52.8 శాతానికి చేరిన ఆర్టీసీ ఉద్యోగుల కరువు భత్యం | Telangana Government Announces 2. 1 Percentage DA Increase For RTC Employees | Sakshi
Sakshi News home page

52.8 శాతానికి చేరిన ఆర్టీసీ ఉద్యోగుల కరువు భత్యం

Apr 11 2026 4:48 AM | Updated on Apr 11 2026 4:48 AM

Telangana Government Announces 2. 1 Percentage DA Increase For RTC Employees

ఈ ఏడాది తొలి విడత బకాయి 2.1 శాతం ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగుల కరువు భత్యం 52.8 శాతానికి చేరుకుంది. ఇప్పటివరకు 50.7 శాతం ఉండగా, శుక్రవారం మరో 2.1 శాతం డీఏను ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాదికి సంబంధించి జనవరిలో ప్రకటించాల్సిన తొలివిడత డీఏ పెండింగ్‌లో ఉండటంతో, దాన్ని చెల్లించాల్సిందిగా ఉద్యోగులు కొంతకాలంగా ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. కానీ, ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకోకుండా దాటవేస్తూ వచ్చింది. శుక్రవారం ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడీలు, ఇతర ఉన్నతాధికారులతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ భేటీ అయి దీనిపై చర్చించారు.

అనంతరం 2.1 శాతం కరువు భత్యాన్ని ప్రకటించారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌ కరువు భత్యం మొత్తం చెల్లించినట్టయింది. గతంలో ఆరేడు విడతల డీఏ పేరుకుపోగా, గత ప్రభుత్వం చివరలో కొన్ని విడతలు, ప్రస్తుతం ప్రభుత్వం మరికొన్ని విడతల డీఏను ప్రకటిస్తూ వచ్చాయి. మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న తాజా విడత డీఏ కూడా ఇప్పుడు ఉద్యోగుల జీతంలో కలిసిపోనుంది. ఈ పెంపు వల్ల సంస్థపై ప్రతినెలా రూ.2.82 కోట్ల మేర ఆర్థిక భారం పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. 

ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి ఆమేరకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి చాలా పెండింగ్‌ అంశాలను పరిష్కరిస్తూ వస్తున్నామని చెప్పారు. మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న డీఏ ప్రకటించటం పట్ల ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఈడీలు వెంకన్న, ఖుస్రో షా ఖాన్, రాజశేఖర్, సాల్మన్, ఎఫ్‌ఏ విజయపుష్ప, సీటీఎం– సి శ్రీధర్, సీపీఎం ఉషాదేవి, సీసీఈ కవిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement