చిలకలగూడ చౌరస్తా, కాచిగూడలోని ఆర్టీసీ పాత క్వార్టర్స్
పరస్పర భూ మార్పిడికి అవగాహన
కాచిగూడ డిపో, అక్కడి ఆర్టీసీ క్వార్టర్స్ స్థలాలు రైల్వేకు
వాటిల్లో కొత్త ప్లాట్‌ఫామ్స్, సరుకు రవాణా వ్యవస్థ విస్తరణ
ప్రతిగా చిలకలగూడలో ఆర్టీసీకి రైల్వే భూమి
అందులో భారీ బస్ టెర్మినల్, ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ నిర్మాణం
రేతిఫైల్ బస్ స్టేషన్ కూడా మార్పు
సాక్షి, హైదరాబాద్: నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల నేపథ్యంలో, ఇటు రైల్వే..అటు ఆర్టీసీ భారీ మార్పులు చేస్తున్నాయి. ఇది దశాబ్దాలుగా ప్రజలతో మమేకమైన అంశాల్లో మార్పులకు కారణం కాబోతున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్ అనగానే... రద్దీగా ఉండే ప్రాంగణం, దాని పరిసరాలు గుర్తుకొస్తాయి. రైలు దిగిన ప్రయాణికుల కోసం స్టేషన్ ముందే బస్ బే ప్రాంగణం, కాస్త ముందుకు ప్రశాంత్ థియేటర్ వైపు వెళ్తే గురుద్వారా ముందు మరో బస్ బే ప్రాంగణం, బోయిగూడ వైపు చిలకలగూడ చౌరస్తాలో పెద్ద బస్టాపు, బస్సుల కోసం వచ్చే వందల మంది ప్రయాణికులు... వెరసి అంతా గందరగోళంగా ఉంటుంది.
కానీ, దశాబ్దాలుగా ఈ గజిబిజి వ్యవహారమే నగర వాసులతో మమేకమై ఉంది. ఇప్పుడు దీన్ని సమూలంగా మార్చబోతున్నారు. ఆర్టీసీ–రైల్వే మధ్య ఈమేరకు అవగాహన కుదరబోతోంది. దీనివల్ల రెండు విభాగాలు తమ భూములను పరస్పరం మార్పిడి చేసుకోవటం ద్వారా అటు రైలు, ఇటు బస్సు ప్రయాణికులకు కొత్త వసతులు కల్పించబోతున్నాయి. దీనివల్ల ఈ గజిబిజి వ్యవహారం కూడా మారబోతోంది.
ప్రస్తుతం నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లయిన సికింద్రాబాద్, నాంపల్లి (హైదరాబాద్) స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సికింద్రాబాద్ స్టేషన్ మరో ఆరేడు నెలల్లో ప్రారంభం కాబోతోంది. నాంపల్లి స్టేషన్ పనులు ఉధృతంగా జరుగుతున్నాయి. మూడో ప్రధాన రైల్వే స్టేషన్ అయిన కాచిగూడ భవనం వారసత్వ కట్టడం జాబితాలో ఉన్నందున దాన్ని కూల్చేందుకు వీలుండదు. దీంతో అక్కడ ప్రయాణికుల వసతులు మెరుగుపరిచే చర్యలు చేపట్టనున్నారు. కొత్త ప్లాట్‌ఫామ్స్‌తోపాటు సరుకు రవాణాకు సంబంధించిన వ్యవస్థను విస్తరించబోతున్నారు.
కానీ విస్తరణకు కావాల్సిన స్థలం అందుబాటులో లేనందున, పక్కనే ఉన్న ఆర్టీసీ డిపో, ఆర్టీసీ పాత క్వార్టర్ల స్థలాలను సేకరించాలని నిర్ణయించింది. ఆమేరకు ఆర్టీసీకి ప్రతిపాదించింది. దీనికి సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ, అందుకు ప్రతిగా చిలకలగూడ కూడలిలో ఆర్టీసీకి రైల్వే భూములు కేటాయించాలని కోరింది. దీనికి రైల్వే కూడా సానుకూలంగా స్పందించింది. చిలకలగూడ చౌరస్తా నుంచి మెట్టుగూడ వైపు వెళ్లే మార్గంలో ఉన్న ఐలాండ్ అంతా రైల్వే స్థలం దాన్ని ఆర్టీసీకి కేటాయించనున్నారు. ఇక్కడ ఆర్టీసీ భారీ టెర్మినల్, భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో సమకూరే ఎలక్ట్రిక్ బస్సుల కోసం చార్జింగ్ స్టేషన్‌ను నిర్మించాలని నిర్ణయించింది.
సికింద్రాబాద్ స్టేషన్ విస్తరణలో భాగంగా దాని ముందున్న ఆర్టీసీ బస్‌బేలను తొలగించాల్సిన పరిస్థితి ఎదురైంది. మరోవైపు గురుద్వారా ముందున్న బస్ బే స్థలంలో మెట్రో రైల్ సంస్థ వాణిజ్య సముదాయాన్ని నిర్మించబోతోంది. దీంతో ఈ రెండు బస్ బేలను తొలగిస్తే ఆర్టీసీ బస్సులకు స్థలం కరువవుతుంది. ఇక రేతిఫైల్ బస్ స్టేషన్ వద్ద స్కైవాక్ పిల్లర్లు నిర్మిస్తారు. దీంతో దానికి కూడా అవాంతరం ఎదురవుతుంది. ఈమూడు సమస్యలకు పరిష్కారంగా చిలకలగూడ బస్ టెర్మినల్ రూపొందనుంది. అక్కడ ఇప్పటికే బస్సుల కోసం రోడ్డుమీదే జనం నిలబడుతుండటంతో ఆ ప్రాంతం అంతా గందరగోళంగా ఉంటుంది. కొత్త టెర్మినల్ దానిని కూడా పరిష్కరించనుంది.
రైల్వే ఏం చేస్తుందంటే..
కాచిగూడ ఆర్టీసీ బస్ డిపో 4 ఎకరాల్లో ఉంది. దానికి మరోవైపు ఆర్టీసీ క్వార్టర్లు ఐదెకరాల్లో ఉన్నాయి. ఈ 9 ఎకరాలను రైల్వే తీసుకుని ప్లాట్‌ఫామ్స్, సరుకు రవాణా వ్యవస్థను విస్తరిస్తుంది. ప్రతిగా, అక్కడి అండర్‌పాస్ సమీపంలోని 4 ఎకరాల రైల్వే స్థలాన్ని ఆర్టీసీకి కేటాయించి దాన్ని కాచిగూడ డిపోగా మారుస్తుంది. ప్రస్తుత డిపో భవనాన్ని రైల్వే తీసుకుంటున్నందున, ఆర్టీసీకి కొత్త డిపో భవన నిర్మాణ ఖర్చును రైల్వే భరిస్తుంది. ఇక మిగిలిన ఐదెకరాలను చిలకలగూడ లో ఆర్టీసీకి కేటాయిస్తుంది.


