డిగ్రీ, పీజీ పరీక్షలకు ఓకే

Telangana High Court Green Signals To Hold Degree And PG Exams - Sakshi

 కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని హైకోర్టు ఆదేశం

అడ్వాన్స్‌ సప్లిమెంటరీ వీలైనంత త్వరగా పెట్టాలి

రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం స్పష్టీకరణ 

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. బుధవారం నుంచి నిర్వహించనున్న ఈ పరీక్షలు రాయలేక పోయిన విద్యార్థులకు త్వరలోనే అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, వాటిలో ఉత్తీర్ణత సాధించినా రెగ్యులర్‌ విద్యార్థులుగానే పరిగణిస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు లను ధర్మాసనం రికార్డు చేసింది. గతంలో ఇదే షరతుతో పదో తరగతి పరీక్షలు, పీజీ మెడికల్‌ విద్యార్థుల పరీక్షలకు అనుమతి నిచ్చిన విష యాన్ని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో పరీక్ష లను ఆపడానికి సహేతుక మైన కారణాలేవీ లేవని తేల్చిచెప్పింది. అయితే కోవిడ్‌ నిబంధన లను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసు కోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు అటానమస్‌ కళాశాలలు, వర్సిటీల్లో వారి సిలబస్‌కు అనుగుణంగా వారికి నచ్చిన ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించుకోవచ్చంది. ఇటు యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో మాత్రం పరీక్షలను భౌతికంగానే నిర్వహించాలని పేర్కొంది. అలాగే ఇప్పుడు పరీక్షలు రాయలేని వారి కోసం విద్యా సంవత్సరం నష్టపోకుండా.. వీలైనంత త్వరగా, ఇప్పుడు నిర్వహిస్తున్న పరీక్షల ఫలితాలు ప్రకటించిన వెంటనే అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు బీవీ నరసింగరావు, గరీబ్‌ గైడ్‌ స్వచ్ఛంద సంస్థ వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలను ఎప్పుడు పెడతారో స్పష్టం చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనను కోర్టు తోసిపుచ్చింది.

అది విధానపరమైన నిర్ణయం..
‘పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలోనా లేక భౌతిక పద్ధతిలోనా ఏవిధంగా నిర్వహించాలన్నది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. విధానపమైన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు. ఆన్‌లైన్‌ విధానంలోనే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేం. అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలన్నది కూడా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమే. ఫలానా సమయంలోనే పరీక్షలు నిర్వహించాలని ఆదేశించలేం.. అయితే విద్యా సంవత్సరం నష్టపోకుండా ఇప్పుడు నిర్వహిస్తున్న పరీక్షల ఫలితాలు ప్రకటించిన వెంటనే అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేలా చూడాలని ప్రభుత్వానికి సూచన మాత్రమే చేయగలం. జేఎన్‌టీయూ మాత్రం రెండు నెలల్లో అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. కాబట్టి వారికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు’అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లోని పీజీ కోర్సుల ఫైనలియర్‌ విద్యార్థులతో పాటు డిగ్రీ కోర్సుల ఫైనలియర్‌ విద్యార్థులూ బుధవారం నుంచి పరీక్షలు భౌతికంగానే రాయాల్సి ఉంటుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top