సీఎంఆర్‌ అక్రమాలపై సీఐడీ కొరడా | Telangana CID Takes Action Against Irregularities in Rice Supply Operations | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ అక్రమాలపై సీఐడీ కొరడా

Oct 26 2026 6:06 AM | Updated on Oct 26 2026 6:06 AM

Telangana CID Takes Action Against Irregularities in Rice Supply Operations

14 మంది మిల్లర్ల అరెస్ట్‌.. మూడు క్రిమినల్‌ కేసులు నమోదు

నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల్లోని 16 మిల్లులపై ఏకకాలంలో దాడులు

సన్నధాన్యం బదులు 3,385 టన్నుల దొడ్డు బియ్యం సరఫరా చేసినట్లు గుర్తింపు

రూ.1.69 కోట్ల బోనస్‌ నష్టం జరిగినట్లు తేల్చిన అధికారులు

తప్పిన మరో రూ. 242 కోట్ల బోనస్‌ నష్టం

సాక్షి, హైదరాబాద్‌/ములుగు/జమ్మికుంట/కరీంనగర్‌ క్రైం: సన్న ధాన్యం మిల్లింగ్, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు బియ్యం సరఫరా వ్యవహారంలో అక్రమాలపై తెలంగాణ సీఐడీ కొరడా ఝళిపించింది. సన్న ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌కు మళ్లించి దాని స్థానంలో తక్కువ ధరకు లభించే దొడ్డు బియ్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసిన వ్యవహారంలో మూడు క్రిమినల్‌ కేసులు నమోదు చేసి 14 మంది మిల్లర్లను అరెస్టు చేసింది. ఆదివారం ఏకకాలంలో నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల్లో జరిపిన సోదాల్లో అక్రమాలను గుర్తించినట్లు సీఐడీ డీజీ చారుసిన్హా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో పేర్కొన్న ప్రకారం.. ఖరీఫ్‌ 2025–26 సీజన్‌లో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) సరఫరాలో అక్రమాలపై సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ జనరల్‌ మేనేజర్‌ (సేకరణ) ఈ నెల 24న సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ విచారణ ప్రారంభించింది.

సన్న ధాన్యం పక్కదారి.. దొడ్డు బియ్యం సరఫరా?
ఖరీఫ్‌ 2025–26లో రాష్ట్ర ప్రభుత్వం 71.86 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఈ సీజన్‌కు సంబంధించి ఎఫ్‌సీఐకి 59.60 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. అయితే కొందరు మిల్లర్లు తమకు కేటాయించిన సన్న ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌లో విక్రయించి దాని స్థానంలో తక్కువ ధర ఉన్న దొడ్డు బియ్యాన్ని సరఫరా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇతర రాష్ట్రాల నుంచి సేకరించిన బియ్యాన్ని కూడా ఇలా వినియోగించినట్లు సమాచారం ఉందని సీఐడీ వెల్లడించింది. ఈ అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అండ్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఈటీఎఫ్‌) బృందాలు తనిఖీలు చేపట్టి బియ్యం నమూనాలను ప్రయోగశాలల్లో పరీక్షించగా కేటాయించిన సన్న రకం ప్రమాణాలకు అనుగుణంగా బియ్యం లేనట్లు తేలింది. 

నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల్లోని 16 రైస్‌ మిల్లులు సన్న బియ్యం కేటాయింపులకు బదులుగా 3,385.820 మెట్రిక్‌ టన్నుల దొడ్డు బియ్యాన్ని సరఫరా చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంలో బోనస్‌ చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వానికి సుమారు రూ. 1.69 కోట్ల నష్టం వాటిల్లినట్లు తేల్చారు. ఇదే సమయంలో మరో 45,414.833 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసేందుకు కేటాయింపులు జరగ్గా వాటికి బోనస్‌ చెల్లింపుల ద్వారా రూ. 242 కోట్ల మేర మిల్లర్లకు చెల్లించాల్సి ఉంది. అయితే అధికారులు సకాలంలో తదుపరి ప్రక్రియను నిలిపివేయడంతో ప్రభుత్వ ఖజానాకు అంతమేర నష్టాన్ని నివారించినట్లు అయింది. కాగా, ఈ వ్యవహారంలో అధికారుల ప్రమేయం సహా ఇతర అంశాలపై సీఐడీ ఆధారాలు సేకరిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement