శివాజీ విగ్రహం ఏర్పాటుతో వివాదం

Telangana Police Imposed Section 144 in Bodhan - Sakshi

బోధన్‌లో తీవ్ర ఉద్రిక్తత

ఇరు వర్గాల మధ్య ఘర్షణ 

పోలీసుల లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగం 

బోధన్‌టౌన్‌ (బోధన్‌)/నిజామాబాద్‌ సిటీ/సాక్షి, హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ పార్టీ రాత్రికి రాత్రే ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఘర్షణకు కారణమైంది. ఈ అంశంపై ఇరువర్గాల మధ్య మొదలైన వాగ్వాదం రాళ్ల దాడికి దారి తీసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు. 

వివాదం మొదలైంది ఇలా.. 
బోధన్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో శనివారం రాత్రి ఓ పార్టీ ఆధ్వర్యంలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన ఓ వర్గం వారు.. విగ్రహాన్ని తొలగించాలంటూ అంబేడ్కర్‌ చౌరస్తాలో బైఠాయించారు. దీంతో మరో వర్గం వారు కూడా వందలాదిగా అక్కడికి వచ్చారు.

విగ్రహం ఏర్పాటుకు మున్సిపల్‌ తీర్మానం ఉందని, విగ్రహాన్ని తొలగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఇరు వర్గాలు ఎదురెదురుగా టెంట్లు వేసుకుని ఆందోళనకు దిగాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  ఏసీ పీ రామారావు ఇరువర్గాలను సముదాయించేందు కు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.  నినాదా లు చేస్తూ ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి.  

లాఠీలు ఝళిపించిన పోలీసులు.. 
ప్రత్యేక బలగాలతో అక్కడకు చేరుకున్న నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ నాగరాజు.. విగ్రహ ఏర్పాటుతో ఉద్రిక్తతలకు తావివ్వొద్దని, ఏదైనా న్యాయపరంగా చూసుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. దీంతో ఓ వర్గం వారు అక్కడి నుంచి వెళ్లిపోయి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. మరోవైపు విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని, అప్పటివరకూ విగ్రహాన్ని తొలగించక తప్పదని సీపీ.. దాన్ని ఏర్పాటు చేసిన నేతలకు స్పష్టం చేశారు.

అక్కడి నుంచి వెళ్లి పోవాలని సూచించగా నాయకులు నిరాకరించారు. ఈ క్రమంలో ఆందోళనకారులు వేసుకున్న టెంట్‌ను పోలీసులు తొలగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. సీపీ లాఠీచార్జికి ఆదేశించడంతో ప్రత్యేక బలగాలు లాఠీలు ఝళిపించాయి. బాష్పవాయువును ప్రయోగించారు. పోలీసుల దెబ్బలకు ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోగా అతడిని ఆస్పత్రికి తరలించారు.

బోధన్‌ ఠాణా ఎదుట బైఠాయించిన వారిపైనా పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. ఈ సంఘటనపై బీజేపీ సోమవారం బోధన్‌ బంద్‌ కు పిలుపునిచ్చింది. బోధన్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌కు ఆదివారం బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ లేఖ రాశారు.  

బోధన్‌ ఘటనపై హోంమంత్రి ఆరా 
బోధన్‌ ఘటనపై హోం మంత్రి మహమూద్‌ అలీ ఆరా తీశారు. డీజీపీ, నిజామాబాద్‌ పోలీ సు కమిషనర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పరిస్థితి అదుపులో ఉందని, కమిషనర్, ఇతర పోలీసు అధికారులు బోధన్‌లోనే ఉండి పరిస్థితులు సమీక్షిస్తున్నారని హోం మంత్రికి డీజీపీ వివరించారు. ప్రజలు సంయమనం పాటించాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top