ఎలాన్‌.. మా రాష్ట్రంలో కంపెనీ పెట్టండి

Telangana Minister KTR Invite To Elon Musk On Twitter - Sakshi

టెస్లాను తెలంగాణకు ఆహ్వానించిన మంత్రి కేటీఆర్‌ 

కంపెనీ సీఈవో ఎలాన్‌ మస్క్‌కు ట్వీట్‌ 

ఆహ్వానిస్తూ వ్యాపారవేత్తలు, నటీనటులు, జర్నలిస్టులు కూడా ట్వీట్లు 

సాక్షి, హైదరాబాద్‌: ‘హేయ్‌ ఎలాన్‌.. నేను ఇండియాలోని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి కేటీఆర్‌. టెస్లా కార్యకలాపాల్లో భారత్‌ కానీ, తెలంగాణ కానీ భాగస్వామ్యమయితే చాలా సంతోషిస్తాను. మా రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, సుస్థిరతలో చాంపియన్‌గా నిలిచింది. పెట్టుబడులకు తెలంగాణ అగ్రశ్రేణి వ్యాపార గమ్యస్థానంగా ఉంది’అని అమెరికా దిగ్గజ ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ ‘టెస్లా’సీఈవో ఎలాన్‌ మస్క్‌కు మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

టెస్లా కంపెనీని తెలంగాణకు ఆహ్వానించారు. టెస్లా మోడల్‌ ‘ఎక్స్‌’కారు నడుపుతున్న పాత ఫొటోలను షేర్‌ చేశారు. దీనిపై స్పందించిన మస్క్‌.. ప్రభుత్వంతో చాలా సవాళ్లను ఎదుర్కొంటూ పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. మస్క్, కేటీఆర్‌ల ట్వీట్లు దేశవ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షించాయి. వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, నటులు స్పందించారు. కేటీఆర్‌ ఆలోచనకు మద్దతు పలికారు.

మస్క్‌ సార్‌.. హైదరాబాద్‌ రండి.. 
‘ఎలాన్‌ మస్క్‌.. హైదరాబాద్‌ రండి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా ఉంది. చరిత్ర సృష్టిస్తారు’అని నటుడు విజయ్‌ దేవరకొండ ట్వీట్‌ చేయగా.. ‘ఈ కారు చాలా ఇష్టం.. ఆశలు చిగురించినట్లు అనిపిస్తోంది’అని నటి జెనీలియా దేశ్‌ముఖ్‌ పేర్కొన్నారు. టెస్లాను రాష్ట్రానికి స్వాగతిస్తూ టాలీవుడ్‌ డైరెక్టర్‌ మెహర్‌ రమే‹శ్‌ ట్వీట్‌ చేశారు. ‘ఎలాన్‌ మస్క్‌ సార్‌.. మీరు తెలంగాణలో పరిశ్రమ పెట్టేందుకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు ఉన్నాయి.

అలాగే మంచి మంత్రి కేటీఆర్‌ ఉన్నారు’’అని ఆయన ఆహ్వానించారు. దర్శకుడు గోపీచంద్‌ మలినేని.. ‘‘ప్రియమైన ఎలాన్‌ మస్క్, తెలంగాణలో టెస్లా పరిశ్రమ ఉండాలనుకుంటున్నాం. అవసరమైన మౌలిక సదుపాయాలు, భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార కేంద్రం ఉంది’’అని వ్యాఖ్యానించారు. జర్నలిస్టు అమీన్‌ అలీ, గో న్యూస్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ పంకజ్‌ పంచౌరి, సీనియర్‌ ఎడిటర్‌ విక్రమ్‌చంద్ర, జర్నలిస్టు ఉమా సుధీర్, నటుడు నిఖిల్‌ సిద్ధార్థ తదితరులు ట్వీట్‌ చేస్తూ టెస్లా పరిశ్రమల స్థాపనకు తెలంగాణ గమ్యస్థానంగా నిలుస్తుందని, బెంగళూరును అధిగమించి తెలంగాణ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top