మినీ మున్సి‘పోలింగ్‌’.. లైవ్‌ అప్‌డేట్స్‌

Telangana Municipal Elections 2021 Live Updates: Today polling - Sakshi
  • తెలంగాణలో రెండు, కార్పొరేషన్‌, ఐదు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. 5 గంటల వరకు ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.
  • అయితే 5 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు.

Time: 3:00 గంటల వరకు పోలింగ్‌ 44.15 శాతంగా నమోదైంది. మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.

Time: 2:15 PM
కాంగ్రెస్‌ నేత ముస్తఫా అరెస్ట్‌
ఖమ్మం: 57వ డివిజన్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. కాంగ్రెస్‌ నాయకుడు ముస్తఫాని అరెస్ట్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో కార్యకర్తలను అడ్డుకోవడమే కాక వారిని చెదరగొట్టారు. 

Time: 1:31 PM
ఉద్రిక్తత.. పోలింగ్‌ కేంద్రం ఎదుట లాఠీఛార్జి
ఖమ్మం: 57వ డివిజన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్‌ఎస్‌పీ ప్రభుత్వ పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్ద కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టింది. టీఆర్‌ఎస్‌ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆరోపణలకు దిగారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జి చేసి కాంగ్రెస్‌ కార్యకర్తలను చెదరగొట్టారు.

Time: 1:02 PM
విషాదం.. గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
వరంగల్‌: మున్సిపల్‌ ఎన్నికల విధుల్లో విషాదం నెలకొంది. 57వ డివిజన్‌లోని సమ్మయ్య నగర్ లో పోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు రమేష్‌బాబు గుండెపోటుతో మృతి చెందారు. జనగామ జిల్లాలోని చిల్పూర్ మండలంలోని కొండాపూర్ తండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఆయన పని చేస్తున్నారు.

Time: 12:47 PM
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి హరీష్‌రావు..
సిద్ధిపేట 23వ వార్డులోని 69వ పోలింగ్ బూత్‌లో మంత్రి హరీష్‌రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణలోన  రెండు కార్పొరేషన్లు, 5 మున్సి పాలిటీల్లో ఓటింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని  ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సిద్దిపేట 43 వార్డులకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ను వెబ్ కెమెరా లో పరిశీలించారు. సమయానుకూలంగా ఓటర్లందరూ వచ్చి విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు.

Time: 12:08 PM
ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్‌ శాతం
వరంగల్‌ కార్పొరేషన్‌- 23.62 శాతం
ఖమ్మం కార్పొరేషన్‌- 23.41 శాతం
సిద్దిపేట మున్సిపాలిటీ- 31.39 శాతం
అచ్చంపేట మున్సిపాలిటీ- 34 శాతం 
జడ్చర్ల మున్సిపాలిటీ-35 శాతం
కొత్తూరు మున్సిపాలిటీలో 43.99 శాతం 
నకిరేకల్‌ మున్సిపాలిటీ- 45.55 శాతం

Time: 12:00 PM
టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ

ఖమ్మం: పీజీ కాలేజీ సెంటర్‌ ముందు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పరస్పర ఆరోపణలకు దిగారు. ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు చేరుకున్నారు.

Time: 11:35 AM
సిద్ధిపేట మున్సిపాలిటీలో ఉదయం 11 గంటల వరకు 31.39 శాతం పోలింగ్ నమోదైంది. సిద్ధిపేట జిల్లా గజ్వెల్ పట్టణం లో 12వ వార్డు పోలింగ్ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పరిశీలించారు. గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌లో ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్‌ నమోదైంది. అచ్చంపేటలో 11 శాతం, నకిరేకల్‌లో 11.12 శాతం, జడ్చర్లలో 12 శాతం, ఖమ్మం కార్పొరేషన్‌లో 15.23 శాతం పోలింగ్‌ జరిగింది.

Time: 10:43 AM
బీజేపీ ఆందోళన..
ఖమ్మం కార్పొరేషన్‌ 20వ డివిజన్‌ పరిధిలో బీజేపీ ఆందోళన చేపట్టింది. కాలేజీ విద్యార్థులతో దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు ప్లకార్టులతో ధర్నా నిర్వహించారు.

Time: 9:20 AM
ఖమ్మం: పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. కొన్ని చోట్ల కోవిడ్‌ నిబంధనలు ప్రకారం.. అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవడంతో ఓటర్లు క్యూలైన్లల్లో సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడంలేదు. 

Time: 8:36 AM
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం కార్పొరేషన్‌లో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా ఇందులో 10వ డివిజన్ ఏకగ్రీవం కావడంతో 59డివిజన్ల కు పోలింగ్ జరుగుతుంది. హార్వెస్ట్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Time: 8:14 AM
సిద్దిపేటలో ఉదయం 7 గంటల నుంచే  పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. కోవిడ్  నిబంధనలు పాటిస్తూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు 100653 ఉండగా.. పురుష ఓటర్లు 49875 మంది, మహిళా ఓటర్లు 50767 మంది ఉన్నారు. 130 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 485 మంది  పోలీస్ సిబ్బందితో  కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు.

Time: 7:58 AM
నల్గొండ జిల్లా: నకిరేకల్ నూతన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మొదటి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. వార్డుకి రెండు బూత్‌లు చొప్పున 40 పోలింగ్ బూత్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.

Time: 7:10 AM
తెలంగాణలో రెండు కార్పొరేషన్లు, 5 మున్సి పాలిటీల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్‌ పద్ధతిలో కొనసాగనుంది. వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్ది పేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌ మున్సిపాలిటీలకు, కొన్ని మున్సిపాలిటీలలోని ఒక్కొక్క వార్డుకు పోలింగ్‌ జరుగుతోంది. కోవిడ్‌ నిబంధనల మేరకు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు.

వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికల పోలింగ్‌
వరంగల్‌ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లకు పోలింగ్‌
వరంగల్‌ కార్పొరేషన్‌ 66 డివిజన్ల బరిలో 502 మంది అభ్యర్థులు
ఖమ్మం కార్పొరేషన్‌ 60 డివిజన్లలో ఒకటి ఏకగ్రీవం, 59 చోట్ల పోలింగ్‌
ఖమ్మం కార్పొరేషన్‌ 59 డివిజన్ల బరిలో 251 మంది అభ్యర్థులు
ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో 377 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు
ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 2.88 లక్షల మంది ఓటర్లు
సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు పోలింగ్
అచ్చంపేట, నకిరేకల్‌ మున్సిపాలిటీ ఎన్నికలకు పోలింగ్
సిద్దిపేట మున్సిపాలిటీ 43 వార్డుల్లో 236 మంది అభ్యర్థులు
కొత్తూరు మున్సిపాలిటీ 12 వార్డుల్లో 47 మంది అభ్యర్థులు
అచ్చంపేట మున్సిపాలిటీ 20 వార్డుల్లో 66 మంది అభ్యర్థులు
జడ్చర్ల మున్సిపాలిటీ 27 వార్డుల్లో 112 మంది అభ్యర్థులు
నకిరేకల్‌ మున్సిపాలిటీ 20 వార్డుల్లో 93 మంది అభ్యర్థులు

కోవిడ్‌– 19 నిబంధనలను హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి ఆదేశించారు. ఎన్నికలు జరగనున్న ప్రాంతాల పరిధిలోని జిల్లా కల్లెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు/ఎస్పీలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు, మునిసిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పోలింగ్‌ నిర్వహణ, ఓట్ల లెక్కింపు రోజున పాటించాల్సిన కోవిడ్‌–19 నిబంధనలపై పలు సూచనలు చేశారు. సమావేశంలో ఈ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు శివ బాలాజీ రెడ్డి, ఓఎస్డీ జయసింహ రెడ్డి కూడా పాల్గొన్నారు. మే 3న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఫలితాల ప్రకటన ఏర్పాట్లను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షించింది.పోలింగ్‌ సందర్భంగా ఇలా..

► పోలింగ్‌ నాడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి
► అన్ని పోలింగ్‌ కేంద్రాల పరిసరాలను శానిటైజ్‌ చేయాలి
► పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశిస్తున్న సమయంలోనూ, బయటికి వచ్చేటప్పుడూ చేతులను శానిటైజ్‌ చేసుకోవాలి. దీనికోసం శానిటైజర్లను సిద్ధంగా ఉంచాలి. 
► భౌతిక దూరం పాటించేలా పోలింగ్‌ కేంద్రాల బయట వలయాలను మార్క్‌ చేసి, భౌతిక దూరం పర్యవేక్షణకు ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామకం
► భౌతిక దూరం పాటించేలా పోలింగ్‌ సిబ్బంది, ఏజెంట్ల సీటింగ్‌ 
► సిబ్బంది, పోలీసులు విధిగా మాస్క్‌ లు, ఫేస్‌ షీల్డులు, గ్లౌజులు ధరించాలి. వీలును బట్టి ఎన్‌–95 మాస్క్‌ లేదా రెండు మాస్కులు ధరించాలి.
► కోవిడ్‌–19 నిబంధనల అమలుకు ప్రతి మునిసిపాలిటీలో ఒకరు లేదా ఇద్దరు హెల్త్‌ నోడల్‌ అధికారుల నియామకం.
► ప్రతి కేంద్రంలో ఒకరు లేదా ఇద్దరు ఆరోగ్య సిబ్బంది మెడికల్‌ కిట్లతో సిద్ధంగా ఉండాలి.
► అవసరమైన అంబులెన్సులను ఆక్సిజెన్‌ సిలిండర్‌లతో సిద్ధంగా ఉంచాలి
► రిసెప్షన్‌లో ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసి ఒకే సమయంలో 10 మందికి మించకుండా ఉండేలా చూడాలి. 
► పోలింగ్‌ సిబ్బందికి రిసెప్షన్‌ సెంటర్‌ నుండి వారి గమ్యస్థానాలకు రవాణా సౌకర్యం కల్పించాలి.
► నలుగురికంటే ఎక్కువ మంది ఒక్కచోట చేరకుండా చూడాలి. అవసరమైతే 144 సెక్షన్‌ విధించాలి.

కౌంటింగ్‌ సమయంలో...
► స్ట్రాంగ్‌ రూమ్‌లు విశాలమైన గదులలో ఏర్పాటు చేసి శానిటైజ్‌ చేయాలి. అలాగే పెస్ట్‌ కంట్రోల్‌ చర్యలు చేపట్టాలి.
► కౌంటింగ్‌ హాల్స్‌ విశాలమైన గదులలో ఏర్పాటు చేయాలి. ఒక్క కౌంటింగ్‌ హాల్లో 50 మందికి మించి ఉండొద్దు. 
► కౌంటింగ్‌ సిబ్బంది, ఏజెంట్లు భౌతిక దూరం పాటించేలా సీటింగ్‌ ఏర్పాటు చేయాలి. 
► మాస్కులు ధరించి, ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రపరచుకునేలా చూడాలి.
► జలుబు, దగ్గు, జ్వరంతో బాధ పడుతున్న వారిని కౌంటింగ్‌ హాల్లోకి అనుమతించరాదు.
► అవసరమైన వారికి పీపీఈ కిట్లు ఇవ్వాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top