అవార్డులు గౌరవాన్ని పెంచాలి

Tagulla Gopal Was Awarded The Rangineni Literary Award - Sakshi

తెలుగు వర్సిటీ వీసీ తంగెడ కిషన్‌రావు 

దండ కడియానికి రంగినేని సాహిత్య పురస్కారం ప్రదానం 

సిరిసిల్ల కల్చరల్‌: జ్ఞాన సముపార్జనకు వయసుతో నిమిత్తంలేదని, జీవితకాలంపాటు అధ్యయనం చేయొచ్చని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య తంగెడ కిషన్‌రావు అన్నారు. రంగినేని సుజాతమోహన్‌రావు తన మాతృమూర్తి ఎల్లమ్మ స్మారకార్థం ఇచ్చే జాతీయస్థాయి సాహిత్య పురస్కార ప్రదానోత్సవం ఆదివారం ఇక్కడ ప్రముఖకవి జూకంటి జగన్నాథం అధ్యక్షతన జరిగింది.

కిషన్‌రావు మాట్లాడుతూ కవిగా వచ్చిన గుర్తింపు, అందిన పురస్కారాలు గౌరవాన్ని పెంచాలని, గర్వాన్ని దరి చేరనీయొద్దని సూచించారు. ప్రాంతానికో మాండలీకం ఉన్నప్పటికీ మౌలికంగా సంవేదనలోంచి వచ్చిన కవిత్వమే సమాజంలో నిలిచిపోతుందన్నారు. అనంతరం కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత తగుళ్ల గోపాల్‌కు రంగినేని సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు.

ప్రశంసాపత్రం, రూ.25 వేల నగదును అందజేశారు. కార్యక్రమంలో కవులు డాక్టర్‌ నలిమెల భాస్కర్, డాక్టర్‌ పత్తిపాక మోహన్, అన్నవరం దేవేందర్, పెద్దింటి అశోక్, డాక్టర్‌ బెల్లి యాదయ్య, ఎలగొండ రవి, జిందం అశోక్, మానేరు రచయితల సంఘం, సాహితీ సోపతి, సిరిసిల్ల సాహితీ సమితి ప్రతినిధులతోపాటు సిద్దిపేట, కరీంనగర్‌కు చెందిన పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. 

మానేటి బిడ్డనే.. మేనమామ ఇంట్లో పుట్టా.. 
ఇదే జిల్లాలోని గూడెం గ్రామం మా అమ్మమ్మ వాళ్లది. మేనమామ ఇంట్లోనే పుట్టాను. నా మూడేళ్ల వయçసులో అనుకుంటా. ఎడ్లబండి మీద సిరిసిల్లలోని రాజేశ్వర్‌ థియేటర్‌లో సినిమా చూసేందుకు వచ్చాను. తోటివాళ్లంతా సినిమా చూస్తుంటే నేను మాత్రం ఉశికెతో ఆడుకున్నట్లు గుర్తుంది. అలా మానేరు నా మదిలో ఉండిపోయింది. 
– తంగెడ కిషన్‌రావు, తెలుగు వర్సిటీ వీసీ 

మానేటి కవులే నాకు ప్రేరణ  
పశువుల కాపరిని సాహిత్యానికి పరిచయం చేసిన పాలమూరుకు, నన్ను కవిగా ఆవిష్కరించుకునేందుకు ప్రేరణ ఇచ్చిన మానేటి కవులకు కృతజ్ఞతలు. సత్కరించిన మానేటి సహృదయులకు పాలమూరు కన్నీటి బొట్లతో అభిషేకం చేస్తున్నా. మా అమ్మ పేరూ ఎల్లమ్మనే కాబట్టి ఈ పురస్కారాన్ని అందుకోవాలని కలలు కన్నా.      
– తగుళ్ల గోపాల్, రంగినేని ఎల్లమ్మ పురస్కార గ్రహీత 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top