పోర్టల్‌లో లేకుంటే బోనస్‌ పాయే! | Telangana govt has announced bonuses for only seven types of Rice | Sakshi
Sakshi News home page

పోర్టల్‌లో లేకుంటే బోనస్‌ పాయే!

Jul 5 2026 5:40 AM | Updated on Jul 5 2026 5:40 AM

Telangana govt has announced bonuses for only seven types of Rice

ఏడు రకాల సన్నాలకే బోనస్‌ ప్రకటించిన సర్కార్‌ 

విత్తనాల విక్రయ సమయంలో ‘సీడ్స్‌ సేల్స్‌’ పోర్టల్‌లో నమోదు తప్పనిసరి 

ఇప్పటికే విత్తన కొనుగోళ్లు పూర్తి  

ఎక్కడా నమోదు కాని వివరాలు.. చేతులెత్తేస్తున్న డీలర్లు 

నమోదైన రైతులకే రూ.500 బోనస్‌..

సాక్షి, హైదరాబాద్‌: రైతులు పండించిన సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్‌ ఇచ్చే విషయంలో సర్కార్‌ ఆంక్షల పరంపర కొనసాగుతోంది. 2024–25 ఖరీఫ్‌లో ఈ పథకాన్ని ప్రారంభించిన తరువాత రెండు ఖరీఫ్‌ సీజన్‌లలో బోనస్‌ ఇచ్చిన ప్రభుత్వం రెండు రబీలలో ఇవ్వలేదు. తాజాగా ప్రభుత్వం నిర్దేశించిన ఏడు రకాల సన్నాలు పండించిన రైతులకు మాత్రమే బోనస్‌గా క్వింటాలుకు రూ. 500 చొప్పున చెల్లిస్తామని వ్యవసాయ, పౌరసరఫరా శాఖల మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌ రావు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్వయంగా ప్రకటించారు. తాజాగా మరో నిబంధన ఏంటంటే వరి విత్తనాలు కొనుగోలు చేసినప్పుడే ఏ రకం విత్తనాలను రైతు కొనుగోలు చేశాడో ఆ రైతు వివరాలతో పాటు విత్తనాల వివరాలను కూడా ‘సీడ్స్‌ సేల్స్‌ పోర్టల్‌’లో విత్తనాలు అమ్మిన డీలర్‌ నమోదు చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో రైతు సన్నాలు పండించినప్పటికీ, కొనుగోలు చేసేటప్పుడు బోనస్‌ పొందేందుకు అనర్హుడు అయ్యే ప్రమాదం ఉంది. దీంతో సన్నాలు సాగు చేసిన ప్రతి రైతుకు బోనస్‌ లభిస్తుందనే కచ్చితమైన పరిస్థితి లేకుండా పోయింది. 

డీలర్‌ నమోదు చేయకపోతే..? 
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం కారణంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి బావులు, బోర్ల కింద ఉన్న పొలాలనే రైతులు సాగుచేశారు. చెరువులు, కాలువలు, ప్రాజెక్టుల కింద పొలాలలో దుక్కులు కూడా దున్నలేదు. పత్తి వేసిన రైతులే వరణుడి రాక కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంది. మరో రెండు రోజుల్లో ‘ఆరుద్ర కార్తె’వెళ్లిపోతుంది. ఆరుద్ర కార్తె దాటితే నార్లు పోయడం దాదాపుగా నిలిచిపోతుంది. కాగా ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో మెజారిటీ రైతులు విత్తనాలు కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికే ఏడు రకాల సన్నాల గురించి చెప్పడంతో రైతులు తమ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా జైశ్రీరాం, కేఎన్‌ఎం 1638, ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 రకాలనే ఎక్కువగా కొనుగోలు చేశారు. 

అయితే తాజాగా డీలర్లు రైతులు కొనుగోలు చేసిన విత్తనాల వివరాలను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు చెపుతుండడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో డీలర్లు, కొనుగోలు చేసిన రైతులు ఉన్నారు. సీడ్‌ సేల్స్‌ పోర్టల్‌ https:// seedsgrowerp.com/ seedsales/ login.phpలో రైతుల వివరాలను నమోదు చేయాలని అధికారులు డీలర్లకు చెపుతున్నారు. రైతు పేరు, ఆధార్, మొబైల్‌ నంబర్, సాగు చేయనున్న పంట, విత్తన కంపెనీ, లాట్‌ నంబర్, జిల్లా వివరాలతో పాటు ఏ సన్న వరి రకాన్ని కొనుగోలు చేశారో కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను డీలర్‌ తనకు ఇచ్చిన లాగిన్‌తో పోర్టల్‌లో నమోదు చేసి సేవ్‌ చేయాలి. తదనుగుణంగా రైతులు ధాన్యం విక్రయించే సమయంలో ఈ వివరాలను సరిచూసుకొని , సంబంధిత రైతులకే బోనస్‌ కింద రూ. 500 చొప్పున చెల్లించే అవకాశం ఉంటుంది.  

కొన్ని రకాల విత్తనాలకే డిమాండ్‌  
ప్రస్తుతం ప్రభుత్వం ఆర్‌ఎన్‌ఆర్‌–15048, బీపీటీ–5204, కేఎన్‌ఎం–1638, హెచ్‌ఎంటీ సోనా, జైశ్రీరామ్, డబ్ల్యూజీఎల్‌–44, కేఎన్‌ఎం–7715 రకాల సన్న విత్తనాలనే సాగు చేయాలని, ఈ విత్తనాలకే బోనస్‌ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కొన్ని కంపెనీలు ఆయా వంగడాలను 10, 20 కిలోల బ్యాగుల్లో విక్రయిస్తున్నాయి. కేఎంఎం 1638 రకం విత్తనాల 20 కిలోల బస్తాకు రూ.1050 ఉంటే, జై శ్రీరాం విత్తనాల 10 కిలోల బ్యాగు ధర రూ. 1100 పైగా పలుకుతోంది. మిగతా విత్తనాల రకాలను రైతులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని కరీంనగర్‌కి చెందిన ఓ డీలర్‌ తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 (తెలంగాణ సోనా), బీపీటీ 5204 కొనుగోలు చేస్తున్నట్లు డీలర్లు తెలిపారు. అయితే విత్తనాల కొనుగోళ్లు చాలా వరకు తగ్గాయని విక్రయదారులు చెపుతున్నారు.  

ఇప్పటికే విత్తనాలు విక్రయించాం – డీలర్, పెద్దపల్లి 
రైతులు విత్తనాల కోసం వచ్చినప్పుడు ఫోన్‌ కూడా తీసుకురారు. ఆధార్‌ నెంబర్, ఫోన్‌ నెంబర్‌ వంటి వివరాలను మేమెలా సీడ్స్‌ సేల్‌ పోర్టల్‌లో నమోదు చేస్తాం. మా దగ్గర కంప్యూటర్లు లేవు. చాలా మందికి చదువులు కూడా రావు. మమ్ములను రైతులకు అమ్మిన విత్తనాల వివరాలు ఫీడ్‌ చేయమంటే ఎలా? వ్యవసాయ శాఖ అధికారులు చేయాల్సిన పనులను మాకు చెపితే మేం ఎట్లా చేస్తాం. అయినా విత్తనాలన్నీ ఇప్పటికే అమ్మేసినం. అమ్మినప్పుడు రైతుకు బిల్లు ఇస్తం. అది తప్ప మేం ఏమీ ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేయలేం.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement