భారతీయతే మన ఐక్యత

Telangana Minister KTR Speech At Svatantra Vajrotsavam Program Held By Army - Sakshi

ఆర్మీ వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి కేటీఆర్‌ 

భిన్నత్వంలో ఏకత్వంతోనే ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాం 

ఈ 75 ఏళ్లలో ఎన్నో విజయాలు సాధించాం 

అమర జవాన్లకు ఘనంగా నివాళి 

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో ఘనంగా ఆర్మీ వేడుకలు 

కంటోన్మెంట్‌ (హైదరాబాద్‌): భిన్నత్వంలో ఏకత్వమే మన దేశాన్ని మిగతా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడేలా చేస్తోందని ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇంత విభిన్నత ఉన్నా భారతీయతే మన ఐక్యత అని చెప్పారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఆర్మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కేటీఆర్‌ పాల్గొన్నారు.

కాలికి తగిలిన గాయం వల్ల మూడు వారాలుగా ఇంటికే పరిమితమైన తాను.. బయటికి వచ్చాక మొదట ఆర్మీ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమన్నారు. ‘‘నేను ఐటీ, పరిశ్రమల మంత్రిగా వివిధ దేశాలు తిరిగినప్పుడు చాలా మంది మన దేశాన్ని చైనాతో పోల్చి మాట్లాడారు. అధిక జనాభా, వనరులున్న చైనా, భారత్‌ అన్నింటా పోటీపడటం సహజమే. అయితే విభిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, సంస్కృతులు కలిగిన మన దేశంలో ప్రతి 100 కిలోమీటర్లకు అన్నీ మారిపోతూ ఉంటాయి.

భాష, యాస, కట్టుబొట్టు, ఆహార అలవాట్లు అన్నింటా వ్యత్యాసం ఉంటుంది. కానీ అందరినీ ఒక్క తాటిపై నిలిపేది మాత్రం భారతీయతే. 75 ఏళ్లలో మనం సాధించిన విజయాలకు తోడు.. మన ఐక్యత, ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. దీన్ని భవిష్యత్‌లోనూ కొనసాగించాలి..’’అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. పరేడ్‌ గ్రౌండ్‌లో సైనికులు, కళాకారులు, విద్యార్థుల విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని.. ఇంత మంచి కార్యక్రమానికి తనను ఆహ్వానించిన ఆర్మీ దక్షిణ భారత్‌ ఏరియా జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్, లెఫ్టినెంట్‌ జనరల్‌ అరుణ్‌ కుమార్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. 

ఆకట్టుకున్న లెఫ్టినెంట్‌ జనరల్‌ ప్రసంగం
పరేడ్‌ గ్రౌండ్‌లో ఆర్మీ కార్యక్రమాల ముగింపు సందర్భంగా లెఫ్టినెంట్‌ జనరల్‌ అరుణ్‌కుమార్‌ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తెలుగు వ్యక్తి అయిన ఆయన మన భాషతోపాటు హిందీ, ఇంగ్లిష్‌లోనూ మాట్లాడుతూ ఉత్తేజపరిచారు. ప్రసంగం మధ్యలో ఆర్మీ జవాన్లు త్రివర్ణ పతాకంతో గగనంలో ఎగురుతూ చేసిన విన్యాసాన్ని తిలకించాల్సిందిగా ఆహుతులను కోరారు. 

అమర జవానులకు నివాళి 
పరేడ్‌ గ్రౌండ్స్‌లో కార్యక్రమాల సందర్భంగా తెలంగాణ–ఏపీ ఆంధ్రా సబ్‌ ఏరియా ప్రాంతానికి చెందిన అమర జవాన్ల కుటుంబాలకు మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. కల్నల్‌ సంతోష్‌బాబు సతీమణి సంతోషి, మేజర్‌ పద్మపాణి ఆచార్య సతీ మణి చారులత, కంటోన్మెంట్‌కు చెందిన లాన్స్‌నాయక్‌ రాంచందర్‌ సతీమణి ఎంఆర్‌ దివ్యతోపాటు అమరవీరుల కుటుంబ సభ్యులు విమలారావు, లక్ష్మీదేవి, నస్రీన్‌ ఖాన్, గీత మాధవ్, సుభాషిణీ, నీలం దేష్కర్, సర్వాహ్‌జా, శివలీల, కిరణ్‌ గుప్తా, సుహాసినీ మహేశ్వర్, నసీమ్‌ సుల్తానా తదితరులకు మంత్రి పురస్కారాలు అందజేశారు.

ఇక ఇటీవల జరిగిన మిలటరీ ఆపరేషన్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చి, సేవా పురస్కారాలు పొందిన టీఎన్‌ సాయికుమార్, కల్నల్‌ సురేంద్ర పోలా, కల్నల్‌ రాహుల్‌ సింగ్‌ తదితరులకు సైతం మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రశంసా పురస్కారాలు అందజేశారు.  

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఆర్మీ ఏర్పాటు చేసిన యుద్ధ ట్యాంకులు, ఆయుధ ప్రదర్శన ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు వాటిని సందర్శించి, ఆర్మీ విన్యాసాలను తిలకించారు. కలరిపయట్టు, పేరిణి నృత్యాలు, ఆర్మీ బ్యాండ్‌ ప్రదర్శనలు, బొల్లారం ఆర్మీ స్కూల్‌ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top