
జీఓ 33తో మొదలైన వివాదం
పాత జీఓ 114తో అక్రమాలు జరిగాయంటున్న ప్రభుత్వం
జీవో 33తో స్థానికతను కోల్పోయిన కొందరు తెలంగాణ విద్యార్థులు
సుప్రీంకోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో రాష్ట్ర కోటా కింద సీట్ల భర్తీలో నెలకొన్న ‘స్థానికత’వివాదంపై ఉత్కంఠ వీడటం లేదు. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం వాదనలు ముగిసినప్పటికీ, తీర్పును రిజర్వు చేసింది. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలో ఎక్కడా లేని స్థానికత వివాదం తెలంగాణలోనే ఎందుకు వచ్చిందనే చర్చ మొదలైంది. ఉమ్మడి ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2017 తీసుకొచ్చిన జీఓ 114లో మార్పులు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 33తో వివాదం మొదలైంది. ఈ జీవో వల్ల తెలంగాణకు ఉన్న సానుకూలత ప్రతికూల తలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి.
జీవో 33తో మొదలు..
ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా ఏపీ విద్యార్థులకు పదేళ్లపాటు తెలంగాణలోని విద్యా సంస్థల్లో కల్పించిన 15 శాతం రిజర్వే షన్ 2023 విద్యా సంవత్సరంతో ముగిసింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 85%, ప్రైవేటు కళాశాలల్లో 50%సీట్లను తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, మెడికల్ కాలేజీల్లో లోకల్, నాన్ లోకల్ కోటాను నిర్ణయించే నిబంధనలతో 2017లోనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీఓ 114ను జారీచేసింది. ఆ జీఓను సవరిస్తూ గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ 33ను తీసుకొచ్చింది.
జీఓ 114 ఏముంది?
ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో స్థానికతను నిర్ధారిస్తూ 2017 జూలై 5న బీఆర్‌ఎస్‌ప్రభుత్వం ఈ జీఓను తీసుకొచ్చింది. దీనిలో స్థానికత నిర్ధారణకు రెండు క్లాజ్‌లను పొందుపరిచారు. మొదటి క్లాజ్ ప్రకారం 6వ తరగతి నుంచి 12 వరకు కనీసం 4 ఏళ్లపాటు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులుగా పరిగణిస్తారు. రెండో క్లాజ్ ప్రకారం 9వ తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్) వరకు ఒకే దగ్గర చదివిన విద్యార్థులను స్థానికులుగా గుర్తిస్తారు. ఈ రెంటిలో ఏది ఉన్నా స్థానికులే.
జీఓ 33లో ఏముంది?
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జీఓ 114ను సవరిస్తూ 2024 జూలై 19న ఈ జీఓను తీసుకొచ్చింది. 114 జీఓలోని మొదటి క్లాజ్ (6 నుంచి 12 తరగతి వరకు ఎక్కడ నాలుగేళ్లు చదివితే అక్కడే స్థానికులు అనే నిబంధన) జీఓ 33 ద్వారా తొలగించారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదివిన వారే స్థానికులు అని స్పష్టం చేశారు.
జీఓ 114 దుర్వినియోగం
జీఓ 33 ఆధారంగానే గత సంవత్సరం కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం మెడికల్ సీట్ల కౌన్సెలింగ్ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వారందరికీ తహసీల్దార్ ఇచ్చే నివాస ధ్రువీకరణ పత్రం ఆధారంగా సీట్లు కేటాయించాలని కోర్టు ఆదేశించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.
అక్కడ వాదనలు జరుగుతుంగానే ఈ ఏడాది కూడా కాళోజీ వర్సిటీ జీఓ 33 ప్రకారమే ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానించడంతో గత నెల 24న సుప్రీంకోర్టు కేసును విచారించి, స్థానికత అంశం తేలే వరకు పాత నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని వర్సిటీని ఆదేశించింది. కాగా, 6 నుంచి 12వ తరగతి వరకు నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికత అనే నిబంధనతో మెడికల్ సీట్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు కాళోజీ యూనివర్సిటీ 2023లో గుర్తించింది.
ఏపీకి చెందిన పలువురు విద్యార్థులు 6 నుంచి 9 వరకు (నాలుగేళ్లు) తెలంగాణలో చదివినట్లు ప్రైవేటు స్కూళ్ల నుంచి నకిలీ స్టడీ, బోనఫైడ్ సర్టిఫికేట్లు తెచ్చి ఎంబీబీఎస్ సీట్లు పొందినట్లు తేల్చి ఏడుగురి సీట్లను రద్దు చేసింది. ఈ అక్రమాలను నివారించేందుకు బోర్డు పరీక్షలు ఉన్న 10వ తరగతిని తప్పనిసరి చూస్తూ 9 నుంచి 12 (ఇంటరీ్మడియట్) తరగతులు తెలంగాణలో చదివితేనే స్థానికులుగా పేర్కొంటూ ప్రభుత్వం జీఓ 33ను తెచ్చింది.
జీఓ 33తో తెలంగాణవారూ నాన్ లోకల్
జీవో 33 వల్ల కొందరు తెలంగాణ విద్యార్థులు కూడా లోకల్ స్టేటస్ కోల్పోవటంతో వివాదం ముదిరింది. నల్లగొండ, ఖమ్మం, గద్వాల జిల్లాలకు చెందిన తెలంగాణ విద్యార్థులు 10వ తరగతి వరకు స్థానికంగా చదివి, ఇంటర్మీడియట్ ఏపీలో చదివారు. వారు జీఓ 33 ప్రకారం స్థానికులు కాదు.