పంచేటోళ్లు కావాలా? పెంచేటోళ్లు కావాలా?

Telangana: Harish Rao Slams On BJP Party - Sakshi

సంగారెడ్డి సభలో మంత్రి హరీశ్‌రావు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలన్నీ పెంచుకుంటూ పోతోంది. గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచింది. పెట్రోల్, మంచినూనె ధరలు పెంచింది. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నీ పంచుకుంటూ పోతోంది. రైతుబంధు కింద ఎకరానికి రూ.పది వేలు ఇస్తోంది. కల్యాణలక్ష్మి కింద రూ.లక్ష ఇస్తోంది. స్త్రీనిధి కింద మహిళలకు రుణాలిస్తోంది. మరి పంచెటోళ్లు కావాలా? పెంచెటోళ్లు కావాలా? అని ప్రజలు ఆలోచన చేయాలి.

పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీని గుద్దుడు గుద్ది.. గద్దెదించాలి..’అని మంత్రి హరీశ్‌రావు బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం సంగారెడ్డి అంబేడ్కర్‌ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో హరీశ్‌రావు అభయహస్తం పథకంలో ఎస్‌హెచ్‌జీ మహిళలు తమ వాటా కింద చెల్లించిన మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేసేందుకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు బీజేపీ, కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డారు.

‘ఒకడు పాదయాత్ర.. ఇంకోడు సైకిల్‌యాత్ర.. ఇంకోడు మోకాళ్లయాత్ర.. బయలెల్లిండ్రు.. ఏం యాత్రలు.. తిట్టుడు తప్ప ఏమీలేదు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలో అమలవుతయా? చెప్పాలి.. కాంగ్రెస్, బీజేపీ పాలనల్లో ఏం జరిగింది?.. ఈ ఆరేండ్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో ప్రజలు ఆలోచన చేయాలి’ అని హరీశ్‌రావు అన్నారు. దేశంలో పేదరికం పెరగడానికి కాంగ్రెస్, బీజేపీలే కారణమన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ, 57 ఏళ్లు దాటిన వారికి ఆసరా పింఛన్ల మంజూరు ఈనెల నుంచే ప్రారంభిస్తామని ప్రకటించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top