మక్కల కొనుగోళ్లకు మాది ‘గ్యారంటీ’! | Telangana Govt Takes Key Decision on Markfed | Sakshi
Sakshi News home page

మక్కల కొనుగోళ్లకు మాది ‘గ్యారంటీ’!

May 25 2026 12:40 AM | Updated on May 25 2026 12:40 AM

Telangana Govt Takes Key Decision on Markfed

మార్క్‌ఫెడ్‌కు  రూ.1867 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇస్తూ సర్కారు నిర్ణయం

ఇప్పటికే రూ.4,173 కోట్ల మేర గ్యారంటీ 

ఇచ్చి, రూ.3,100 కోట్ల విలువైన మక్కల కొనుగోలు

నోడల్‌ ఏజెన్సీ మార్క్‌ఫెడ్‌ ద్వారా మక్కలతోపాటు జొన్న, పొద్దు తిరుగుడు పంటల సేకరణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మార్కెట్‌కు తరలివస్తున్న మక్కల కొనుగోళ్లకు అవసరమైన రుణాలు సమకూర్చుకునేందుకు మార్క్‌ఫెడ్‌కు రూ.1867.77 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్‌ మక్కల కొనుగోళ్లకు నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న మార్క్‌ఫెడ్‌కు ఇప్పటికే ప్రభుత్వం రూ.4,172.94 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చింది. దీంతో మక్కల కొనుగోళ్ల కోసం మార్క్‌ఫెడ్‌కు రూ.6,040.71 కోట్ల రుణాలు పొందేందుకు ప్రభుత్వం సహకారం అందించినట్టయ్యింది.

మక్కలకు క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,400 ఉండగా, మార్కెట్‌లో రూ.1,700 నుంచి రూ.1,850 గిట్టుబాటు ధర పలుకుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే కనీస మద్దతు ధర కింద రైతుల నుంచి కొనుగోలు చేస్తోంది. ఇప్పటి వరకు 354 కొనుగోలు కేంద్రాల (పీఏసీఎస్‌లు) ద్వారా 2.33 లక్షల రైతుల నుంచి 12.85 లక్షల మెట్రిక్‌ టన్నుల మక్కలను మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన మక్కల విలువ రూ. 3,100 కోట్ల వరకు ఉంటుంది. అయితే మార్కెట్‌కు భారీ ఎత్తున మక్కలు వస్తుండడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్‌కు అదనపు రుణం పొందేందుకు అవసరమైన బ్యాంకు గ్యారంటీని ప్రభుత్వం సమకూర్చింది. 

కేంద్రం సహకరించకపోయినా రైతులకు అండగా : మంత్రి తుమ్మల
రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మొక్కజొన్న, జొన్న, పొద్దు తిరుగుడు పంటల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోళ్లపై ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి భారీ స్థాయిలో కొనుగోళ్లు చేపట్టేందుకు సీఎం ఆమోదం తెలిపారన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో మొక్కజొన్న కొనుగోళ్లకు మొత్తం రూ.5,063 కోట్ల మేర మాత్రమే ఖర్చు చేయగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం ఈ ఒక్క యాసంగి సీజన్‌లోనే దాదాపు రూ.6,000 కోట్ల మేర వ్యయం చేస్తోందని తుమ్మల స్పష్టం చేశారు.

జొన్నల కొనుగోళ్లకు రూ.1,100 కోట్లు
జొన్న (హైబ్రిడ్‌) కొనుగోళ్ల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో జొన్న ధర క్వింటాల్‌కు సుమారు రూ.2,000 మాత్రమే ఉండగా, కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర రూ.3,699గా ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.1,100 కోట్లకు పైగా వ్యయంతో జొన్న కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. జిల్లాల వారీగా జొన్న కొనుగోళ్ల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో 26 కేంద్రాలు, సంగారెడ్డి జిల్లాలో 10 కేంద్రాలు, కామారెడ్డి జిల్లాలో 43 కేంద్రాలు, మెదక్, వికారాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జోగుళాంబ గద్వాల, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్‌ జిల్లాల్లో కూడా కొనుగోళ్ల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

పొద్దు తిరుగుడు 25 % కొనుగోళ్ల పరిమితి తొలగింపు 
పొద్దుతిరుగుడు పంట విషయంలో కేంద్ర ప్రభుత్వం కేవలం 25 శాతం కొనుగోలు పరిమితి మాత్రమే అనుమతించిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ పరిమితికి మించి కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించిందని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రస్తుతం పొద్దుతిరుగుడు మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,721 ఉండగా, మార్కెట్‌ ధర రూ.5,376 మాత్రమే ఉండటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రానికి పంపిన ప్రతిపాదనలతోపాటు రాష్ట్ర పూల్‌ ద్వారా అదనంగా 10,175 మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement