BRS MLAs poaching case:సీబీఐకి ఎమ్మెల్యేల ఎర కేసు..

Telangana high court transfers probe to CBI - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు కీలక మలుపు తీసుకుంది. దీని దర్యాప్తు బాధ్యతను సీబీఐకి బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దీనిని విచారిస్తున్న సిట్‌గానీ, దర్యాప్తు అధికారిగానీ ఇక ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్‌ 63 రద్దు చేసింది. కేసు (ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 455/2022) పూర్తి వివరాలను, స్వాధీనం చేసుకున్న మెటీరియల్‌ను సీబీఐకి అందజేయాలని సిట్, దర్యాప్తు అధికారులకు స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ విచారణపై తమకు నమ్మకం లేదని.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నిందితులు రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీ దాఖలు చేసిన పిటిషన్ల మేరకు హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయమై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి కూడా పిటిషన్‌ వేసినా.. ఈ కేసులో బాధితులు, నిందితుల్లో  ఎవరూ కూడా కానందున ఆ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది.  

వీడియోలు బయటపెట్టడం ఏమిటి? 
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసుకు సంబంధించి నిందితుల పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఇప్పటికే ఇరువర్గాల వాదనలను విన్నారు. సోమవారం దీనిపై తీర్పు వెలువరించారు. ఈ వ్యవహారానికి సంబంధించి సీఎంకు ఎవరు వీడియో రికార్డింగ్‌లు, ఇతర మెటీరియల్‌ ఇచ్చారన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లలో ఎక్కడా స్పష్టత ఇవ్వలేదని.. దర్యాప్తు వివరాలను మీడియాకు వెల్లడించవద్దని ఆదేశించినా రోజువారీ విచారణ వివరాలు ఎలా బయటికి వచ్చాయని పిటిషనర్లు చేసిన వాదనను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమే అయినా దర్యాప్తు ప్రారంభం సమయంలోనే వివరాలన్నీ బహిర్గతం కావడం ఏమిటని న్యాయమూర్తి తప్పుబట్టారు. ‘‘కేసు వివరాలు బహిర్గతం కావడం పోలీసు దర్యాప్తుపై నిందితులకు అనుమానం కలిగేలా చేసింది. పోలీసులు స్వేచ్ఛగా, పారదర్శకంగా విచారణ చేయలేరన్న భావనను పురిగొల్పింది. నిజానికి ఒకరికి అనుకూలంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారనేది ఏదీ నిరూపితం కాలేదు. అయినా నిందితుల అనుమానాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ఆర్టికల్‌ 20, 21 ప్రకారం విచారణ (ట్రయల్‌) మాత్రమే కాదు.. దర్యాప్తు (ఇన్వెస్టిగేషన్‌) కూడా పారదర్శకంగా కొనసాగాల్సి        ఉంటుంది. అందువల్ల నిందితుల  విజ్ఞప్తికి అనుకూలంగా ఆదేశాలు ఇస్తున్నాం..’’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే ఈ ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళతామని.. ఆర్డర్‌ కాపీ విడుదలయ్యే వరకు అమలును నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ విజ్ఞప్తి చేయగా.. న్యాయమూర్తి దానికి అంగీకరించారు. 

ఫాంహౌజ్‌ కలకలం నుంచి.. కోర్టు తీర్పుదాకా.. 
టీఆర్‌ఎస్‌ (ప్రస్తుతం బీఆర్‌ఎస్‌)కు చెందిన ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్‌), రేగా కాంతారావు (పినపాక)తో పాటు తనను బీజేపీలో చేరాలంటూ ప్రలోభపెడుతున్నారని ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి (తాండూరు) అక్టోబర్‌ 26న సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము పార్టీ మారితే ఒక్కొక్కరికి రూ.50 కోట్లు, కాంట్రాక్టులు, కేంద్ర అధీనంలోని పదవులు ఇస్తామంటూ ఎర వేశారని పేర్కొన్నారు. 

దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు.. ముందస్తు వ్యూహం ప్రకారం రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌ పరిధిలోని అజీజ్‌నగర్‌లో ఉన్న పీవీఆర్‌ ఫామ్‌హౌజ్‌పై దాడి చేసి ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీలను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఎమ్మెల్యేలను ప్రగతిభవన్‌కు, నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేసిందని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. 

అక్టోబర్‌ 27న బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌) ఎమ్మెల్యేలకు ఎర పేరిట దాఖలైన కేసులో సీబీఐ లేదా సిట్‌తో దర్యాప్తు జరిపించేలా ఆదేశించాలంటూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇదంతా తమను అప్రతిష్టపాలు చేసేందుకు బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌) పన్నిన కుట్రగా అభివర్ణించింది. 

మరోవైపు కేసులో సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ నిందితులు రామచంద్ర భారతి, నందుకుమార్, సింహయాజీలు నవంబర్‌ 4న హైకోర్టులో పిటిషన్లు వేశారు. నాటి నుంచి పిటిషన్లపై వాదనలు జరిగాయి. తొలుత సిట్‌ దర్యాప్తుపై సింగిల్‌ జడ్జి స్టే విధించారు. సిట్‌ దీనిని ద్విసభ్య ధర్మాసనం ముందు సవాల్‌ చేసింది. స్పందించిన ధర్మాసనం సిట్‌ విచారణ హైకోర్టు సింగిల్‌ జడ్జి పర్యవేక్షణలోనే సాగాలని స్పష్టం చేసింది.

అదే సమయంలో సిట్‌ దర్యాప్తులో ముందుకెళ్లవచ్చని సూచించింది. మరోవైపు నిందితులు తమ అరెస్టుపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు విచారణను హైకోర్టుకే బదిలీ చేసింది. బెయిల్‌పై ట్రయల్‌ కోర్టు నిర్ణయం తీసుకోవచ్చని సూచించింది. 

ఈ కేసులో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు కూడా హాజరవడంతో వాడివేడిగా వాదనలు జరిగాయి. బీజేపీ తరఫున వైద్యనాథన్‌ చిదంబరేశ్‌.. నిందితుల తరఫున మహేశ్‌ జెఠ్మలానీ.. ప్రభుత్వం తరఫున దుష్యంత్‌ దవే, అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్‌ ప్రసాద్, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) రామచంద్రరావు వాదనలు వినిపించారు. 
‘‘ఏ కేసులోనైనా దర్యాప్తు పారదర్శకంగా, నిజాయతీ జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసులు పక్షపాతం చూపిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ సిట్‌ విచారణకు ముందే మీడియాకు వివరాలు వెల్లడించారు. పోలీసులే ఆయనకు మెటీరియల్‌ అందజేశారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే సిట్‌ పనిచేస్తోంది. ఫామ్‌హౌస్‌ ఘటన జరిగిన రోజే సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు.

తెలంగాణ హైకోర్టుతోపాటు ఇతర హైకోర్టుల సీజేలకు ఘటన సీడీలు, ఇతర వివరాలను సీఎం కేసీఆర్‌ పంపారు. వాస్తవానికి దర్యాప్తునకు సంబంధించిన ఏ అంశమైనా బయటికి రాకూడదు. కానీ కీలక సమాచారం ఎప్పటికప్పుడు మీడియాకు లీక్‌ చేస్తున్నారు. ఈ కేసులో సీబీఐ లేదా ఇతర స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలి’’ అని నిందితులు, బీజేపీ తరఫు న్యాయవాదులు హైకోర్టుకు విన్నవించారు. ఈ సందర్భంగా పలు సుప్రీంకోర్టు, హైకోర్టుల ఉత్తర్వులను కూడా వివరించారు. 

మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్‌ దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ‘‘ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే వీగిపోవడం ఖాయం. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం తీవ్ర నేరం. ఈ కేసును ఎంతో వేగంగా చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో సిట్‌ దర్యాప్తు కొనసాగుతుందనడానికి ఆధారాలు లేవు.

ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న నిందితుల వీడియోలు, వాయిస్‌ రికార్డింగ్‌లు ప్రధాన న్యాయమూర్తి, ఇతరులకు పంపడం తప్పే. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే ఈ కుట్ర జరిగింది. బీజేపీకి సంబంధం లేదంటూనే ఆ పార్టీ నేతలు నిందితుల తరఫున పిటిషన్లు వేస్తున్నారు. తప్పు చేయకపోతే విచారణకు సహకరించాలి’’ అని వాదించారు. 
ఇరు వర్గాలు చెప్పిన అంశాలను విన్న న్యాయమూర్తి గత వారమే తుది వాదనలను పూర్తిచేసి.. తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ప్రకటించారు. సోమవారం తీర్పును వెలువరించారు.
   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top