ఏడాదిన్నరలో సమగ్ర రీసర్వే | Telangana Land Resurvey Ponguleti Srinivas Reddy Land Disputes | Sakshi
Sakshi News home page

ఏడాదిన్నరలో సమగ్ర రీసర్వే

Oct 10 2026 5:19 AM | Updated on Oct 10 2026 5:19 AM

Telangana Land Resurvey Ponguleti Srinivas Reddy Land Disputes

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

భూవివాదరహిత తెలంగాణే లక్ష్యంగా పూర్తి చేయాలి

సర్వే పర్యవేక్షణ కోసం 7 జోన్లకు 14 మంది ఉన్నతాధికారుల నియామకం

రీసర్వే ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకం

ప్రతి వారం రాష్ట్రస్థాయిలో అధికారులు సమీక్ష నిర్వహించాలి

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా, భూవివాదాలు లేని తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన భూముల సమగ్ర రీసర్వేను ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. దీని పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులతో శుక్రవారం సచివాలయంలో సమావేశమైన ఆయన భూ సర్వే పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ 125 ఏళ్ల తర్వాత భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం వచ్చిందని, దీన్ని అధికారులు అత్యంత బాధ్యతతో నిర్వర్తించాలన్నారు. ఈ సర్వేలో వేగం, నాణ్యత ఉండాలని, ప్రతి దశలోనూ పర్యవేక్షణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. రీ సర్వేను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ఒక్కో జోన్‌కు రెవెన్యూ, సర్వే విభాగాల నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 14 మంది ఉన్నతాధికారులను నియమిస్తున్నామని, ఎప్పటికప్పుడు సర్వే జరుగుతున్న తీరు, నాణ్యత, ప్రజల స్పందనను పరిశీలించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

నక్షాలేని 365 గ్రామాలతోపాటు జిల్లాకు 70 చొప్పున చేట్టిన 2,240 గ్రామాల్లో రీసర్వే ముమ్మరంగా సాగుతోందని, ఇప్పటివరకు 245 గ్రామాల్లో పూర్తయిందని చెప్పారు. ప్రతి మండలంలో కనీసం రెండు రెవెన్యూ గ్రామాల్లో సర్వే తప్పనిసరిగా చేయాలని, మొదటి దశ సర్వేను నవంబర్‌ చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ప్రతి మండలానికి రెండు బృందాలను ఏర్పాటు చేయాలని, లైసెన్సుడు సర్వేయర్‌లతో పాటు జీపీవో, డిప్యూటీ తహసీల్దార్‌ లేదా జూనియర్‌ అసిస్టెంట్, ఆపైస్థాయి సిబ్బందిని ఈ బృందంలో నియమించాలని సూచించారు.

సర్వే జరుగుతున్న గ్రామాలను ప్రతి రోజు తహశీల్దార్‌ ప్రత్యక్షంగా పరిశీలించాలని, ఎక్కడ సర్వే జరిగింది? ఎన్ని ఎకరాలు, ఎన్ని సర్వే నెంబర్లలో సర్వే పూర్తయింది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? సర్వేలో వస్తున్న సమస్యలేంటనే విషయాలపై ప్రతి రోజూ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎక్కడా చిన్నపొరపాటుకు తావు లేకుండా, భవిష్యత్తులో భూవివాదాలకు అవకాశం లేకుండా రీసర్వేను పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులకు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో ప్రత్యేక డాష్‌బోర్డు
రీ–సర్వేను రాష్ట్రస్థాయి నుంచి నిరంతరం పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక డాష్‌బోర్డును ఏర్పాటు చేయాలని మంత్రి పొంగులేటి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సర్వే పురోగతి, రోజువారీ పనితీరు, గ్రామాల వారీగా పూర్తయిన సర్వే, పనిచేస్తున్న సర్వే బృందాల వివరాలు, ఉపయోగిస్తున్న రోవర్లు, వాటి లొకేషన్‌వంటి వివరాలన్నీ డాష్‌బోర్డులో రియల్‌టైమ్‌లో కనిపించేలా టెక్నాలజీని వినియోగించాలని సూచించారు.

సర్వేకు అవసరమైన సర్వేయర్లు, రోవర్లు, సర్వర్లు, ఇతర సాంకేతిక పరికరాలు, సామగ్రి కొనుగోలుకు నిధుల కొరత ఉండదని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. అవసరమైన నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేస్తుందని, అదనపు రోవర్లను కూడా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.

రీసర్వే ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనదని, ప్రతి వారం రాష్ట్రస్థాయిలో అధికారులు సమీక్ష నిర్వహించాలని, ప్రతి 15 రోజులకు తాను స్వయంగా సమీక్షించి పురోగతిని పరిశీలిస్తానని చెప్పిన మంత్రి ప్రభుత్వ భూముల సర్వే సమయంలో సరిహద్దులను గుర్తించే ప్రక్రియలో సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. సర్వే పేరుతో స్థానికంగా ఎవరైనా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు.

ఇదీ చదవండి: భవిష్యత్‌ అవసరాలకు తగినట్టుగా ప్రజా రవాణా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement