27న అఖిల పక్ష సమావేశం 

The State Government Will Hold An All Party Meeting In Telangana - Sakshi

‘సీఎం దళిత సాధికారత’పథకం విధి విధానాలపై చర్చ  

సాక్షి, హైదరాబాద్‌: సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష భేటీ నిర్వహించనుంది. రాష్ట్రంలోని దళితుల గుణాత్మక అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ’సీఎం దళిత సాధికారత’ పథకానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన కోసం ఈ నెల 27న ప్రగతి భవన్‌లో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఆదివారం ప్రారంభంకానున్న ఈ సమావేశం రోజంతా కొనసాగనుంది. అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. వారితో పాటు ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ పార్టీల శాసనసభా పక్షనేతలు కూడా పాల్గొంటారు.

వీరికి అధికారికంగా ఆహ్వానాలు పంపించనున్నారు. సీపీఐ, సీపీఎం పార్టీల నుంచి సీనియర్‌ దళిత నేతలను సమావేశానికి పంపించాల్సిందిగా ఇప్పటికే ఆయా పార్టీల రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభధ్రంకు సీఎం కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌ చేసి కోరారు. దళితుల సమస్యల పట్ల అవగాహన కలిగి, దళిత వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న రాష్ట్రంలోని ఇతర సీనియర్‌ దళిత నాయకులను ఆహ్వానించాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంవో అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొననున్నారు. 

దళితుల సంక్షేమానికి సర్కారు కృషి
‘నూతన తెలంగాణ రాష్ట్రంలో స్వయం పాలన ప్రారంభమైన అనతి కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం దార్శనికతతో అన్ని రంగాల్లో దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మారుమూలన ఉన్న దళితులు తమ జీవితాల్లో గుణాత్మక అభివృద్ధిని మరింతగా సాధించాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాలో, ఈ సమావేశం చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అందరం చర్చించి విధివిధానాలను ఖరారు చేయడానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం.’ అని కేసీఆర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  

ఆరేళ్ల విరామం తర్వాత రెండోసారి  
రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించడం ఇది రెండోసారి. తొలిసారిగా 2014 డిసెంబర్‌ 16న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ అలైన్మెంట్‌ మార్పు అంశంపై రాష్ట్ర సచివాలయంలో అఖిలపక్ష భేటీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించారు. అప్పట్నుంచి ఇప్పటివరకు మళ్ళీ అఖిలపక్ష సమావేశం నిర్వహించలేదు. 2017 జనవరి 27న ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఆయా వర్గాల సంక్షేమం, అభివృద్ధిపై చర్చించారు. కానీ ఇందులో కొన్ని పార్టీల నేతలు మాత్రమే పాల్గొన్నారు. ఇది అఖిలపక్ష భేటీ అని ప్రభుత్వం కూడా చెప్పుకోలేదు. అయితే అసైన్డ్‌ భూముల సమస్యలపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అన్ని పార్టీల సలహాలు, సూచనలు తీసుకుంటామని గత బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఇప్పుడు సుమారు ఆరేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తుండడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

చదవండి: ఈడీ విచారణకు హాజరుకాని ఎంపీ నామా 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top