్గాలు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న సర్వే తీరును కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ సర్వేపై ఓ నివేదికను కూడా సీఎం కేసీఆర్‌కు అందజేసినట్టు సమాచారం. అయితే, రాష్ట్రంలో ప్రస్తు తం ఉన్న భూములు సెడెస్టల్‌ (మరఠ్వాడా) సర్వే ప్రకారం ఉన్నాయని, ఈ విధానంలో ఉన్న భూముల సర్వేను కదిలించడం అంత సులభం కాదనే అభిప్రాయం రెవెన్యూ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అందువల్ల పైలట్‌ ప్రాజెక్టుగా తొలుత రాష్ట్రంలోని ఓ గ్రామం యూనిట్‌గా సర్వేను ప్రారంభించాలనే ఉద్దేశంతో ఆ శాఖ ఉన్నతాధికారులున్నారు.

ఈ గ్రామంలోని భూములను సర్వే చేసి అన్ని వ్యవసాయ భూములకు కోఆర్డినేట్లు ఇవ్వాలని, ఈ ప్రక్రియను పూర్తిగా పరిశీలించిన తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా భూముల డిజిటల్‌ సర్వేకు ముందుకెళ్లాలనే ఆలోచనలో రెవెన్యూ వర్గాలున్నాయి. మరోవైపు ప్రస్తుతం భూముల సర్వేలో అమలవుతోన్న గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌)ను డిజిటలైజ్‌ విధానంలో ఉపయోగించుకోవడం ద్వారా భూముల అక్షాంశాలు, రేఖాంశాలు గుర్తించి హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న డ్రోన్‌ సర్వే చేపడితే ఎలా ఉంటుందనేది కూడా రెవెన్యూ శాఖ పరిశీలిస్తోంది . ‘భూముల సర్వే ద్వారా ప్రగతిశీల ఫలితాలు వస్తాయన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అనుభవాలు చెపుతున్నది కూడా ఇదే.

అందుకే సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, జీపీఎస్‌ లేదా డ్రోన్‌ సర్వే పద్ధతుల్లోని సాధ్యాసాధ్యాలు, అవసరమయ్యే సిబ్బంది, పట్టే కాలపరిమితి, అయ్యే ఖర్చు, ఈ విధానాల ద్వారా ఇతర రాష్ట్రాలు, దేశాల్లో వచ్చిన ఫలితాలు, సమస్యలు... తదితర అన్ని అంశాలను పరిశీలించాల్సి ఉంది. వీటన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. త్వరలోనే దీనిపై పకడ్బందీ కార్యాచరణ పూర్తవుతుంది’అని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఏదిఏమైనా భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు గాను సర్వే చేపట్టాలనేది సీఎం కేసీఆర్‌ ఆలోచన అని, అందుకు అనుగుణంగానే వీలున్నంత త్వరలో ప్రణాళిక ప్రారంభమవుతుందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. 
   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top