ఎల్‌ఆర్‌ఎస్‌పై హైకోర్టు నోటీసులు | Sakshi
Sakshi News home page

ఎల్‌ఆర్‌ఎస్‌ జీవో 131 ని సవరిస్తూ ఉత్తర్వులు

Published Thu, Sep 17 2020 2:04 PM

Telangana High Court Issues Notice To Govt Over Unapproved Layouts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌ అంశంపై  ‘ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఎల్ఆర్‌ఎస్ పలు చట్టాలకు విరుద్ధంగా ఉందని పిటిషనర్ కోర్టుకు తన వాదన వినిపించాడు. తుది తీర్పునకు లోబడి ఉండేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్‌ కోర్టును కోరారు. అయితే ప్రభుత్వ వైఖరి తెలుసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 8కి వాయిదా వేసింది. 

ఎల్‌ఆర్‌ఎస్‌పై జీవో 131ని సవరిస్తూ ఉత్తర్వులు
పేద, మధ్య తరగతి వర్గాలపై ఆర్థిక భారం పడకుండా రిజిస్ట్రేషన్‌ నాటి మార్కెట్‌ విలువ ఆధారంగానే భూముల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) చేసే విధంగా జీవో 131ని సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగానే ఎల్ఆర్ఎస్ చార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపింది. అసెంబ్లీలో కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు రిజిస్ట్రేషన్ జరిగిన సమయం నాటి మార్కెట్ విలువను వర్తింపజేయనున్నారు. క్రమబద్ధీకరణ చార్జీలను స్వల్పంగా తగ్గిస్తూ సీఎస్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పాత ఎల్ఆర్ఎస్ స్కీం 2015 కి సమానంగా చార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. (చదవండి: ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీ స్పందన)

దీని ప్రకారం.. గజం మూడు వేల గజాల లోపు ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో 20 శాతం చెల్లించాలి. ఇక గజం 3 వేల నుంచి 5 వేల వరకు ఉన్న వాళ్లు రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో 30 శాతం చెల్లించాల్సి ఉండగా..  5వేల నుంచి 10 వేల గజాలు వరకు ఉన్న వారు రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో 40 శాతం చెల్లించాలని తెలిపింది. 10 వేల నుంచి 20 వేల గజాలు వరకు ఉంటే రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో 50 శాతం.. 20 వేల నుంచి 30 వేల గజాల వరకు ఉన్న వారు రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో 60 శాతం.. 30 వేల నుంచి 50 వేల గజాల వరకు ఉన్న వారు రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో 80 శాతం.. 50 వేల గజాలపైన ఉన్న వారు రిజిస్ట్రేషన్‌లో 100 శాతం చెల్లించాలని తెలిపింది. 

Advertisement
Advertisement