ప్రైవేట్‌ స్కూళ్లపై ప్రత్యేక నజర్‌

Telangana Education Department Special Focus On Private Schools - Sakshi

నిర్వహణపై కఠిన నిబంధనలు 

డొనేషన్లు, ఫీజులు, సమస్యలపై ఆరా 

సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూళ్లపై సైతం.. 

అనుమతి రెన్యువల్‌ వేళ హామీ పత్రాలు 

చర్యలకు ఉపక్రమించిన విద్యాశాఖ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు పాఠశాలల ఇష్టారాజ్యానికి ముకుతాడు వేయాలని విద్యాశాఖ భావిస్తోంది. డీఏవీ స్కూల్‌ ఉదంతం నేపథ్యంలో అన్ని ప్రైవేటు పాఠశాలలపై దృష్టి సారించాలని నిర్ణయించింది. పాఠశాలల్లో డొనేషన్లు, ఫీజులు కనీస వసతులతో పాటు నిర్వహణ తీరుతెన్నులపై కూడా ఆరా తీసేందుకు సిద్ధమైంది. సీసీ కెమెరాల నిఘా నడుమ పాఠశాల నిర్వహణ కొనసాగే విధంగా చర్యలు చేపట్టనుంది.

ఇప్పటికే ప్రైవేటు పాఠశాలపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. మండలం యూనిట్‌గా ఆయా పాఠశాల వ్యవహారంపై సమగ్ర నివేదిక తెప్పించుకొని దాని ఆధారంగా రానున్న విద్యా సంవత్సరంలో పాఠశాల అనుమతి  పునరుద్ధరించే సమయంలో చర్యలకు ఉపక్రమించాలని భావిస్తోంది. పాఠశాలకు అనుమతి రెన్యువల్‌ చేయడమో.. లేక  తిరస్కరించడమో చేయనుంది. నిబంధనలు తూచ తప్పకుండా పాటించే విధంగా షరతులను అనుమతికి కొర్రీగా పెట్టనుంది.  నిబంధనలు అమలు చేసే అవకాశం లేకపోలేదని విద్యాశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. 

ఇతర స్కూళ్లపై కూడా..  
►స్టేట్‌ సిలబస్‌తో పాటు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూల్స్‌పై కూడా పర్యవేక్షణ కొనసాగే విధంగా చర్యలు చేపట్టనుంది. స్టేట్‌ సిలబస్‌ పాఠశాలపై పర్యవేక్షణ పూర్తిగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులది ఉండగా, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ గుర్తింపునకు మాత్రం నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) మాత్రమే జారీ చేస్తోంది.  

►ఈ పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎన్‌ఓసీ సైతం ఉపసంహరించే విధంగా నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. కేవలం ఫీజులపై దృష్టి ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు దండుకునే విషయంలో చూపే శ్రద్ధ.. మౌలిక వసతులను కల్పించడంలో లేకపోవడం సర్వసాధారణంగా తయారైంది.  

►ప్రైవేటు  యాజమాన్యాలు విద్యకు మినహా ఆటలకు, భద్రతకు ఏమాత్రం ప్రాధాన్యం  ఇవ్వడం లేదనే ఆరోపణలు  మెండుగా ఉన్నాయి. 

అపార్టుమెంట్లు, ఇరుకు గదుల్లో తరగతులను నిర్వహిస్తూ విద్యార్థుల భద్రతను గాలిలో దీపంలా ఉంచుతున్నారు. ఏదైనా సమస్య రానంత వరకూ బాగానే ఉంటుంది. ఏదైనా జరగరాని  ప్రమాదం జరిగితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విద్యావేత్తలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

నిబంధనలు గాలికి.. 
►ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల ఏర్పాటుకు ముందు అగ్నిమాపక శాఖ నుంచి ఫైర్‌ సర్టిఫికెట్‌ పొందాలి. సంబంధితశాఖ అధికారులు భవనం అనుకూలతను పరిశీలించి అనువుగా ఉంటేనే ధ్రువీకరించాలి.  

►కొన్ని నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా ఒత్తిళ్లు, పలుకుబడితో  అనుమతులు లభించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.  రెన్యువల్‌ సమయంలో కూడా కేవలం పేపర్ల ఆధారంగానే సర్టిఫై చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీని వెనుక భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఇక విద్యాశాఖ అధికారులది కూడా అదే పరిస్థితి అని పలువురు పెదవి విరుస్తున్నారు. పాఠశాలలను పరిశీలించకుండానే అనుమతుల జారీ అనుమానాలకు తావిస్తోది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top