మమత భేటీకి టీఆర్‌ఎస్‌ దూరం!

Telangana CM KCR Likely To Skip Mamata Banerjee Meet On Presidential Poll Strategy - Sakshi

రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో నేడు ఢిల్లీలో విపక్షాల సమావేశం 

దీనిపై ప్రగతిభవన్‌లో సుదీర్ఘంగా చర్చించిన సీఎం కేసీఆర్‌ 

ఢిల్లీ భేటీకి హాజరైతే ఎదురయ్యే పరిణామాలపై మంతనాలు 

తాను హాజరు కాకూడదని, ప్రతినిధి బృందాన్ని కూడా పంపకూడదని నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో నిర్వహిస్తున్న సమావేశానికి దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు దేశవ్యాప్తంగా 19 పార్టీలకు, విపక్ష పార్టీల సీఎంలకు మమత ఆహ్వానం పలికారు.

ఇదే క్రమంలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు కూడా ఆహ్వానం పంపారు. ఢిల్లీలోని కానిస్టిట్యూషన్‌ క్లబ్‌లో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరగనుంది. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన సన్నాహాల్లో తలమునకలై ఉన్న కేసీఆర్‌ ఈ భేటీకి దూరంగా ఉండటంతో పాటు పార్టీ తరఫున ప్రతినిధి బృందాన్ని కూడా పంపకూడదని నిర్ణయించారు.

జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో సత్సంబంధాలు కోరుకుంటున్నా, మమత భేటీకి హాజరవడం ద్వారా ఎదురయ్యే పరిణామాలను దృష్డిలో పెట్టుకుని కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్‌ కె.కేశవరావు నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ బృందాన్ని పంపాలని తొలుత భావించినా సుదీర్ఘ మంతనాల తర్వాత మొత్తానికే దూరంగా ఉండాలని కేసీఆర్‌ నిర్ణయించారు.

ఢిల్లీ భేటీ నేపథ్యంలో ప్రగతిభవన్‌లో సీఎం మంగళవారం అర్ధరాత్రి వరకు సుదీర్ఘ భేటీ నిర్వహించారు. కరీంనగర్‌ పర్యటనలో ఉన్న   వినోద్‌ కుమార్‌ సీఎం పిలుపు మేరకు మధ్యాహ్నం ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. మమత భేటీలో పాల్గొనడం ద్వారా ఎదురయ్యే అనుకూల, ప్రతికూల రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.

రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ వైఖరిపై చర్చ 
జాతీయ రాజకీయాల్లో నెలకొన్న రాజకీయ శూన్యతను ప్రస్తావిస్తూ గెలుపోటములతో సంబంధం లేకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ సుదీర్ఘంగా వివరించినట్లు తెలిసింది. ఈ భేటీకి కాంగ్రెస్‌ను కూడా మమత ఆహ్వానించడం, అదే భేటీకి టీఆర్‌ఎస్‌ హాజరైతే రాష్ట్రంలో ఎదురయ్యే రాజకీయ పరిణామాలు, విమర్శలపైనా చర్చ జరిగినట్లు తెలిసింది.  

కాంగ్రెస్‌ బలహీనత, విపక్షాల అనైక్యత వల్లే బీజేపీకి ఎదురులేకుండా పోయిందని వ్యాఖ్యానిస్తున్న కేసీఆర్‌.. అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పై విమర్శలకు తావు ఇవ్వరాదనే అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి బుధవారం జరిగే సమావేశం ప్రాథమిక భేటీ మాత్రమే అయినందున జాతీయ స్థాయిలో వివిధ విపక్ష పార్టీల మనోగతం తెలుసుకునేందుకు ఈ సమావేశం దోహదం చేస్తుందని కేసీఆర్‌ భావిస్తున్నారు. 

ఇటీవలి కాలంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అధినేతలతో వరుస భేటీలు జరిపిన కేసీఆర్, మరోవైపు జాతీయ పార్డీ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో తనదైన శైలిలో పాత్ర పోషిస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top