ఆ రెండు పద్దులు.. రూ.62 వేల కోట్లు | Sakshi
Sakshi News home page

ఆ రెండు పద్దులు.. రూ.62 వేల కోట్లు

Published Tue, Feb 7 2023 3:57 AM

Telangana Government Shown Revenue Under Share Of Central Taxes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన రీతిలో కేంద్ర ప్రభుత్వం తగినన్ని గ్రాంట్లు ఇవ్వడం లేదని గత మూడు బడ్జెట్‌ల గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. పన్నుల్లో వాటా కింద ప్రతిపాదించిన నిధులు కూడా కేంద్రం ఇవ్వడం లేదని రాష్ట్రం ఆరోపిస్తోంది... కానీ, కేంద్రంపై ఆధారపడి ఉన్న రెండు పద్దుల కింద మాత్రం తాజా బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను చూపెట్టింది.

వచ్చే ఏడాదికైనా కేంద్రం వైఖరిలో మార్పు రాకపోతుందా అనే ఆశతో పెట్టిన గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్, కేంద్ర పన్నుల్లో వాటా కింద మొత్తం రూ. 62,730.01 కోట్ల మేర రాబడులను ఈసారి బడ్జెట్‌లో చూపెట్టడం గమనార్హం. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సోమవారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.41,259.17 కోట్లు చూపెట్టగా, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.21,470.84 కోట్లు చూపారు.

అయితే, గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్దు కింద గత ఏడాది (2021–22) వచ్చింది కేవలం రూ.8,619 కోట్లు మాత్రమే. 2022–23 బడ్జెట్‌లో ఈ పద్దు కింద రూ. 41,001.73 కోట్లు వస్తుందని ప్రతిపాదించినా డిసెంబర్‌ నాటికి వచ్చింది రూ.7,770.92 కోట్లే. మిగిలిన మూడు నెలల్లో ఎంత వస్తుందనే అంచనా మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్దు కింద ఏకంగా రూ.30,250 కోట్లు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ మేరకు 2022–23 సవరించిన అంచనాల్లో పేర్కొంది. అయితే, వచ్చే ఏడాది (2023–24)కి గాను తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 30వేల కోట్లకు మరో రూ.11వేల కోట్లు అదనంగా ‘గ్రాంట్స్‌’రూపంలో రూ.41,259.17 కోట్లు వస్తాయని అంచనా వేయడం గమనార్హం. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి గ్రాంట్స్‌ పద్దు కింద రాష్ట్రం ఆశిస్తున్న మొత్తానికి, కేంద్రం ఇస్తున్న నిధులకు చాలా వ్యత్యాసం ఉంది. కరోనా కష్టకాలంలో 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల్లో మినహా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించిన మేరకు కాదు కదా అందులో సగం కూడా ఎప్పుడూ కేంద్రం ఇవ్వలేదు.

పన్నుల్లో వాటా... పరవాలేదా?
ఇక, కేంద్ర పన్నుల్లో వాటా విషయంలో ప్రతిపాదనలు, మంజూరు గణాంకాలు కొంత ఆశాజనకంగానే ఉన్నా కేటాయించిన మేరకు రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ఇవ్వడం లేదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. కేంద్ర పన్నుల్లో వాటా కింద 2021–22లో రూ.18,720.54 కోట్లు కేంద్రం నుంచి రాగా, 2022–23 సవరించిన అంచనాల మేరకు రూ.19.668.15 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇక, తాజా బడ్జెట్‌లో ఈ పద్దును రూ.21,470.84 కోట్లుగా చూపెట్టడం గమనార్హం. మొత్తం మీద కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయంగా విభేదాలున్నప్పటికీ కేంద్రంపై నమ్మకంతో తాజా బడ్జెట్‌లో ఈ రెండు పద్దుల కింద రూ.62 వేల కోట్ల (దాదాపు 20 శాతం) రాబడులు చూపారు. ఇదే విషయమై ఆర్థిక శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కేంద్ర పన్నుల్లో వాటా కింద రావాల్సిన నిధులను అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్రం తెలంగాణకు కూడా కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్దు కింద కొన్నేళ్లుగా తక్కువగానే వస్తున్నా కేంద్రంపై ఆశలు పెట్టుకునే ప్రతిపాదనలు చేశామని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement