తెలంగాణ మొత్తానికి 50 వేల పరీక్షలేనా?

Telangana HC asks for details of measures taken in a fight with Covid - Sakshi

వివరాలు సమర్పించాలని సర్కారుకు హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ పట్టణంలో రోజుకు 40 వేల కరోనా పరీక్షలు చేస్తుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి రోజుకు 50 వేల పరీక్షలు మాత్రమే చేస్తున్నారా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పరీక్షలు ఎక్కువగా నిర్వహించి కేసులను గుర్తించడం ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా కట్టడి చేయవచ్చన్నారు. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 5 వరకు కరోనా నిర్ధారణ పరీక్షలు ఎన్ని చేశారో జిల్లాల వారీగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఇందులో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు ఎన్ని? ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు ఎన్ని చేశారు? ఎన్ని కేసులను గుర్తించారు? పరీక్షల ఫలితాలను ఎలా తెలియజేస్తున్నారు? సీరో సర్వేలైన్స్‌ ఎలా అమలు చేస్తున్నారు? యూకే నుంచి వచ్చిన వారి ద్వారా కొత్త స్ట్రెయిన్‌ వ్యాప్తి చెందకుండా ఏం చర్యలు తీసుకున్నారు? తదితర వివరాలను సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కరోనా నియంత్రణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ప్రస్తుతం తెలంగాణలో 250 నుంచి 300 కేసులు మాత్రమే ఉన్నాయని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. కొత్త స్ట్రెయిన్‌కు సంబంధించి యూకే నుంచి వచ్చిన నలుగురిని గుర్తించి వారికి చికిత్స అందించి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.  

ఒకే అంశంపై ఇన్ని పిటిషన్లా?
కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై 24 ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు అవడంపై సీజే విస్మయం వ్యక్తం చేశారు. ఒకే అంశానికి సంబంధించి ఇన్ని పిటిషన్లను విచారించడం సరికాదని, ఈ నేపథ్యంలో ఒకే అంశంపై దాఖలైన 22 పిటిషన్లపై విచారణను ముగిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి రాయితీ పద్ధతిలో భూమి పొంది ప్రభుత్వం నిర్దేశించిన మేరకు పేదలకు వైద్యం అందించడం లేదంటూ దాఖలైన వ్యాజ్యాలతోపాటు మిగిలిన ఐదు పిటిషన్లను వేరుగా విచారిస్తామని, ఇతర పిటిషన్లలోని న్యాయవాదులు కోర్టుకు వాదనలు వినిపించి సహకరించవచ్చని సూచించింది.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top