
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలోని కొంద రు అధికారుల నిర్వాకంతో రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. కరోనా పరీక్షలు చేసే టెస్టింగ్ కిట్లకు కొరత ఏర్పడటంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఇప్పటికే అనేకచోట్ల కొద్దిమందికే పరీక్షలు చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లోనైతే ఈ రోజుకు ఇంతేనని చెప్పి పంపుతున్నారు. కొరత నేపథ్యంలో వైద్యాధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కిట్ల నిల్వ అయిపోయే వరకు నిద్రపోయారా అంటూ ఓ అధికారి వ్యాఖ్యానించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు చేపట్టే విషయంపై సర్కారు సమాలోచనలు చేస్తోంది.
అత్యవసరంగా లక్షన్నర కిట్లు
రెగ్యులర్‌గా అవసరానికి తగినట్లుగా సరఫరా చేయాల్సిన కంపెనీ చేతులెత్తేసింది. మహారాష్ట్ర సహా దేశంలో కరోనా విజృంభణ పెరగడంతో కంపెనీ ఆయా ప్రాంతాలకు కిట్లను తరలిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ఒకేసారి అధికంగా కిట్లను సరఫరా చేయలేమంది. ఢిల్లీలో లాక్‌డౌన్ విధించడంతో అక్కడ ఉత్పత్తి, సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడటంతో ఆ ప్రభావం రాష్ట్రంలో కిట్ల కొరతకు దారితీసిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బుధవారం వరకు వైద్య ఆరోగ్యశాఖ వద్ద కేవలం లక్షలోపు ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు, లక్షన్నర లోపు ఆర్‌టీపీసీఆర్ కిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గురువారం నుంచి కరోనా పరీక్షలు సజావుగా జరిగే పరిస్థితి ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే పరిస్థితిని గమనించిన ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమై లక్షన్నర కిట్లను కొనుగోలు చేశారు. ఈ కిట్లు బుధవారం రాత్రికి హైదరాబాద్ చేరుకుంటాయనీ, గురువారం అన్ని పరీక్ష కేంద్రాలకు కిట్లను పంపిస్తామని అధికారులు తెలిపారు. అయితే రెండ్రోజులు ఎలాగోలా నెట్టుకొస్తారు తర్వాత ఏంటి పరిస్థితి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
మూడు నెలలకు సరిపోయేలా...
కరోనా పరీక్షలకు ఆటంకం ఏర్పడే ప్రమాదం నెలకొనడంతో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు బుధవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. పరీక్షలు యథావిధిగా కొనసాగించేందుకు తక్షణం కొనుగోళ్లు చేయాలని నిర్ణయించారు. అలాగే మూడు నెలలకు సరిపోయేలా ఒకేసారి కిట్లను కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు 90 లక్షల కిట్లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం తాజాగా పరిపాలనా అనుమతి ఇచ్చింది. దీంతో నూతన టెండర్‌కు వెళ్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి.