తెలంగాణలో భారీగా కోవిడ్‌ కేసులు.. హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana High Court Key Orders On Corona Situations - Sakshi

ఆర్టీపీసీఆర్‌ టెస్టులు పెంచండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

కరోనా విజృంభణపై మరింత

అప్రమత్తంగా వ్యవహరించండి

ప్రజలు జాగ్రత్తలు పాటించేలా చూడండి

చర్యలపై 24లోగా నివేదిక ఇవ్వండి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యం లో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఆదేశించిన మేరకు ఆర్‌టీపీసీఆర్‌ పరీ క్షలను పెంచాలని, రోజుకు లక్ష పరీక్షలు నిర్వ హించాలని తేల్చిచెప్పింది. ప్రజలు గుమిగూడ కుండా చూడాలని, ప్రజలు భౌతికదూరం పాటించేలా, మాస్క్‌ను తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు తీసుకున్న చర్యలను వివరిస్తూ ఈనెల 24లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావలిలతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్‌టీపీసీఆర్, ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలకు సంబంధించి వేర్వేరుగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. 

50 వేలకు మించి చేయడం లేదు
రోజుకు తప్పసరిగా లక్ష కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని గతంలో ధర్మాసనం ఆదేశించిందని, అయితే అప్పుడప్పుడు మినహా రోజుకు 50 వేలకు మించి పరీక్షలు చేయడం లేదని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ నివేదించారు. ప్రధానంగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల సంఖ్యను పెంచాలన్న ఆదేశాలను అమలు చేయడం లేదన్నారు. కరోనా కేసుల ఆధారంగా కంటైన్‌మెంట్, మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేసి కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మరో న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ ఆరోపించారు.

సరైన నియంత్రణ చర్యలు లేక అనేకమంది న్యాయవాదులు, న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారని తెలిపారు. కాగా కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి సమావేశమై చర్చించనుందని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. రోజుకు ఆర్‌టీపీసీఆర్, ర్యాపిడ్‌ యాంటీజన్‌ పరీక్షలు కలిపి లక్ష వరకు చేయాలని గతంలో ధర్మాసనం ఆదేశించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో స్పందించిన ధర్మాసనం.. కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలపై 24లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.    

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top