Telangana: 7న మేయర్, చైర్మన్ల ఎన్నికలు

Telangana: Mayor And Chairman Election On 7th May - Sakshi

నోటిఫికేషన్‌ జారీ  

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలు ఈ నెల 7న మధ్యాహ్నం 3.30 గంటలకు నిర్వహించనున్నారు. పరోక్ష పద్ధతిలో జరగనున్న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ బుధవారం జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు నియమించిన గెజిటెడ్‌ అధికారి ప్రిసైడింగ్‌ అధికారిగా ఉంటారు. ఆయన ఈ పదవులకు ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక సమావేశానికి పిలుపునిస్తూ ఈ నెల 6న లేదా అంతకంటే ముందే నోటీసు జారీ చేస్తారు.

7న మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తొలుత వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం 3.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్‌పర్సన్, డిప్యూటీ చైర్‌పర్సన్ల ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికైన వార్డు మెంబర్లు, ఎక్స్‌– అఫీషియో సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోకసభ, రాజ్యసభ సభ్యులు ఓటేయడానికి అర్హులు. ఓటు హక్కు ఉన్న సభ్యుల్లో సగం సంఖ్యను ’కోరం’గా పరిగణిస్తారు. మొదటి రోజు కోరం లేక ఎన్నిక నిర్వహించలేని పక్షంలో మరుసటి రోజు ఎన్నిక నిర్వహించాలి. రెండో రోజు లేదంటే ఆ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలి.

తదుపరి సమావేశంలో కోరంతో సంబంధం లేకుండా ఎన్నిక జరుగుతుంది. పార్టీ విప్‌కు అనుగుణంగా చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తారు. పార్టీ విప్‌ ను ధిక్కరించిన వారు అనర్హతకు గురవుతారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు విప్‌ ను నియమించి ఆ విషయాన్ని ప్రిసైడింగ్‌ అధికారికి ఎన్నిక ముందు రోజు 11 గంటల లోపు తెలపాలి. చైర్మన్, డిప్యూటీ చైర్మన్, మేయర్, డిప్యూటి మేయర్‌ అభ్యర్థి పేరును ఓటు హక్కు కలిగి ఉన్న ఒక సభ్యుడు ప్రతిపాదిస్తే మరొకరు బలపరచాలి.

ఒకే అభ్యర్ధి పోటీలో ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. చైర్‌పర్సన్‌/ మేయర్‌ ఎన్నిక పూర్తికాకపోతే డిప్యూటీ చైర్‌పర్సన్‌/ డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నిర్వహించరాదు. పరోక్ష ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుంది. ఈ ఎన్నికలు జరగనున్న జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు/ ఎస్పీలు, మున్సిపల్‌ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ ఎన్నిక నిర్వహించాలని ఆదేశించారు. విజయోత్సవ ర్యాలీపై ఎన్నికల సంఘం ఇప్పటికే నిషేధం విధించిన విషయం తెలిసిందే.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top