
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో ఓట్ చోరీపై హైకోర్టు విచారణ చేపట్టింది. బోగస్ ఓట్లు తొలగించాలంటూ మాగంటి సునీత, కేటీఆర్ లంచ్ మోషన్ పిటీషన్లు దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌తో సంబంధం లేనివారు ఓటర్ జాబితాలో చేరారని పిటిషన్‌లో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ తరఫున న్యాయవాది దామా శేషాద్రినాయుడు తన వాదనలు కోర్టుకు వినిపించారు. ‘‘జూబ్లీహిల్స్‌లో 19వందలకు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయి. 12 వేల మంది బయటి వ్యక్తులకు ఓట్లు ఉన్నాయి. కొంతమందికి రెండు ఓట్లు ఉన్నాయి. డూప్లికేట్ ఓట్లు కూడా నమోదయ్యాయి’’ అని ఆయన కోర్టుకు తెలిపారు.
పిటీషనర్లు చీఫ్ ఎలక్ర్టోరల్ అధికారికి ఫిర్యాదు చేశారని ఎలక్షన్ కమిషన్ తరఫు న్యాయవాది అవినాష్.. కోర్టుకు తెలిపారు. ఓటర్ల నమోదు అనేది నిరంతర ప్రక్రియ.. 21వ తేదీ వరకు పరిశీలన చేస్తారన్న ఈసీ తరఫు న్యాయవాది.. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారిని సైతం వివరణ అడిగినట్లు తెలిపారు.
పిటీషన్‌పై విచారణ ముగించిన హైకోర్టు.. ఈసీ తరఫు న్యాయవాది వాదనలను సీజే ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. పిటీషనర్ విజ్ఞప్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్న ఈసీ న్యాయవాది వాదనలను హైకోర్టు రికార్డు చేసింది. ఈ పిటీషన్‌లో ప్రత్యేక ఆదేశాలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.