సృజనాత్మకతతోనే నూతన ఆవిష్కరణలు

Telangana Minister KTR Launches Intinta Innovator Exhibition 2021 At Sircilla - Sakshi

‘ఇంటింటా ఇన్నోవేటర్‌’ ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: సృజనాత్మకతే నూతన ఆవిష్కరణలకు మూలమని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమం సమ్మిళిత ఆవిష్కరణల అభివృద్ధికి సాక్ష్యంగా నిలుస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఇంటింటా ఇన్నోవేటర్‌ ఎగ్జిబిషన్‌–2021ను ఆదివారం ఆయన సిరిసిల్లలో ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్‌ ద్వారా ఎంపిక చేసిన 105 ఆవిష్కరణలు తోటి భారతీయుల నిజమైన సమస్యల ఆధారంగా రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్‌లో తెలంగాణలోని 33 జిల్లాల నుంచి వందకంటే ఎక్కువ ఆవిష్కర్తలు వర్చువల్‌ షోకేస్‌ ద్వారా తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు.

పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో భాగంగా వ్యవసాయం, పారిశుద్ధ్యం, సాంకేతికత, రవాణా, నీరు, ఆరోగ్య రంగాల్లో పాఠశాల విద్యార్థుల నుండి ఇళ్లల్లో తయారీదారుల వరకు, మెకానిక్‌ నుండి రైతు వరకు వందకి పైగా ఆవిష్కరణలను ఆన్‌లైన్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఈ ఆవిష్కరణలను ప్రజలు www. teamtsic. telangana. gov. in/ intinta& innovator& exhibition&2021/ పోర్టల్‌లో సందర్శించవచ్చు. ఈ కార్యక్రమం కోసం 33 జిల్లాల సైన్స్‌ అధికారులు జిల్లా కలెక్టర్ల మార్గదర్శకత్వంలో నోడల్‌ ఆఫీసర్‌లుగా నియమితులయ్యారు. హైదరాబాద్‌ నుంచి ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌ వర్చువల్‌ విధానంలో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top