Sukesh Chandrashekar mentions MLC Kavitha and Kejriwal in another letter - Sakshi
Sakshi News home page

మరో బాంబు పేల్చిన సుకేశ్‌ చంద్రశేఖర్‌.. కవిత, కేజ్రీవాల్‌కు షాక్‌

May 25 2023 7:49 AM | Updated on May 25 2023 9:45 AM

Sukesh Chandrasekhar Allegations Against MLC Kavitha And Kejriwal - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత షెల్‌ కంపెనీల నుంచి మారిషస్‌లోని గ్రీన్‌ హస్క్‌ ఇండస్ట్రీస్‌కు రూ.80 కోట్లు బదిలీ చేసినట్లు ఓ మనీలాండరింగ్‌ కేసులో నిందితుడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ ఆరోపించారు. ఢిల్లీ సీఎం కార్యాలయ నివాసం ఫర్నీచర్‌ నిమిత్తం ఈ సొమ్ము మూడు విడతలుగా బదిలీ చేశానని పేర్కొన్నారు. తనపై వస్తున్న కథనాలకు సంబంధించి కొన్ని వివరణలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆదేశాలతోనే జైలు అధికారులు తనని వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం సుకేశ్‌ తరఫు న్యాయవాది మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. కేజ్రీవాల్‌ ఎంత ప్రయత్నించినా తాను వెనక్కి తగ్గేది లేదని, ఫర్నీచర్‌కు సంబంధించి అన్ని బిల్లులు ఈడీ, సీబీఐలకు అందజేస్తానని స్పష్టంచేశారు. కేజ్రీవాల్‌ సూచన మేరకు కల్వకుంట్ల కవిత షెల్‌ కంపెనీ ఖాతా నుంచి మారిషస్‌లోని మంత్రి కైలాశ్‌ గెహ్లోత్‌ బంధువుల ఖాతాకు రూ.80 కోట్లు (రూ.25 కోట్లు+ రూ.25 కోట్లు + రూ.30 కోట్లు) బదిలీ చేసినట్లు చెప్పారు. ఆ సొమ్ము యూఎస్‌ డాలర్‌టెట్‌హెర్‌ (యూఎస్‌డీటీ), క్రిప్టో కరెన్సీల్లోకి మార్చి అబుదాబికి పంపినట్లు సుకేశ్‌ పేర్కొన్నారు. 

దీనికి సంబంధించి ఫేస్‌టైమ్‌లో జరిపిన చాట్‌ల స్క్రీన్‌ షాట్లు కూడా ఉన్నాయన్నారు. ఫోన్‌ ట్యాంపరింగ్‌ చేస్తున్నానంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తన తల్లికి తప్పించి మరో కాల్‌ చేశానని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని, అది తప్పయితే, కేజ్రీవాల్‌ బహిరంగ క్షమాపణలు చెబుతారా అని లేఖలో ప్రశ్నించారు. కేజ్రీవాల్‌ ఎలా అవినీతికి పాల్పడ్డారో, ఏ స్థాయికి దిగజారగలరో తెలుసుకోవడానికి మరో ఎపిసోడ్‌ కోసం సిద్ధంగా ఉండాలన్నారు. జైలు అధికారులందరూ కేజ్రీవాల్‌ రాకకోసం ఎదురుచూస్తున్నారని సుకేశ్‌ ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: ‘కమలం’ కార్యాచరణ మారాలి సారూ!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement