
సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబుతో పారిశ్రామికవేత్తలు
ఇన్వెస్టోపియా గ్లోబల్ పెట్టుబడుల సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో యూఏఈ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు ‘ఇన్వెస్టోపియా గ్లోబల్’ను గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ‘భౌగోళికంగా చిన్నదైనా, ఆశయాలు, ఆచరణలో మాత్రం తెలంగాణ ఉన్నతంగా ఆలోచిస్తుంది.
తక్కువ వ్యవధిలోనే వేగంగా అభివృద్ధి సాధించి దేశంలోని ఇతర రాష్ట్రాలకు అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన 18 నెలల్లో తెలంగాణ కొత్తగా రూ.3.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి యూఏఈకి ఎగుమతుల్లో 2.5 రెట్లు వృద్ది సాధించాం. ఎగుమతుల్లో ఫార్మా, ఏరోస్పేస్, డిజిటల్ సేవలు, ఫుడ్ ప్రాసెసింగ్ కీలకపాత్ర పోషించాయి. ఇప్పటికే యూఏఈకి చెందిన లులు గ్రూప్, డీపీ వరల్డ్, నాఫ్కో వంటి కంపెనీలు రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చాయి’అని మంత్రి వెల్లడించారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని యూఏఈ పారిశ్రామికవేత్తలను మంత్రి ఆహ్వనించారు. సదస్సు ప్రారంభ కార్యక్రమంలో యూఏఈ ఆర్థిక, పర్యాటకశాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తాక్ అల్ మర్రి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సంజయ్‌కుమార్, టీజీఐఐసీ ఎండీ కె.శశాంక, అండర్ సెక్రటరీ ఆఫ్ ది యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ మహ్మద్ అల్వాహీ, యూఏఐ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ వాలిద్ హరేబ్ అల్ ఫలాహి, ఇన్వెస్టోపియా సీఈవో డా.జీన్ ఫారెస్ తదితరులు పాల్గొన్నారు.