Telangana CM KCR Attends Rajbhan New CJ Ujjal Bhuyan Swearing Ceremony - Sakshi
Sakshi News home page

హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం

Jun 28 2022 10:03 AM | Updated on Jun 29 2022 1:52 AM

Telangana Cm KCR Attends Rajbhan New CJ Ujjal Bhuyan Swearing Ceremony - Sakshi

చాన్నాళ్ల తర్వాత సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌లో అడుగుపెట్టారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారం ఉదయం 10.15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు కార్యక్రమానికి హాజరై నూతన సీజేకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇప్పటివరకు సీజేగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే. తదుపరి సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ పేరును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం మే 17న సిఫారసు చేయగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇటీవల ఆమోదించారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని ప్రకటిస్తూ గత వారం కేంద్ర న్యాయశాఖ గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేసింది. అసోంకు చెందిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ 2011 అక్టోబర్‌ 17న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తి అయ్యారు. 2021 అక్టోబర్‌ 22న తెలంగాణ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 8 నెలల తర్వాత తెలంగాణ హైకోర్టు ఐదో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. 


గవర్నర్, సీఎం..చిరునవ్వులు, ముచ్చట్లు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాదాపు 8 నెలల విరామం తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లడం రాజకీయంగా ప్రాధా న్యత సంతరించు కుంది. గవర్నర్‌తో విభేదాల నేపథ్యంలో సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్‌ వెళ్తారా..? లేదా అన్న అంశం చర్చనీ యాంశమైన సంగతి తెలిసిందే. ఆ చర్చకు తెరదించుతూ సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్‌ తమిళిసైని ఆప్యాయంగా పలకరించి పూలబొకే అందజేశారు.

ఈ సందర్భంగా గవర్నర్, సీఎంలు పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు క్లుప్తంగా సంభాషించారు. ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుకుంటున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజ్‌భవన్‌లో గవర్నర్, ముఖ్యమంత్రి సుహృద్భావ వాతావరణంలో మాట్లాడుకున్నారని రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. చివరిసారిగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు తమిళిసైతో సీఎం భేటీ కాలేదు.

గవర్నర్‌ తన అధికార పరిధిని అతిక్రమించి పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, రాజ్‌భవన్‌ను బీజేపీ కార్యకలా పాలకు అడ్డాగా మార్చారని రాష్ట్ర మంత్రులు గతంలో బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఇందుకు ప్రతిగా.. రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని, మహిళ అని చిన్నచూపు చూస్తోందని గవర్నర్‌ తమిళిసై విమర్శించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి పేరును సిఫారసు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్‌ తమిళిసై ఆమోదిం చకుండా పక్కన పెట్టడం, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ప్రసంగాన్ని ప్రభుత్వం రద్దు చేయడం, గవర్నర్‌ జిల్లా పర్యటనల సమయంలో కలెక్టర్లు, ఎస్పీలు హాజరుకాకపోవడం, గవర్నర్‌ ప్రజాదర్బార్‌ నిర్వహించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement