మంకీ పాక్స్‌పై ఆందోళన వద్దు..

Telangana Minister Harish Rao Comments On Monkeypox Cases - Sakshi

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు

ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క కేసూ నమోదు కాలేదు

అయినా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది

నిర్ధారణ పరీక్షలకు గాంధీ.. చికిత్సకు నోడల్‌ కేంద్రంగా ఫీవర్‌ ఆసుపత్రి

డీఎంఈ, టీవీవీపీ ఆసుపత్రుల వైద్యులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: మంకీ పాక్స్‌ వైరస్‌ కేసుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటివరకు దాదాపు అరవైకి పైగా దేశాల్లో 12 వేల వరకు కేసులు నమోదైనప్పటికీ, మన దేశంలో కేరళలో ఒక్క కేసు మాత్రమే నమోదు అయిందని తెలిపారు. తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా వెలుగు చూడలేదని స్పష్టం చేశారు.

మంకీ పాక్స్‌ వైరస్‌ లక్షణాలు, పరీక్షలు, గుర్తింపు, చికిత్స.. తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు సోమవారం ఆయన డీఎంఈ, వైద్యవిధాన పరిషత్‌ (టీవీవీ) డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, కేసులు నమోదు కాకపోయినా మంకీ పాక్స్‌ విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉందన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు పాటిస్తున్నట్లు చెప్పారు.

గాంధీ ఆసుపత్రిలో రోగ నిర్ధారణ కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, అనుమానిత వ్యక్తులకు తక్షణ చికిత్స అందించేందుకు నోడల్‌ ఆసుపత్రిగా ఫీవర్‌ హాస్పటల్‌ను ఎంపిక చేసినట్టు చెప్పారు. గాంధీలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయడం, పాజిటివ్‌ వస్తే నిర్ధారణ కోసం నమూనాలను పుణెలోని ల్యాబ్‌కు పంపడం వంటి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైరస్‌కు సంబంధించిన అనుమానిత లక్షణాలు గుర్తించిన వెంటనే బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

మంకీ పాక్స్‌ కేసులు నమోదైన దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయా ణి కులు అనుమానిత లక్షణాలు కనిపిస్తే సమీ ప ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి ప్రాథమిక పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సీజనల్‌ వ్యాధు లు, మంకీ పాక్స్, వ్యాక్సినేషన్, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరోగ్య వివరాలు, సలహాలు కోసం 04024651119, 9030227324 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని మంత్రి ప్రజలకు సూచించారు. 

అర్హులందరికీ బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలి..
18 ఏళ్లు దాటి, రెండో డోసు వేసుకొని 6 నెలలు పూర్తయిన అందరికీ కరోనా వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసు అందించాలని మంత్రి హరీశ్‌ అధికారులను ఆదేశించారు. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్‌ డోసుపట్ల ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రచారం చేయాలన్నారు.

సీజనల్‌ వ్యాధుల పట్ల జాగ్రత్త..
వర్షాలు, వరదల కారణంగా సీజనల్‌ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని, రాబోయే వారం, పది రోజులు అన్ని ఆసుపత్రుల్లో వైద్యు లు అప్రమత్తంగా ఉండాలని హరీశ్‌రావు ఆదేశించారు. అవసరమైతే ఓపీ సమయాన్ని పెంచి ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నారు. అన్ని ఆసుపత్రుల్లో సూపరింటెండెంట్లు ఎప్పటికప్పు డు పరిస్థితులను పరిశీలిస్తూ సమస్యలను తక్షణం పరిష్కరించుకోవాలన్నారు.

తెలంగాణ డయా గ్నోస్టిక్స్‌ సెంటర్లు 24 గంటలు పని చేయాలని, ఫలితాలను వీలైనంత వేగంగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త డైట్‌ మెనూను అన్ని ఆసుపత్రుల్లో ప్రదర్శించేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మందులు బయటకు రాయకుండా చూసుకోవాలని సూపరింటెండెంట్లను ఆదేశించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top