చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

Telangana: Minister Kishan Reddy Tribute To Chakali Ilamma - Sakshi

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జయప్రదం చేయాలి 

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

కవాడిగూడ: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏడాది పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అధికారికంగా నిర్వహించనున్నామని కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 17న పరేడ్‌ గ్రౌండ్‌లో త్రివిధ దళాల పరేడ్‌ ఉంటుందని ఆయన వెల్లడించారు.

నిజాం రజాకర్ల దమన కాండకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మతో పాటు ఎంతో మంది వీరులు ప్రాణ త్యాగం చేశారని వారందరినీ ఏడాది పాటు స్మరించుకుంటూ వారి ఆశయాల స్ఫూర్తితో నేటి సమాజం ముందుకు సాగాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని తెలంగాణ రజకాభివృద్ధి (ధోబీ) సంస్థ ఆధ్వర్యంలో శనివారం లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని ఆమె విగ్రహం వద్ద నిర్వహించారు.

ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి కిషన్‌రెడ్డి, కవాడిగూడ కార్పొరేటర్‌ జి.రచనశ్రీ, రాంనగర్‌ కార్పొరేటర్‌ రవిచారి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు బొమ్మరాజు కృష్ణమూర్తి, రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ చైర్మన్‌ మందలపు గాంధీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ చైర్మన్‌ ఎం.నర్సింహ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపల్లి రాజశేఖర్, వైస్‌ చైర్మన్‌ నర్సింహ్మ, బీజేపీ రాష్ట్ర నాయకులు పరిమళ్‌కుమార్, రంగరాజ్‌గౌడ్, శ్యాంసుందర్‌గౌడ్, రమేష్‌రాం తదితరులు పాల్గొన్నారు. 

ఐలమ్మ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి
తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాంనగర్‌ మాజీ కార్పొరేటర్‌ వి.శ్రీనివాస్‌రెడ్డిలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ముఠా గోపాల్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విలీనం వేడుకలను ఏడాది పాటు నిర్వహిస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ముఠా జైసింహ, డివిజన్‌ అధ్యక్షుడు శ్యామ్‌యాదవ్, నాయకులు ఆర్‌.రాంచందర్, రాజేష్, హరి తదితరులు పాల్గొన్నారు. 
– ఎమ్మెల్యే ముఠా గోపాల్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top