
హెచ్–1బీ వీసా సమస్యపై కేంద్రం ఎందుకు మౌనం?
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనాతీరు ఆయన ప్రియ మిత్రుడు ప్రధాని నరేంద్ర మోదీకి తప్ప ఎవరికీ అర్థం కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. హెచ్–1బీ వీసాపై ఏటా లక్ష డాలర్ల రుసుం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం ఎందుకు మౌనం పాటిస్తోంది? దీని వెనుకున్న మర్మమేంటి? అని ఆయన ప్రశ్నించారు.
ఈ మేరకు శనివారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. హెచ్–1బీ వీసాలు పొందే దేశాల్లో భారత్‌దే మొదటి స్థానమని, ట్రంప్ నిర్ణయ ప్రభావం మనపైనే ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయంపై ముందస్తుగా అమెరికాతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించడంలో కేంద్రం విఫలమయ్యిందని విమర్శించారు. ‘కనీసం ప్రస్తుతం ఉన్న అమెరికాలో ఉన్న హెచ్– 1బీ వీసాదారులకు మినహాయింపులను సాధించడంలోనూ కేంద్రం విఫలమయ్యింది. భారత్‌కు నష్టం చేకూర్చేలా ట్రంప్ ఇప్పటికే 50 శాతం టారిఫ్ విధించారు.
ఇప్పుడేమో హెచ్–1బీ వీసా ఫీజును పెంచారు. అయినా మోదీ ఎందుకు స్పందించడం లేదు? ట్రంప్ నిర్ణయం వల్ల అధికంగా ప్రభావం పడే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి లేఖ రాస్తాం. సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపకుండా.. ఇది మన మంచికే అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం’అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.