
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ నమ్రత కస్టడీ విచారణ ముగిసింది. కస్టడీలో పలు అంశాలపై డాక్టర్ నమ్రతాను పోలీసులు విచారించారు. కస్టడీలో డాక్టర్ నమ్రతా అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆధారాలు ముందు ఉంచి నమ్రతాను విచారించిన పోలీసులు.. చైల్డ్ ట్రాఫికింగ్‌తో పాటు సరోగసి మోసాలపై ఆరా తీశారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో డాక్టర్ నమ్రతాకు సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
కళ్యాణితో కలిసి ఏజెంట్లు సహకారంతో చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్టు నిర్థారణ అయ్యింది. కస్టడీ విచారణలో భాగంగా ఏజెంట్ల నెట్‌వర్క్‌ను పోలీసులు గుర్తించారు. రేపటితో కళ్యాణి, ధనశ్రీ సంతోషి విచారణ ముగియనుంది. మరికాసేపట్లో గాంధీ ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షలు అనంతరం సికింద్రాబాద్ కోర్టులో డాక్టర్ నమ్రతను హాజరుపర్చనున్నారు.
కాగా, సరోగసీ పేరుతో శిశువుల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో గోపాలపురం పోలీసులు మరో డాక్టర్‌ను కూడా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత పనుల మీద హైదరాబాద్‌కు వచ్చిన డాక్టర్ విజ్జు లతను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమె అరెస్టుతో ఈ కేసులో ఇప్పటి వరకు కటకటాల్లోకి చేరిన వారి సంఖ్య 15కు చేరింది. మరోపక్క డాక్టర్ నమ్రత తమను మోసం చేసిందంటూ మరో ఐదుగురు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు.
సరోగసీ కోసం హైదరాబాద్‌లోని సృష్టి సెంటర్‌ను ఆశ్రయించిన వారిని నమ్రత విశాఖపట్నంలోని బ్రాంచ్‌కు పంపేది. అక్కడ కీలకంగా వ్యహరించిన డాక్టర్ విజ్జు లత వారికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం తదితరాలు చేసేది. నమ్రత విచారణలో ఈ విషయం గుర్తించిన దర్యాప్తు అధికారులు విజ్జు లత కోసం గాలించారు. అయితే నమ్రత గ్యాంగ్ అరెస్టు విషయం తెలియడంతోనే ఆమెతోపాటు అనేక మంది ఏజెంట్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నమ్రత చేతిలో మోసపోయిన మరో ఐదుగురు బాధితులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసుల్లోనే విజ్జు లతను అరెస్టు చేశారు. సరోగసీ పేరుతో ఒప్పందాలు చేసుకున్న నమ్రతకు రూ.11 లక్షలు, రూ.15 లక్షలు, రూ.13 లక్షలు చొప్పున ఆ ముగ్గురు, మరో జంట రూ. 20 లక్షలు చెల్లించినట్టు ఫిర్యాదు చేయగా, కేసులు నమోదు చేశారు. నమ్రతతో పాటు ఇతర నిందితులను ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్‌పై అరెస్టు చేయడంతో పాటు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు. రాజస్తాన్ మహిళ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నమ్రత పోలీసు కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఆపై ఇతర కేసుల్లో అరెస్టు, కస్టడీ ప్రక్రియలు చేపట్టనున్నారు.
నమ్రత ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహణ లైసెన్స్‌ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ 2021లో పొడిగించలేదు. దీంతో తాను ఆ వృత్తి నిర్వహించట్లేదంటూ నమ్రత లేఖ కూడా ఇచ్చారు. సికింద్రాబాద్‌లోని గోపాలపురంలో నాలుగు అంతస్తుల భవనంతోపాటు మరో మూడు చోట్లా అక్రమంగా యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహిస్తున్నారు. అయితే తన పేరుతో కాకుండా డాక్టర్ సూరి శ్రీమతి పేరుతో ముద్రించిన లెటర్ హెడ్స్‌తో కథ నడిపించారు.
ఈ సూరి శ్రీమతి వయస్సు ప్రస్తుతం 94 ఏళ్లు అని, ఆమెకు తెలియకుండానే నమ్రత ఈ పని చేసినట్టు గుర్తించిన గోపాలపురం పోలీసులు ఈ మేరకు వాంగ్మూలాలు నమోదు చేశారు. నమ్రతకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో సహా మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఏజెంట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరి ద్వారానే మగ శిశువును గరిష్టంగా రూ.4.5 లక్షలు, ఆడ శిశువును గరిష్టంగా రూ.3.5 లక్షలకు ఖరీదు చేస్తోందని, వారిని సరోగసీ పేరుతో రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఈ ఏజెంట్ల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.