ఒక తీర్పు.. పలువురిలో కలవరం | Sakshi
Sakshi News home page

ఒక తీర్పు.. పలువురిలో కలవరం

Published Wed, Jan 11 2023 2:39 AM

Telangana Civil Service Officers Confusion With CAT Orders - Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ విషయంలో హైకోర్టు వెలువరించిన తీర్పు పలువురు అఖిల భారత సర్వీసు అధికారుల్లో కలవరం పుట్టిస్తోంది. తమ పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ కేడర్‌లో కొనసాగడానికి రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌లోని సివిల్‌ సర్వీసెస్‌ అధికారులను ఆప్షన్లు అడిగిన తరువాత.. వారి సీనియారిటీ, స్థానికత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ (డీవోపీటీ) వారిని రెండు రాష్ట్రాలకు విభజించి కేటాయింపు జరిపింది.

అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు పలు కారణాలు చూపిస్తూ.. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ (సీఏటీ)ను ఆశ్రయించి ఏపీకి వెళ్లకుండా తెలంగాణ రాష్ట్రంలోనే ఉండడానికి అనుమతులు తెచ్చుకున్నారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ కూడా వీరిలో ఉన్నారు. అయితే డీవోపీటీ 2017లోనే క్యాట్‌ ఉత్తర్వులను సవాల్‌ చేసింది. ఏ రాష్ట్రానికి కేటాయించిన అధికారులు ఆయా రాష్ట్రాల్లోనే పనిచేయాలని పేర్కొంటూ పిటిషన్‌ దాఖలు చేసింది.

దీనిపై దాదాపు ఐదు సంవత్సరాల అనంతరం మంగళవారం తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భుయాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం..సోమేశ్‌కుమార్‌ ఏపీకి వెళ్లాల్సిందేనంటూ తీర్పు ఇవ్వడం.. పలువురు అధికారులను కలవరపరుస్తోంది. తామంతా ఏపీకి వెళ్లాల్సిందేనా? అన్న చర్చ సదరు ఐఏస్, ఐపీఎస్‌ అధికారుల్లో కొనసాగుతోంది. ఏపీకి కేటాయించిన పలువురు సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు తెలంగాణలో పనిచేస్తుండగా.. తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు కేటాయించిన కొందరు ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగుతున్నారు. 

అక్కడివారు ఇక్కడ.. ఇక్కడివారు అక్కడ
కేంద్ర ప్రభుత్వం కేటాయించిన కేడర్‌లలో కాకుండా క్యాట్‌ ఉత్తర్వులతో రెండు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వారిలో 9 మంది ఐఏఎస్‌లు, ఆరుగురు ఐపీఎస్‌ అధికారులు ఉన్నారు. ఐపీఎస్‌లకు సంబంధించి ఇటీవలే తెలంగాణ ఇన్‌చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీకుమార్, అడిషనల్‌ డీజీపీ అభిలాష బిస్త్, అభిలాష్‌ మహంతిలు ఆంధ్ర కేడర్‌కు చెందిన అధికారులు కాగా.. తెలంగాణలో పనిచేస్తున్నారు.

మొన్నటివరకు ఏపీ కేడర్‌కు చెందిన సంతోష్‌ మెహ్రా తెలంగాణలో పనిచేసినా, ఈ మధ్యనే ఆయన ఏపీ కేడర్‌కు వెళ్లిపోయారు. కాగా తెలంగాణకు కేడర్‌కు కేటాయించిన మనీష్‌కుమార్‌ సింగ్, అమిత్‌గార్గ్, అతుల్‌ సింగ్‌లు ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నారు. ఇక ఈ విధంగా ఐఏఎస్‌ అధికారుల్లో సోమేశ్‌కుమార్, వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్‌ రోస్, ఎం.ప్రశాంతి, కాటా ఆమ్రపాలి తెలంగాణ కేడర్‌లో పనిచేస్తుండగా  కాగా  తెలంగాణ కేడర్‌కు కేటాయించిన హరికిరణ్, శ్రీజన, శివశంకర్‌లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నారు. 

ఇన్‌చార్జి డీజీపీగా అందుకేనా?
తెలంగాణ డీజీపీగా అంజనీ కుమార్‌ను రెగ్యులర్‌ డీజీపీగా కాకుండా ఇన్‌చార్జి డీజీపీగా నియమించడానికి ప్రధాన కారణం హైకోర్టులో సోమేశ్‌కుమార్‌పై కొనసాగుతున్న కేసు నేపథ్యమేనన్న ప్రచారం ఉంది. తాజా తీర్పుతో ఇప్పుడు అంజనీకుమార్‌ పరిస్థితేంటన్నది పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇలా ఉండగా సీనియర్‌ ఐఏఎస్‌ల్లో వాకాటి కరుణ ప్రస్తుతం విద్యా శాఖ కార్యదర్శిగా, వాణీప్రసాద్‌ పర్యావరణ పరిరక్షణ, పరిశోధన, శిక్షణా సంస్థలో డైరెక్టర్‌గా, రొనాల్డ్‌రోస్‌ ఆర్థికశాఖ కార్యదర్శిగా, ఎం.ప్రశాంతి అటవీ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కాటా ఆమ్రపాలి కేంద్ర సర్వీస్‌ల్లోకి వెళ్లి ప్రస్తుతం పీఎంఓలో ఉన్నారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement