పల్లెకు ‘బదిలీ’ లేదు.. ఆదాయమంతా ప్రభుత్వ ఖజానాకే

Telangana: Land Values Registration Charges Increased From Today - Sakshi

ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ ఇక రాదు

రిజిస్ట్రేషన్‌ లావాదేవీల ఆదాయమంతా ప్రభుత్వ ఖజానాకే..

గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ ఫీజు 2 శాతానికి పెంపు ఫలితం

పెంచిన ఫీజు తర్వాత స్టాంప్‌ డ్యూటీతో పాటు బదిలీ సుంకం ఉంటే 9 శాతానికి పెరుగుతున్న రిజిస్ట్రేషన్‌ చార్జీలు.. 

అలా వసూలు చేయడం చట్ట ప్రకారం అసాధ్యం

అందుకే గ్రామాలకు ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ బంద్‌

నేటి నుంచే అమల్లోకి పెంచిన భూముల విలువలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు

గతంలో అన్ని ప్రాంతాల్లో వసూలు చేసిన రిజిస్ట్రేషన్‌ ఫీజు

ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్‌ ఫీజు పట్టణాలకే పరిమితం

రాష్ట్రవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం విస్తరిస్తున్న తరుణంలో పట్టణాలను ఆనుకుని ఉన్న గ్రామ పంచాయతీలకు ఏటా లక్షల రూపాయల ఆదాయం ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ రూపంలో లభించేది. 

ప్రస్తుతం బదిలీ సుంకాన్ని కూడా రిజిస్ట్రేషన్‌ ఫీజు రూపంలోనే వసూలు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన నేపథ్యంలో, ఆ రూపేణా గ్రామాలకు నిధులు సమకూరని పరిస్థితి ఏర్పడింది.  

సాక్షి, హైదరాబాద్‌: రిజిస్ట్రేషన్‌ ఫీజులోని 1.5 శాతం బదిలీ సుంకం ద్వారా ఇప్పటివరకు గ్రామ పంచాయతీలకు వస్తున్న ఆదాయం ఇక మీదట ఆగిపోయే పరిస్థితి నెలకొంది. రిజిస్ట్రేషన్‌ ఫీజును (స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ కలిపి) 6 శాతం నుంచి 7.5 శాతానికి ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. కాగా ఇందులో గ్రామాలకు వెళ్లాల్సిన 1.5 శాతం బదిలీ సుంకాన్ని (ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ) కూడా రిజిస్ట్రేషన్‌ ఫీజు రూపంలోనే వసూలు చేయాలని ప్రభుత్వం తాజా గా నిర్ణయించింది. దీంతో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ లావాదేవీల ఆదాయమంతా నేరుగా ప్రభుత్వ ఖజానాకే చేరనుంది. 

గతంలో ఇలా.... 
గతంలో 6 శాతంగా ఉన్న మొత్తం రిజిస్ట్రేషన్‌ ఫీజులో 4 శాతం స్టాంపు డ్యూటీ, 1.5 శాతం బదిలీ సుంకం,, 0.5 శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద వసూలు చేసేవారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే వ్యత్యాసం లేకుండా రిజిస్ట్రేషన్‌ ఫీజు రాష్ట్ర వ్యాప్తంగా 0.5 శాతం తీసుకునేవారు. కానీ తాజా సవరణల్లో ఈ రిజిస్ట్రేషన్‌ ఫీజును గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు విడివిడిగా ఖరారు చేశారు. తాజాగా పెంచిన ఉత్తర్వుల ప్రకారం అమ్మకపు లావాదేవీలకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్‌ ఫీజును 0.5 శాతంగానే కొనసాగించగా, గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని 2 శాతంగా ఖరారు చేశారు. దీంతో సమస్య వచ్చిపడింది. గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద 2 శాతం, స్టాంపు డ్యూటీ 5.5 శాతం వసూలు చేస్తే ఇక ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ ఉండనట్టేనని అర్ధమవుతోంది. ఒకవేళ ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 1.5 శాతం వసూలు చేస్తే అప్పుడు మొత్తం ఫీజు 9 శాతం అవుతుంది. అలా వసూలు చేయడం చట్టప్రకారం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో రిజిస్ట్రేషన్‌ ఫీజును (స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ కలిపి) 7.5 శాతానికి పెంచుతున్నట్టు పేర్కొన్నారు. ఆ ఉత్తర్వుల ప్రకారం ఏ రూపంలో వసూలు చేసినా మొత్తం రిజిస్ట్రేషన్‌ ఫీజు రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా 7.5 శాతానికి మించకూడదు. అలా మించకూడదంటే ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీని గ్రామాలకు మినహాయించాల్సిందేనని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు వివరిస్తున్నాయి. 

ఆర్థిక కష్టాలు తప్పనట్టే..
బదిలీ సుంకం ద్వారా పట్టణ శివారు గ్రామాలకు ఎక్కువగా లబ్ధి జరిగేది. అక్కడ జరిగే రియల్‌ వ్యాపారాన్ని బట్టి ప్రతి ఏటా రూ.4–5 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చేది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పెద్దగా లేని మండల కేంద్రాలు, మేజర్‌ గ్రామపంచాయతీలకు కూడా ఏటా రూ.50 వేల వరకు నిధులు వచ్చేవి. ఈ బదిలీ సుంకాన్ని సాధారణ నిధి (జనరల్‌ ఫండ్‌) కింద పరిగణిస్తుండడంతో ఆయా గ్రామాల సర్పంచ్‌ల విచక్షణ మేర గ్రామంలో అభివృద్ధి, ఇతర కార్యక్రమాలకు వినియోగించేవారు. ఇప్పుడు ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ కింద గ్రామాలకు నిధులు బంద్‌ అయితే ఆ మేరకు గ్రామాలకు ఆర్థిక కష్టాలు తప్పవని పంచాయతీరాజ్‌ శాఖ వర్గాలంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో టీడీ మినహాయించాలంటే పంచాయతీరాజ్‌ శాఖ ద్వారానే ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్‌ శాఖ ఏం నిర్ణయం తీసుకుంటుందో.. గ్రామ పంచాయతీలు ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ రూపంలో నష్టపోనున్న మొత్తాన్ని ప్రభుత్వం ఏ రూపంలో సమకూరుస్తుందో వేచి చూడాల్సిందే...!

గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ విలువలు భారీగా పెంపు
రాష్ట్రంలో నిర్మాణాలకు సంబంధించిన విలువలను కూడా ప్రభుత్వం భారీగానే సవరించింది. రీఇన్‌ఫోర్స్‌డ్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ (ఆర్‌సీసీ/స్లాబ్‌) నిర్మాణాలకు గాను గతంలో పట్టణ ప్రాంతాల్లో చదరపు అడుగుకు రూ.700గా ఉన్న విలువను ఇప్పుడు రూ.1,100గా నిర్ధారించారు. ఆర్‌సీసీయేతర నిర్మాణాలకు గతంలో రూ.380 ఉండగా, ఇప్పుడు చదరపు అడుగుకు రూ.750గా ఖరారు చేశారు. ఇలా స్లాబ్‌ నిర్మాణాల విలువలు పట్టణ ప్రాంతాల్లో 60 శాతం పెరగ్గా, నాన్‌ ఆర్‌సీసీ నిర్మాణాల విలువలు 100 శాతం వరకు పెరిగాయి. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఏకంగా దాదాపు 200 శాతం మేరకు విలువలు సవరించారు.

గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్‌సీసీ నిర్మాణాలకు గాను చదరపు అడుగుకు గతంలో రూ.440 ఉన్న విలువను ఇప్పుడు రూ.900కు (120 శాతం వరకు) పెంచారు. అదే నాన్‌ ఆర్‌సీసీ నిర్మాణాలకు సంబంధించి రూ.215గా ఉన్న చదరపు అడుగు విలువను  దాదాపు 200 శాతం పెంపుతో రూ.600గా  ఖరారు చేశారు. ఇలావుండగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన భూముల విలువలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటికే అన్ని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు పెంపుదలకు సంబంధించిన సమాచారం ఇవ్వడంతో పాటు, సాఫ్ట్‌వేర్‌లోనూ మార్పులు ప్రక్రియ పూర్తయింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top