ఏడున్నర లక్షల కేసుల పరిష్కారం 

Telangana: 7. 5 Lakh Cases Settled In National Lok Adalat - Sakshi

లోక్‌ అదాలత్‌కు మంచి స్పందన    

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పిలుపుతో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ నిర్వహించిన లోక్‌ అదాలత్‌కు స్పందన లభించింది. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా ఏడున్నర లక్షల కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో 8,175 ప్రిలిటిగేషన్‌ కేసులు కాగా, మిగతావి వివిధ రకాలైన పెండింగ్‌ కోర్టు కేసులు. ఈ కేసుల కింద రూ.109.45 కోట్ల పరిహారం లబ్ధిదారులకు చెల్లించేలా ఆదేశాలిచ్చినట్లు న్యాయ సేవాధికార సంస్థ మెంబర్‌ సెక్రెటరీ, జిల్లా, సెషన్స్‌ జడ్జి ఎస్‌.గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. మూడేళ్లలోపు శిక్ష పడే కేసులు, రాజీకి అవకాశమున్న చిన్న కేసులనే లోక్‌ అదాలత్‌లో పరిష్కరిస్తున్నట్లు చెప్పారు.  

మెట్రోపాలిటన్‌ కోర్టుల్లో 3.55 లక్షల కేసులు: మెట్రోపాలిటన్‌ కోర్టుల పరిధిలోనే 24 బెంచ్‌లు ఏర్పాటుచేసి, 3,55,727 కేసులు పరిష్కరించినట్లు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి, మెట్రోపాలిటన్‌ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ పాపిరెడ్డి, సీనియర్‌ సివిల్‌ జడ్జి, సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్‌ తెలిపారు. రూ.2,43,88,400 పరిహారం చెల్లించాలని ఆదేశాలిచ్చామన్నారు.  

హైకోర్టులో 629 కేసులు రాజీ: హైకోర్టు లోక్‌అదాలత్‌లో హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్, జస్టిస్‌ పి.నవీన్‌రావు ఆదేశాల మేరకు ప్రత్యక్ష, పరోక్ష విధానాల్లో ఆసక్తి చూపిన కక్షిదారుల కేసుల్ని రాజీ చేశారు. న్యాయ మూర్తులు జస్టిస్‌ జి.శ్రీదేవి, జస్టిస్‌ సాంబశివనాయుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జి.యతిరాజులు అధ్యక్షతన వేర్వేరుగా 629 కేసుల్ని పరిష్కరించారు. 1150 మంది లబ్ధిదారులకు రూ.36.60 కోట్ల పరిహారం చెల్లింపులకు ఆదేశించినట్లు కమిటీ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top