ప్రైవేట్‌ ఆసుపత్రులపై కొరడా 

Telangana govt focus on private hospitals Show Cause Notices - Sakshi

311 ఆస్పత్రిలో తనిఖీలు.. 21 ఆసుపత్రులు సీజ్‌ 

83 ఆసుపత్రులకు షోకాజ్‌ నోటీసులు జారీ  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ ఆసుపత్రులపై ఉక్కుపాదం మోపుతోంది. జిల్లాల్లో ఎక్కడికక్కడ అనేక ఆసుపత్రులను సీజ్‌ చేస్తోంది. కొన్నింటికి షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్న ఆసుపత్రులపై కొరడా ఝుళిపిస్తోంది. తెలంగాణ క్లినికల్‌ ఎస్టాబ్లిష్మెమెంట్‌ యాక్ట్‌ (రిజిస్ట్రేషన్‌ – రెగ్యులేషన్‌) యాక్ట్, 2010 ప్రకారం ప్రైవేట్‌ ఆసుపత్రులపై పెద్దఎత్తున తనిఖీలు జరుగుతున్నాయి.

ఇప్పటివరకు జరిగిన తనిఖీల్లో కొన్ని ఆసుపత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు. కొన్నిచోట్ల రిజిస్టర్డ్‌ డాక్టర్లు లేరని తెలిసింది. ఈ నేపథ్యంలో తమను కాపాడాలంటూ ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రుల చుట్టూ ఆసుపత్రుల యజమానులు తిరుగుతున్నారు. ఈ ఒక్కసారికి ఆసుపత్రులు సీజ్‌చేయకుండా చూడాలంటూ వేడుకుంటున్నారు. వైద్యబృందాలు ఇప్పటివరకు 311 ఆసుపత్రులను తనిఖీ చేసి, 21 ఆసుపత్రులను సీజ్‌ చేశాయి.

83 ఆసుపత్రులకు షోకాజ్‌ నోటీసులు జారీచేశాయి. ఏడు ఆసుపత్రులకు భారీ జరిమానాలు విధించాయి. జయశంకర్‌ భూపాలపల్లి, గద్వాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నాగర్‌కర్నూలు, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్, సిద్దిపేట, వనపర్తి, హనుమకొండ, యాదాద్రి జిల్లాల్లో ఇంకా తనిఖీలు మొదలుకాలేదు. కొమురంభీం జిల్లాలో నాలుగింటిని, మంచిర్యాలలో 14 ఆసుపత్రులను, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 17, నిజామాబాద్‌ లో 7 ఆసుపత్రులను, వరంగల్‌ జిల్లాలో మూడింటిని తనిఖీ చేసి, ఒక్క దానిపై కూడా చర్య తీసుకోలేదని వైద్య ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది.

అనేకచోట్ల రోగులకు సరిగా వైద్యం అందించడంలేదని తెలిసింది. అనేకచోట్ల ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోని డాక్టర్లను బెదిరించడానికే వైద్యబృందాలు దాడులు చేస్తున్నాయని పలువురు డాక్టర్లు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనధికారిక క్లినిక్‌లు నడుపుతూ, ప్రి్రస్కిప్షన్‌ లేకుండా ఇంజెక్షన్లు ఇస్తున్న రిజిస్టర్‌ కాని ప్రైవేట్‌ ప్రాక్టీషనర్లపై మాత్రం ఎలాంటి దాడులు జరగడంలేదని మండిపడుతున్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top