6 నెలల ముందే అభ్యర్థులు | Sakshi
Sakshi News home page

6 నెలల ముందే అభ్యర్థులు

Published Fri, Jun 3 2022 4:28 AM

Telangana Congress Party Medho Madhanam Program Ended - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ రెండు రోజుల పాటు జరిపిన మేధోమథనం ముగిసింది. బుధ, గురువారాల్లో మేడ్చల్‌ జిల్లా కీసరలోని బాల వికాస్‌ ప్రాంగణంలో నవ సంకల్ప్‌ శిబిర్‌ (చింతన్‌ శిబిర్‌) పేరిట సమావేశమైన రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా ఆరు కమిటీలను ఏర్పాటు చేసుకుని అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.

ఎన్నికలకు మూడు నెలల ముందే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయాలని, తద్వారా పార్టీ ఆలోచనలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. అదే విధంగా ఎప్పట్నుంచో ప్రతిపాదిస్తున్నట్టుగానే ఆరు నెలల ముందే అభ్యర్థుల ప్రకటనకు కూడా చింతన్‌ శిబిర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాని వారికి పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. సోనియాగాంధీ కరోనా నుంచి కోలుకోవాలని కూడా తీర్మానించారు. 

మొదటిరోజు చర్చపై తీర్మానాలు 
మొదటి రోజు బుధవారం జరిగిన చర్చలపై గురువారం రెండోరోజు కమిటీలు తీర్మానాలు చేశాయి. ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (రాజకీయ), పొన్నాల లక్ష్మయ్య (సంస్థాగత వ్యవహారాలు), డి. శ్రీధర్‌బాబు (ఆర్థిక), టి. జీవన్‌రెడ్డి (వ్యవసాయం), హనుమంతరావు (సామాజిక న్యాయం), దామోదర రాజనర్సింహ (యువత)ల నేతృత్వంలో కమిటీ లు మరోమారు సమావేశమై బుధవారం జరిగిన చర్చలపై తీర్మానాలను చేశాయి.

అనంతరం ఆరుగురు కన్వీనర్లతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శు లు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, నవ సంకల్ప్‌ శిబిర్‌ చైర్మన్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కన్వీనర్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలు సమావేశమై ఈ తీర్మానాలకు ఆమోదం తెలిపారు. కాగా మేధోమథనంలో ఆరు కమిటీలు తీసుకున్న నిర్ణయాలను భట్టి, ఉత్తమ్, జీవన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కమిటీల వారీగా నిర్ణయాలివే.. 

రాజకీయ కమిటీ: ఎన్నికలకు మూడు నెలల ముందే మేనిఫెస్టో, ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలి; యువత మీద ప్రధానంగా దృష్టి పెట్టి పనిచేయాలి. గిరిజన రిజర్వేషన్ల పెంపు కోసం బలంగా పోరాడాలి; పార్టీలో యువతను క్రియాశీలం చేయడమే లక్ష్యంగా పోలింగ్‌ బూత్‌ స్థాయిలో ప్రతి 100 మందికి ఒక ఇన్‌చార్జిని నియమించాలి; వరంగల్‌ తరహాలోనే మహిళల సమస్యలే ప్రధాన ఎజెండాగా మరో భారీ బహిరంగ సభ నిర్వహించాలి; అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ హస్తం తరహాలో నిత్యావసర వస్తువులు ప్రజలకు ఉచితంగా అందజేయాలి.  

సంస్థాగత కమిటీ: ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రూట్‌మ్యాప్‌ తయారు చేయాలి. జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి, వారికి శిక్షణనివ్వాలి; పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. డిసెంబర్‌ 28న గ్రామ స్థాయి నుంచి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలి.

ఆర్థిక కమిటీ: ప్రభుత్వ భూముల అమ్మకాన్ని నిరోధించాలి; మద్యం బెల్ట్‌ షాపులు ఆపాలని ఉద్యమించాలి; విద్య, ఆరోగ్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి.  

వ్యవసాయ కమిటీ: రూ.3 లక్షల వరకు వడ్డీలేని రుణాలు... పంటలకు మద్దతు ధరకు తోడు క్వింటాల్‌కు రూ.1,000 బోనస్‌ ఇవ్వాలి; వ్యవసాయ బడ్జెట్‌ను పెంచాలి; ఉపాధి హామీ పనులు 250 రోజులకు పెంపు. రైతులు, రైతు కూలీలకు పింఛన్‌ పథకం.  

సామాజిక న్యాయ కమిటీ: అసైన్డ్‌ భూములను అమ్మకుండా పోరాటం చేయాలి. బీసీలకు క్రిమీలేయర్‌ ఎత్తివేయాలి.  

యువజన కమిటీ: యువత పార్టీ వైపు మళ్లేలా భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలి. ఉద్యోగావకాశాలు విస్తృతంగా కల్పించాలి. ఎప్పటికప్పుడు జాబ్‌ కేలండర్‌లను ప్రకటించాలి; నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి. 

కీలక నేతలు లేకుండానే.. 
రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన ముఖ్యమైన నాయకులు లేకుండానే రెండురోజుల పాటు మేధోమథన శిబిరం నిర్వహించి, ఏఐసీసీ పెద్దల సమక్షంలో కీలక తీర్మానాలు చేయడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డితో పాటు ఆరు కమిటీల్లో సభ్యులుగా నియమించిన వారిలో కొందరు ఈ సమావేశాలకు హాజరు కాలేదు. అయితే ముందుగానే నిర్ణయించిన కార్యక్రమం కావడంతో కొందరు కీలక నేతలు లేకపోయినా నిర్వహించామే తప్ప ఇందులో వివాదమేమీ లేదని కాంగ్రెస్‌ పెద్దలు చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement