సభకు ఏడు బిల్లులు.. ఈటెలపై చర్యలకు అధికార పక్షం పట్టు?

Telangana Assembly Monsoon Session Resume From Today - Sakshi

‘కేంద్ర విద్యుత్‌ బిల్లు’పై స్వల్పకాలిక చర్చ

స్పీకర్‌పై ఈటల వ్యాఖ్యలు ప్రస్తావనకొచ్చే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 6న సమావేశమై వాయిదా పడిన తెలంగాణ శాసనసభ, శాసన మండలి వానాకాలం సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆరో తేదీన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నెల 12, 13 తేదీల్లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. సోమవారం ఏడు బిల్లులు, పలు పత్రాలు సభ ముందుకు రానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభమైన వెంటనే 6న జరిగిన బీఏసీ సమావేశం నివేదికను సీఎం కేసీఆర్‌ సభకు సమర్పిస్తారు. అనంతరం తెలంగాణ సదరన్‌ డిస్కమ్, ట్రాన్స్‌కో, టీఎస్‌ రెడ్కో వార్షిక నివేదికలు, తెలంగాణ సమగ్ర శిక్షా 2020–21 ఆడిట్‌ రిపోర్ట్, స్టేట్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ రెగ్యులేషన్స్‌ పత్రాలను సంబంధిత శాఖల మంత్రులు సభకు సమర్పిస్తారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు మృతిపై స్పీకర్‌ స్థానం నుంచి సంతాప ప్రకటన ఉంటుంది. 

జీఎస్‌టీ సవరణ బిల్లుతో పాటు..
తెలంగాణ జీఎస్‌టీ సవరణ బిల్లు 2022, ఆజామాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా బిల్లు 2022, తెలంగాణ మున్సిపల్‌ చట్టాలు 2022 సవరణ బిల్లు సభ ముందుకు వస్తాయి. వీటితో పాటు తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ సవరణ బిల్లు, తెలంగాణ ఫారెస్ట్‌ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లు, తెలంగాణ మోటారు వాహనాల టాక్సేషన్‌ సవరణ బిల్లులను సంబంధిత శాఖల మంత్రులు సమర్పిస్తారు. శాసనసభ, మండలిలో ‘కేంద్ర విద్యుత్‌ బిల్లు.. పర్యవసానాలు అంశం’పై స్వల్ప కాలిక చర్చ జరుగుతుంది.

ఈటలపై చర్యలకు అధికార పక్షం పట్టు?
బీఏసీ సమావేశానికి బీజేపీ సభ్యులను ఆహ్వానించక పోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్‌పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్‌ సభ్యులు ప్రస్తావించే అవకాశం ఉంది. సభ్యుల ప్రవర్తనా నియమావళికి ఈటల వ్యాఖ్యలు విరుద్ధంగా ఉన్నాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటలపై చర్యలు తీసుకోవాలంటూ టీఆర్‌ఎస్‌ సభ్యులు పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: Krishnam Raju: రారాజు ఇకలేరు

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top