Devadula: భూములు తిరిగి ఇవ్వకుంటే మూకుమ్మడి ఆత్మహత్యలు  | Sakshi
Sakshi News home page

దేవాదుల మూడో విడత: భూములు తిరిగి ఇవ్వకుంటే మూకుమ్మడి ఆత్మహత్యలు 

Published Fri, Dec 23 2022 2:03 AM

Telangana: Farmers Protest With Pesticide Cans Over Lands - Sakshi

శాయంపేట: సొరంగం పనుల కోసం రైతుల నుంచి భూములను లీజుకు తీసుకుని, పనులైన వెంటనే తిరిగి ఇస్తామని చెప్పి.. తీరా ఇప్పుడు మినీ క్రషర్‌ ఏర్పాటు చేస్తున్నారని, వెంటనే భూములను మాకు అప్పగించాలంటూ రైతులు పురుగు మందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. భూములు అప్పగించకపోతే 18 కుటుంబాల రైతులందరమూ మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.

 హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మైలారం గ్రామ శివారులో దేవాదుల మూడో విడత సొరంగం పనుల కోసం 18మంది రైతులనుంచి 27.30 ఎకరాల భూమిని కోస్టల్‌ మెగా కంపెనీ లీజుకు తీసుకుంది. ఆ స్థలంలో ఆడిట్‌ పాయింట్‌ ఏర్పాటు చేసి పనులు పూర్తి చేసింది. సొరంగం పనుల్లో వచ్చిన పెద్దపెద్ద బండరాళ్లు, మెటీరియల్స్‌ను ఆ ప్రాంతంలోనే నిల్వ చేశారు.

పనులు పూర్తయినప్పటికీ తిరిగి రైతులకు భూములు అప్పగించలేదు. ఇటీవల కాలంలో రైతులు తమ భూములు అప్పగించాలని అడుగుతూ వస్తున్నారు. అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 18.27 ఎకరాల పట్టా భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతోపాటు 5 ఎకరాల అసైన్డ్‌ భూమిని కూడా స్వాధీనం చేసుకుంది. ఆ స్థలంలో నిల్వ చేసిన బండరాళ్లను, మెటీరియల్‌ను తొలగించడానికి హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌కు పనులను అప్పగించింది.

దీంతో కాంట్రాక్టర్‌ ఆ ప్రాంతంలో మినీ క్రషర్‌ ఏర్పాటుచేయడానికి బుధవారం రాత్రికి రాత్రే మెటీరియల్‌ దింపాడు. విషయం తెలుసుకున్న రైతులు గురువారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించి తిరిగి వెళ్తున్న ఇరిగేషన్‌ అధికారుల వాహనాన్ని రెండు గంటలపాటు అడ్డుకున్నారు. సమస్య పరిష్కరించేంత వరకు వెళ్లనివ్వమని పురుగు మందు డబ్బాలు పట్టుకుని ఆందోళన చేపట్టారు.

తమ స్థలంలో ఎలాంటి పనులూ చేపట్టవద్దని, కాదని చేపడితే 18 కుటుంబాల రైతులం ఆత్మహత్య చేసుకుంటా మని హెచ్చరించారు. దీంతో ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని, వారి ఆదేశాలను పాటిస్తామని డీఈ రవీందర్‌ తెలిపారు. రైతుల ఆందోళన మేరకు పదిరోజుల పాటు ఆడిట్‌ స్థలంలో ఎలాంటి పనులూ చేపట్టమని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement