డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తెలంగాణ

Telangana: Mahmood Ali Inaugurates New Shamshabad Police Station - Sakshi

పెద్దషాపూర్‌లో శంషాబాద్‌ ఠాణా నూతన భవనాన్ని ప్రారంభించిన హోంమంత్రి మహమూద్‌ అలీ 

ప్రారంభోత్సవానికి హాజరైన శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి

శంషాబాద్‌ రూరల్‌: డ్రగ్‌ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంతో పాటు శాంతిభద్రతల కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ చెప్పారు. ఆదివారం శంషాబాద్‌ మండలం పెద్దషాపూర్‌లో కొత్తగా నిర్మించిన శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ను శ్రీత్రిదండి చినజీయర్‌స్వామితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, డ్రగ్స్‌ సరఫరా అదుపునకు సీఎం ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటుచేసి, డీజీపీకి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.

శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనమన్నారు. పోలీస్‌ శాఖకు రూ.700 కోట్లు మంజూరుచేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మరో రెండు నెలల్లో పోలీస్‌ కమాండింగ్‌ కంట్రోల్‌ను ప్రారంభిస్తామన్నారు. పోలీస్‌ శాఖలో మహిళలకు 33 శాతం కోటా కల్పించినట్లు హోంమంత్రి పేర్కొన్నారు. స్టార్‌ హోటల్‌ తరహాలో శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ భవనాన్ని ఆధునిక హంగులతో రూ.4.5 కోట్ల వ్యయంతో మైహోం సంస్థ నిర్మించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, మైహోం గ్రూపు సంస్థల చైర్మన్‌ జూపల్లి రామేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top