తెలంగాణ జన్యువుతో ఆవు, గేదె జాతుల అభివృద్ధి దిశలో ముందడుగు
దేశీయ పశు జాతి ఉత్పత్తి చేయాలని పశుగణాభివృద్ధి బోర్డు కీలక నిర్ణయం
త్వరలో రాష్ట్ర బ్రీడింగ్ పాలసీకి తుదిరూపు
స్థానిక వాతావరణంతో ఇబ్బంది లేని దేశీ పశువుల ఉత్పత్తి లక్ష్యంగా పాలసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బ్రాండ్‌తో దేశీయ ఆవులు, గేదె జాతుల అభివృద్ధి దిశలో ముందడుగు పడింది. ఇప్పటివరకు పొడ తూర్పు అనే పశుజాతి మాత్రమే మన రాష్ట్రం నుంచి రికార్డుల్లోకి ఎక్కగా, తెలంగాణ జన్యువుతో ఇతర రకాలను సంకరం చేయడం ద్వారా మేలైన స్థానిక పశుజాతిని అభివృద్ధి చేసేందుకు పశుసంవర్థక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇటీవల జరిగిన తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ (టీజీఎల్‌డీఏ) బోర్డు డైరెక్టర్ల సమావేశంలో తీర్మానించారు. దేశీయ పశు జాతి ఉత్పత్తిని ప్రోత్సహించాలని, ఇందుకోసం త్వరలోనే తెలంగాణ బ్రీడింగ్ పాలసీని రూపొందించాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.
తద్వారా పశువైద్య విద్యాలయం సహకారంతో త్వరలోనే తెలంగాణ స్వజాతి గేదెలు, ఆవుల ఉత్పత్తికి బీజం పడుతుందని పశుసంవర్థక శాఖ వర్గాలు చెపుతున్నాయి. త్వరలోనే రూపొందించనున్న బ్రీడింగ్ పాలసీని కూడా అనేక అంశాలను దృష్టిలో ఉంచుకుని తుదిరూపు ఇస్తామని, ముఖ్యంగా స్థానిక వాతావరణ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోగలగడం, ఎల్‌నినో లాంటి సంక్షోభాలను తట్టుకునే శక్తి ఉండేలా జన్యువులు ఎంపిక చేస్తామని ఆ శాఖ అధికారులు చెపుతున్నారు.
ప్రస్తుతం మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న దేశీ అవులు, గేదెల్లో పాల దిగుబడి సామర్థ్యం చాలా తక్కువగా ఉందని, అందుకోసమే కర్ణాటక లాంటి రాష్ట్రాల నుంచి పశు జాతులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని, ఇక వీర్యం కోసం తమిళనాడుపై ఆధారపడాల్సి వస్తోందని అంటున్నారు.
మక్తల్‌లో కృత్రిమ గర్భధారణ శిక్షణ కేంద్రం!
దేశీ పశుజాతిని వీలున్నంత త్వరగా అభివృద్ధి చేయాలని తీర్మానించిన పశుగణాభివృద్ధి సంస్థ బోర్డు సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. రాష్ట్రంలోని పశువులకు కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా రూ.4 కోట్లకు పైగా వ్యయంతో మక్తల్‌లో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, గోమాత దినోత్సవాన్ని ప్రతియేటా ప్రభుత్వం నిర్వహించాలని, గోరక్షణ కమిషన్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
అన్ని ప్రభుత్వ శాఖల తరహాలోనే పశుసంవర్ధక శాఖకు కూడా ప్రత్యేక ఇంజనీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని, తమ శాఖకు అవసరమయ్యే సరుకులను తామే కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక కొనుగోలు సంస్థ ఏర్పాటుకు అనుమతివ్వాలని, తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ పేరును తెలంగాణ పశుగణాభివృద్ధి కార్పొరేషన్‌గా మార్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాలు ఆమోదించారు.
రోజుకు 26 లక్షల లీటర్లు తెచ్చుకుంటున్నాం
మన రాష్ట్రంలో పాలు, చికెన్, గుడ్లు, మటన్‌ల వ్యాపారం ఏటా రూ.80 వేల కోట్ల వరకు జరుగుతుందనే అంచనాలున్నాయి. ఇందులో మటన్, పాలను మనం ప్రతి రోజూ దిగుమతి చేసుకుంటున్నాం. చికెన్, గుడ్లు ఎగుమతి చేస్తున్నాం. రోజుకు 26 లక్షల లీటర్ల పాలను గుజరాత్, మహారాష్ట్ర, ఏపీ, ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది. మన జాతి గేదెలు, ఆవుల్లో పాల దిగుబడి సామర్థ్యం తక్కువగా ఉండడమే ఇందుకు కారణం.
మహిళలను కోటీశ్వరులను చేయాలనే సీఎం రేవంత్‌రెడ్డి కల నెరవేరాలంటే ప్రతి రెండు మండలాలకో పాల డెయిరీని ఏర్పాటు చేసి మహిళా సంఘాలను భాగస్వాములు చేయాలి. ఇలా చేయాలంటే కచ్చితంగా మన జాతి ఆవులు, గేదెలు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి రావాలి. అందుకే ప్రత్యేక బ్రీడింగ్ పాలసీ రూపొందిస్తున్నాం.
– డాక్టర్ సింగం చరణ్ కౌశిక్, తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్


