సిజేరియన్లు వద్దు

Telangana Minister Harish Rao About Cesarean Deliveries - Sakshi

పీహెచ్‌సీల వైద్యులు, సిబ్బందికి మంత్రి హరీశ్‌రావు ఆదేశం

అత్యవసరమైతే తప్ప సహజ ప్రసవాలకే ప్రాధాన్యం ఇవ్వండి 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య పెంచాలని సూచన 

సాక్షి, హైదరాబాద్‌: సిజేరియన్ల ద్వారా డెలివరీలు వద్దని, సాధారణ ప్రసవాలు చేసేందుకే ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు, సిబ్బందికి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో, తల్లీబిడ్డలకు ప్రమాదం ఉందని గ్రహిస్తే మాత్రమే సిజేరియన్ల జోలికిపోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య పెంచాలని.. గర్భిణులు ప్రైవేటు ఆస్పత్రులకు కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే వచ్చేలా చూడాలని స్పష్టం చేశారు.

సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరుపై మెడికల్‌ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలతో మంత్రి హరీశ్‌రావు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. మెదక్, ములుగు జిల్లాల్లో 80శాతం డెలివరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని, అలా ఇతర జిల్లాల్లో ఎందుకు జరగడం లేదని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత స్థానిక అధికారులు, సిబ్బందిదేనని స్పష్టం చేశారు. డెలివరీ తేదీని ముందే గుర్తించి 104 వాహనంలో దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో జాయిన్‌ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 

ఆ జిల్లాల్లో ఎక్కువగా సిజేరియన్లు 
రాష్ట్రంలో సెప్టెంబర్‌లో 57.99 శాతం డెలివరీలు సిజేరియన్లు అయ్యాయని.. అత్యధికంగా హన్మకొండ, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో సిజేరియన్లు జరుగుతున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆయా జిల్లాల్లో వైద్యులు సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రయత్నించాలని ఆదేశించారు.

ఇక కరోనా బూస్టర్‌ డోస్‌ పంపిణీ వంద శాతం జరిగేలా చూడాలని సూచించారు. బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులను గుర్తించి, క్రమం తప్పకుండా మందులు అందించాలన్నారు. టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారి సమాచారం ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని.. తద్వారా వారు డైరెక్ట్‌ బెనిఫిట్‌ స్కీంకు అర్హులవుతారని తెలిపారు. కాగా, టీబీ బారిన పడ్డవారికి సిద్దిపేట, వనపర్తిలో మాదిరిగా అన్ని జిల్లాల్లో నిక్షయ పోషకాహార కిట్‌ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. అదే విధంగా జిల్లాల్లోని గర్భిణీలకు త్వరలో న్యూట్రిషన్‌ కిట్స్‌ పంపిణీ చేయాలన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top