రేయింబవళ్లు... 4 రోజులు 

Telangana MLC Polls: Counting completed On Fourth Day - Sakshi

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు నాలుగు రోజుల సమయం 

భారీగా అభ్యర్థులు బరిలో ఉండటం, పోలింగ్‌ శాతం పెరగడమే కారణం

సాక్షి, హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఈసారి ఏకంగా నాలుగు రోజుల సమయం పట్టింది. ఈనెల 17వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేయింబవళ్లు కొనసాగి 20వ తేదీ అర్ధరాత్రికి ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు రోజుల పాటు లెక్కింపు ప్రక్రియ జరిగేందుకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి ఎన్నికల బరిలో రెండు నియోజకవర్గాల్లో నూ ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉండడం, పోలింగ్‌ కూడా ఊహించిన దాని కన్నా ఎక్కువ కావడం, జంబో బ్యాలెట్లతో అధికారులు కుస్తీ పట్టాల్సి రావడం, ఓట్లను బండిల్స్‌ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకోవడం, తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్‌ ప్రక్రియ క్లిష్టతరం కావడంతో చాలా సమయం తీసుకుందని ఎన్నికల వర్గాలంటున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ మూడున్నర లక్షలకుపైగా జంబో బ్యాలెట్లను ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో, ఆపై రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో దాదాపు లక్షన్నర బ్యాలెట్లను పరిగణనలోకి తీసుకోవాల్సి రావడం కత్తిమీద సాములానే మారింది. మొత్తంమీద దాదాపు 90 గంటలు జరిగిన ఈ ప్రక్రియ పెద్దగా సమస్యలు రాకుండానే ముగియడంతో ఎన్నికల యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

బండిల్స్‌ నుంచి ఎలిమినేషన్‌ వరకు 
నల్లగొండలోని వేర్‌హౌసింగ్‌ గోదాములో నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ స్థానానికి కౌంటింగ్‌ జరిగింది. ఈనెల 17న ఉదయం 8 గంటలకు బ్యాలెట్‌ బాక్సులను పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో తెరచి వాటిని కుప్పలుగా పోసి 25 ఓట్ల చొప్పున బండిల్స్‌ కట్టే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, ఈసారి నల్లగొండ స్థానంలో 3,88,011 (76 శాతం) ఓట్లు, రంగారెడ్డిలో 3,57,354 (65శాతం) ఓట్లు పోలయ్యాయి. వీటన్నింటినీ 25 ఓట్ల చొప్పున కట్టలు కట్టేందుకు 12 గంటలకు పైగా సమయం పట్టింది. దీంతో మొదటి ప్రాధాన్యత ఓట్ల తొలిరౌండ్‌ లెక్కింపు 17న రాత్రి సమయంలో ప్రారంభమైంది. ఒక్కో రౌండ్‌లో 56 వేల ఓట్లు లెక్కించాల్సి రావడంతో తొలిరౌండ్‌ ఫలితం వచ్చేసరికే అర్ధరాత్రి దాటింది. హైదరాబాద్‌ స్థానంలో అయితే తెల్లవారుజామున గానీ తొలిరౌండ్‌ ఫలితం రాలేదు. అలా ఏడురౌండ్ల కౌంటింగ్‌కు రెండు రోజులకు పైగా సమయం పట్టింది. ఈనెల 19న ఉదయానికి గానీ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కాలేదు. ఆ తర్వాత కొంత విరామం తీసుకున్న ఎన్నికల యంత్రాంగం 19వ తేదీ మధ్యాహ్నానికి ఎలిమినేషన్‌ ప్రక్రియ ప్రారంభించింది.  

ఒక్కొక్కరినీ తీసేస్తూ.. ఒక్కో ఓటు కలుపుతూ..
ఇక రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు కూడా చాలా సమయం తీసుకుంది. ఈసారి నల్లగొండ స్థానం నుంచి 71 మంది, హైదరాబాద్‌ నుంచి 93 మంది బరిలో ఉండటంతో వారిలో అత్యంత తక్కువ ఓట్లు దక్కించుకున్న వారిని ఆరోహణ క్రమంలో ఒక్కొక్కరినీ ఎలిమినేట్‌ చేస్తూ.. వారి బ్యాలెట్లలోని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను మిగిలిన వారిని కలుపుతూ పోయారు. అభ్యర్థు లు ఎలిమినేట్‌ అయ్యే కొద్దీ ఎక్కువ ఓట్లు లెక్కపెట్టాల్సి వచ్చింది. అలా తొలి ఐదు స్థానాల్లో ఉన్న అభ్యర్థులను తేల్చేందుకు శనివారం ఉదయం అయింది. ఆ తర్వాత ఒక్కొక్కరిని తీసివేస్తూ వారి ఓట్లను కూడా లెక్కించి ఇతరులకు కలిపే ప్రక్రియ ప్రారంభించిన అధికారులు అతికష్టం మీద శనివారం రాత్రికి లెక్కింపు ప్రక్రియను పూర్తి చేశారు. 4 రోజులు జరిగిన ఈ కౌంటింగ్‌ ప్రక్రియ కోసం ఎన్నికల యంత్రాంగం పకడ్బందీ ఏర్పా ట్లు చేసింది. 8 హాళ్లు, ఏడు టేబుళ్లలో, టేబుల్‌కు వెయ్యి ఓట్ల చొప్పున రౌండ్‌కు 56 వేల ఓట్లు లెక్కించారు. కౌంటింగ్‌ నిరంతరాయంగా జరగాల్సి రావడంతో అ«ధికారులు తమ సిబ్బందికి షిఫ్టుల వారీగా డ్యూటీలు వేశారు. కౌంటింగ్‌లో ఇబ్బందుల్లేకుండా ఎన్నికల యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోగా, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుం డా పోలీసుశాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top