100 ఎంబీబీఎస్‌ సీట్ల మిగులు! | Sakshi
Sakshi News home page

100 ఎంబీబీఎస్‌ సీట్ల మిగులు!

Published Mon, Oct 23 2023 4:54 AM

Students are not interested in management seats in private medical colleges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీల్లో పెద్ద ఎత్తున ఎంబీబీఎస్‌ సీట్లు మిగిలిపోయినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 100 వరకు ఎంబీబీఎస్‌ సీట్లు మిగిలినట్లు అంటున్నాయి. రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 4,825 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా వాటిల్లో 15 శాతం అంటే 723 ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లున్నాయి. వాటికి మాప్‌ అప్‌ రౌండ్‌ నిర్వహించాక మిగిలిన 128 సీట్లను స్ట్రే వేకెన్సీ పద్ధతిలో నింపేందుకు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేసినా పెద్దగా స్పందన రాలేదని వర్సిటీ వర్గాలు అంటున్నాయి.

మరోవైపు బీ–కేటగిరీ సీట్లలోనూ కొన్ని సీట్లు మిగిలిపోయినట్లు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు 100 వరకు మిగిలినట్లు తెలుస్తోంది. త్వరలో అన్ని కాలేజీలు జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ)కు సమాచారం ఇచ్చిన తర్వాత మిగిలిపోయిన సీట్ల సంఖ్యపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.  

ఫిజికల్‌ కౌన్సెలింగ్‌ రద్దుతో మారిన పరిస్థితి
ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో సీట్ల బ్లాకింగ్‌కు చెక్‌ పెట్టేందుకు వీలుగా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ద్వారానే అన్ని సీట్లనూ భర్తీ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిజికల్‌ కౌన్సెలింగ్‌ చేపట్టవద్దని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది.పలుమార్లు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లు ని­ర్వ­హించాలని, అయినా సీట్లు మిగిలిపోతే వాటిని వదిలేయాలని పేర్కొంది. దీనివల్ల కూడా సీట్లు మిగిలిపోయినట్లు చెబుతున్నారు. సహజంగా ఏటా కొన్ని ఎంబీబీఎస్‌ సీట్లు మిగిలిపోతుంటాయి. ఎన్‌ఆర్‌ఐ సీట్లపై అభ్యర్థుల అనాసక్తి... 

రాష్ట్రంలో వైద్యవిద్య అవకాశాలు భారీగా పెరిగాయి. 2023–24 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 4,825 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. వాటిల్లో 15 శాతం అంటే 723 ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లున్నాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వినర్‌ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని సీట్లల్లో 15 శాతం అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు.

బీ–కేటగిరీ సీట్లలో 85 శాతం వరకు లోకల్‌కు   కేటాయిస్తుండటంతో రాష్ట్ర విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యాయి. ఇక ఎన్‌ఆర్‌ఐలో సీట్లు ఎక్కువగానే ఉన్నా ఫీజులు అధికంగా ఉన్నాయి. బీ–కేటగిరీ ఫీజుకు రెట్టింపు స్థాయిలో ఎన్‌ఆర్‌ఐ కోటా ఫీజులున్నాయి. అంటే ఏటా ఎన్‌ఆర్‌ఐ కోటా సీటు ఫీజు రూ. 23 లక్షలకుపైగా ఉంది. దీంతో 723 ఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్‌ సీట్లున్నా తక్కువమంది విద్యార్థులే ఆప్షన్లు పెట్టుకు­న్నారు.

చివరకు వెసులుబాట్లు కల్పించినా ఇంకా సీట్లు మిగిలిపోయాయి. మరోవైపు ఎక్కువ ఖర్చు చేసి ఇక్కడ ఎన్‌ఆర్‌ఐ కోటాలో ఎంబీబీఎస్‌ చేసే బదులు ఇతర రాష్ట్రాల్లో డీమ్డ్‌ వర్సిటీల్లో తక్కువ ఫీజుతో చదువుకోవచ్చన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఐ సీట్లు మిగలడంతో అనేక ప్రైవేటు మెడికల్‌ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.  

Advertisement
 
Advertisement
 
Advertisement